విద్య యొక్క పరమావధి వినయమే. విద్యకు నమ్రతయే ప్రధానమైన దృష్టి, శీలమే ప్రాణము. "మాతృదేవోభవ, పితృదేవోభవ" "సత్యందవ, ధర్మంచర” అని శిక్షావల్లి తెలుపుచున్నది. మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి. మీరు జీవితములో ఎట్టి పరిస్థితులందైననూ సత్యాన్ని వీడరాదు, ధర్మాన్ని తప్పరాదు. ఈ విషయమైన పవిత్ర బోధనలను “శిక్షావల్లి" అనే పేరుతో తైత్తిరియోపనిషత్తు ఆనాటి విద్యార్థులకందించి, వారిని సన్మార్గములో ప్రవేశపెట్టి. వారి మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చగలిగినది. నీవు ఏపని చేసినా దాని ఫలితం అనుభవిస్తావు. ఈనాడు నీ స్నేహితుని నీవు మోసగిస్తే, భవిష్యత్తులో నీ స్నేహితుడే నిన్ను మోసగిస్తాడు. ఈనాడు నీ తల్లిదండ్రులను నీవు గౌరవిస్తే, రేపు నీ బిడ్డలు కూడా నిన్ను గౌరవిస్తారు. భవిష్యత్తు యొక్క ఈ మంచి చెడ్డలన్నింటిని వర్తమానము నందే విడమర్చి, ముక్తమైన స్వరూపాన్ని అందించినది తైత్తిరియోపనిషత్తు,
(స. సా.న.91 పు.300)
శిక్షావల్లియందు కర్మకు విరుద్ధములగు సంహితాది విషయములు కర్మ సముచ్చయములగు ఉపాసనలు వివరింపబడినవి. స్వారాజ్యము దీని ఫలము. ఇంత మాత్రమున సంసారబీజ మశేషముగా నాశన మొందనేరదు. ఉపాసన కామనావిరుద్దము కాదు. దానిచే కర్మవలెనే ఉపాసనము కూడా మోక్షహేతువు కాదు. అజ్ఞానము సంసార కారణము. ఇది నశించుటచే మోక్షమబ్బును. ఆజ్ఞానము సహజ సిద్ధము. మనము కూర్చున్న రైలు బండి నిలిచియుండి ప్రక్కన మరియొక బండి పోవుచుండగా మనము కూర్చున్న బండియేపోపుచున్నట్లు ప్రత్యక్షముగా కనబడును.
(ఉ.వా, పు. 72)