శిరస్సునే దైవలోకము అన్నారు. ఎందుకనగా శిరస్సునందే శబ్దస్పర్శరూపరసగంధాలుంటున్నాయి. నరలోకము మన - కంఠములో చేరి ఉంటున్నది. నాగలోకం మన హృదయంలో ఉంటున్నది. దేవలోకము, నరలోకము, నాగలోకము మన దేహములోనే ఉంటున్నాయి. ఇంతటి పవిత్రమైన శరీర తత్వాన్ని తెలుసుకోకుండా జీర్ణించి పోయేది శరీరము అనుకుంటున్నాం. దహించి పోయేది దేహము అనుకుంటున్నాం. దేహము జీర్ణము కావచ్చు కానిదేహానికి నాశనం లేదు.
(ద.స.98 పు.53)
ఒకానొక సమయంలో అశోక చక్రవర్తి తన మంత్రితో కూడి విహారార్థం బయలు దేరాడు. మార్గమధ్యంలో ఒక బౌద్ధగురువు వారికి ఎదురయ్యాడు. తక్షణమే అశోకుడు తన శిరస్సును ఆ బౌద్ధగురువు యొక్క పాదములపై పెట్టి నమస్కరించాడు. ఈ దృశ్యాన్ని చూసి మంత్రి చాల నొచ్చుకున్నాడు. అశోకచక్రవర్తి అత్యంత విలువైన తన శిరస్సును ఒక సాధారణ సన్యాసి పాదములపై పెట్టినాడే అని బాధపడ్డాడు. అతడు పేరుకు మంత్రియేకాని చాల సంకుచిత బుద్ధి గలవాడు. అశోకుని కున్న విశాల హృదయం అతనికి లేదు. ఇంటికి వెళ్ళిన తరువాత సమయం చూసుకొని అశోకునితో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. కాని అశోకుడేమీ మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాడు. సరియైన సమయం చూసుకొని మంత్రికి సత్యాన్ని బోధించాలని సంకల్పించుకున్నాడు.
కొన్ని దినముల తరువాత అశోకుడు ఆ మంత్రిని పిలిపించి, "మంత్రీ! నాకు మూడు శిరస్సులు కావాలి. ఒకటి మేక శిరస్సు, రెండవది పులి శిరస్సు, మూడవది మనిషి శిరస్సు. ఈ మూడింటినీ తీసుకొని రా" అన్నాడు. మంత్రి మేకమాంసం అమ్మేవాని వద్దకు వెళ్ళి మేక శిరస్సును తీసుకువచ్చాడు. అడవికి వెళ్ళి వేటాడి పులి శిరస్సును తీసుకు వచ్చాడు. ఇంక స్మశానమునకు వెళ్ళి అప్పుడే పూడ్చబో తున్న శవము యొక్క శిరస్సును ఇండించి తీసుకువచ్చాడు. "రాజా! మీ ఆజ్ఞ ప్రకారం వీటిని తీసుకువచ్చాను" అన్నాడు. "మంచిది. ఈ మూడింటిని రేపు మార్కెట్ కు తీసుకువెళ్ళి అమ్ముకొని రా " అన్నాడు. మరునాడు మార్కెట్ కు పోతూనే ఎవరో ఒక తిండిపోతు వచ్చి మేకశిరస్సును కొనుక్కున్నాడు.
ఇంటిద్వారంపై ఆలంకారంగా పెట్టుకోవచ్చునని పులిశిరస్సును మరొకడు కొనుక్కున్నాడు. కాని మనిషి శిరస్సును మాత్రం ఎవ్వరూ కొనలేదు. మంత్రి తిరిగి వచ్చి అశోకునితో, “చక్రవర్తీ! ఈ మనిషి శిరస్సును ఎవ్వరూ కొనటం లేదు" అన్నాడు. "సరే, కొనకపోతే పోనీ, ఎవరికైనా ఊరికే ఇచ్చివేసిరా " అన్నాడు. మార్కెట్లో మనిషి శిరస్సును ఫ్రీగా తీసుకోవడానికి కూడా ఎవ్వరూ అంగీకరించ లేదు. మంత్రి తిరిగి వచ్చి, "మహారాజా! ఊరికే ఇస్తామన్నా దీనిని ఎవ్వరూ తీసుకోవడం లేదు" అన్నాడు. అప్పుడు అశోకుడు, మం త్రీ ! జీవ మున్నంత వరకే ఈ శిరస్సుకు విలువ ఉంటుంది. జీవం పోతూనే శిరస్సుకు కూడా విలువ పోతుంది. కనుక జీవ మున్నప్పుడే మహనీయుల పాదములపై శిరస్సు పెట్టి ఆ పవిత్రతను అందుకోవాలి. జీవమున్నంతలోనే శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి" అన్నాడు. పెద్దల పాద స్పర్శమే శరీరమునకు సరియైన విలువను చేకూర్చుతుంది. కాని అనేకమంది నాస్తికులు దీనిని విమర్శిస్తుంటారు. ఇది తెలివి తక్కువతనం!
కౌరవపాండవ యుద్ధం జరిగినప్పుడు భీముడు దుర్యోధనుని క్రింద పడగొట్టాడు. దుర్యోధనునిలో ప్రాణం ఇంకా కొంతవరకు మిగిలి ఉండగా భీముడు తన కాలుతో అతని శిరస్సును తన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, "భీమా! నేను క్రింద కూలకముందు నా శిరస్సును అన్నియుంటే నా ప్రతాపం చూపించేవాడిని. ఇప్పుడు నా ప్రాణం పోతున్న సమయంలో నా శిరస్సును నీవు కాలులో తన్నడం గొప్పతనం కాదు. ఇంక కొన్ని నిమిషముల తరువాత కాకులు, గ్రద్దలు కూడా నన్ను కాళ్ళలో తంతాయి" అన్నాడు. కనుక ప్రాణం ఉన్నప్పుడే శిరస్సుకు విలువ సందించుకోవాలి. మహనీయుల పాదములపై శిరస్సును పెట్టి తద్వారా దానిని పవిత్రం గావించుకోవాలి. జీవితం శాశ్వతం కాదు. మనం చేసే కర్మలే శాశ్వత మైనవి, సత్య మైనవి.
(స.పా.మే.97 పు.117/118)