భారతీయ పరమార్థము మహావిశాల భావాలతో, ఉన్నత ఆశయములతో పవిత్రతలంపులతో ప్రవహించిన వాహిని. మలుపులేక, కలతకాక అనుగ్రహ సాగరమునకు చక్కని బాటగా యేర్పడిన రాజబాట. ఇంకొకటి: భారతీయులయొక్క మత నిర్మాణ మంతటికినీ, భగవంతుడే, ఈశ్వరుడే మూలస్తంభమైయుండగా మరొక దానిని విశ్వసించనక్కరలేదు. అన్ని మతములకు అధిష్టానమైన స్థాయిలో ఉన్నత శిఖరమున నిలచిన మతము భారతీయ మతము. ఈ మతమునకు విరుద్దమయిన ఆశయములు గల ఇతర మతములను భారతీయ మతము అనేక స్థాయిల యందు, అనేక రీతుల ఖండించినది. భారతీయుల మరొక మతముల నమసరింప పని లేదు. ఇందులో లేనివి మరే మతమునందు కానరావు. భారతీయ మతము నందలి భావములనే ఇతర మతములు ఆదర్శముగా వేరు వేరు రూప నామములలో అనుభవించుచున్నారు. ఇతర మతముల వారు భారతీయ వైదిక మతమును అనుసరించిన అనుసరించ వచ్చును. కానీ భారతీయులు ఇతర మతముల ననుసరించు నవసరము లేదు. మనము ముఖ్యముగా గమనింప వలసినది ఆత్మను గూర్చియు, ఈశ్వరుని గూర్చియూ, ఆస్తిక ధర్మమును గూర్చియూ జరిగిన విచారము. ప్రపంచవాజ్మయమున గూడా ప్రాచీన తమమైనది ఆర్యవాజ్మయము. ఇంతకన్నా ప్రాచీనరచనలుయేదేశమందునూ యెచ్చటనూ లేవు. ఒక వేళ వున్ననూ వాటికి వాజ్మయ నామము చెల్లదు. ఇంత పురాతనమైన గ్రంధము వాజ్మయము ప్రపంచముననే ఎందునూ లేదు. ఆర్యుల చిత్త వృత్తులు, వారి వాంఛలు వారి వ్యవహార విషయములు, వారల నెదుర్కొన్న సమస్యలు మున్నగు సంగతులు ఇందు చిత్రింపబడినవి.
(స.వా.పు. 11/12)