మిథిలాపురములో వేలాది మంది ఆ శివధనుస్సు ఉన్న బండిని ఈడ్చుకుంటూ వచ్చారు. విశాలమైన ప్రదేశంలో పెట్టారు. అనేకమంది రాజులు వచ్చారు. అయితే, దానిని విరచాలని రాలేదు. సీతను పెండ్లాడాలని వచ్చారు. పాపం! వారి ఆశలన్నీ అడియాసలైనాయి. కారణమేమిటి? వారు ప్రతిఫలం ఆశించి వచ్చినటువంటి వారేకాని, పవిత్రమైన దివ్యత్వాన్ని ప్రకటించే నిమిత్తం రాలేదు. రామలక్ష్మణులకు ఏ అభిష్టమూ లేదు. ఏ ప్రతిజ్ఞులూ లేవు. మేము దానిని విరుస్తామనే అహంకారం కూడా లేదు. అసలు ఇష్టమే లేదు. అందరితోపాటు సమానంగా కూర్చున్నారు. "రామా! దీనిని నీవు విరచగలవా? అని ప్రశ్నించాడు విశ్వామిత్రుడు రాముడు నవ్వాడు. "ఈ చిన్న ధనస్సును ఎడమ చేతితోత్రుంచవచ్చును. ఇది నీవు త్రుంచగలవా? అని నన్ను ప్రశ్నిస్తున్నాడేమిటి! ఇదే మాయ" అనుకున్నాడు. ఈ సభకు అనేకమంది బలశాలురు వచ్చారు. రావణాసురుడు కూడా వచ్చాడు. తన బలపరాక్రమమునంతా ప్రదర్శించి ధనస్సును ఎత్తబోయాడు. కాని, చేతకాక దాని క్రింద పడిపోయి కదలలేక పోయాడు పాపం! అందరూ ఫక్కున నవ్వారు. ఈ అవమానాన్ని భరించుకోలేకపోయాడు. రావణుడు. పదితలలనూ ఒక్క తూరి తీసివేసినట్లుయింది. అహంకారము, అభిమానము, అసూయ ఉన్నటువంటి వారికి ఎక్కడపోయినా అవమానం తప్పదు. ఈ సమయంలో పదునాల్గు సంవత్సరములు కల్గిన రాముడు ధనస్సు వద్దకు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చాడు.
అక్కడున్న వారందరూ. ఈ పిల్లవాడేమిటి, ఈ ధనస్సును విరచట మేమిటి? ఇతనిని అనుమతించిన వారెవరు?" అని ఈ విధంగా ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతూ ఉన్నారు. రాముడు ధనస్సు వద్ద నిల్చాడు. సభనంతటినీ ఒక్క తూరి పరికించాడు. ఎడమచేతితో దాని నెత్తాడు. అంతే! అక్కడ చేరిన ప్రజల హర్షధ్వానాలు మిన్నుముట్టాయి. ఇంక నా రి కట్టాలని ఎడమచేతిలోనే దానిని వంచాడు. వెంటనే అది మహాప్రళయ భయంకరంగా శబ్దం చేస్తూ విరిగిపోయింది. ఏ ఆటంబాంబో ఏ హైడ్రోజన్ బాంబో వేస్తే వచ్చే శబ్దం ఏవిధంగా ఉంటుందో ఆవిధంగా ఉంది అది. ఈ దృశ్యాన్ని అందరూ ఆశ్చర్యచకితులై చూశారు. అయితే, రాముడు శివధనుస్సును అవలీలగా ఎత్త గల్గుటకు కారణ మేమిటి? అతడు సాక్షాత్తు నారాయణమూర్తి, అనగా అతనియందు నూటికి నూరుశాతం ఆకర్షణ శక్తి వున్నది. అందువల్లనే ఆ బరువును ఎత్తనవసరం లేకుండా అదే తన దగ్గరకు వచ్చేసింది. ఇంక, సీత భూజాత, భూమికిఅయస్కాంత శక్తి చాలఅధికంగా ఉన్నది. కనుక, సీత కూడా పూర్తి అయస్కాంత శక్తితో నిండియున్నది. దీనిని సైన్సు కూడా అంగీకరించక తప్పదు. అందువల్లనే సీత కూడా శివధనస్సును సులభంగా ఎత్తగల్గింది. సీతారాములు ఇరువురూసాక్షాత్తూ దైవశక్తులుఎక్కడ అయస్కాంత శక్తి ఉంటుందో అక్కడ ఎలక్ట్రిక్ పవర్ అనేది ఉంటుంది. కనుకనే, సీతారాముల తేజస్సు సర్వత్ర వ్యాపించి పోయింది. ఈ తేజస్సు మన దేహములందు కూడా ఉన్నది. కాని, ఒకరియందు ఎక్కువగా, మరొకరి యందు తక్కువగా ఉండవచ్చును.
సీతారాములందు మాత్రము సర్వశక్తులున్నాయి. కేవలం - లోకోద్ధారణ నిమిత్తమై మానవాకారము ధరించారు.
(శ్రీ 4.4.పు.54/55)
(చూ! దైవశక్తులు)