ప్రేమస్వరూపులారా! భగవంతుని లీలలను విమర్శించడం సులభమేకాని, భగవత్తత్వాన్ని తెలుసుకోవడం అతి కష్టం. భగవంతుడు సత్యాసత్యము లందున్నాడు, ధర్మాధర్మము లందున్నాడు, మంచి చెడ్డలయందున్నాడు. ఇట్టి సర్వవ్యాపకమైన దివ్యత్వాన్ని ఎవరు తెలుసుకోగలడు? ఆ చెట్టుకొమ్మపై ధ్రువనక్షత్రంలో ఉంది, చూడు అని చెప్పినప్పుడు నిజంగా చెట్టుకొమ్మపై ధ్రువ నక్షత్రం ఉన్నదా? లేదు. కాని, ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో ఉన్న ధ్రువనక్షత్రాన్ని ఆ చెట్టు కొమ్మ నాధారంగా తీసుకొని చూడగల్గుతున్నాము. అదేవిధంగా, వేదశాస్త్రేతిహాస పురాణములు భగవత్తత్వాన్ని ప్రత్యక్షంగా నిరూపించ లేకపోయిప్పటికీ భగవంతుని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎత్తైన కొండలను చూస్తే ఉల్లాసం కల్గుతుంది. దట్టమైన అడవులను, ప్రవహించే నదులను చూస్తే ఆనంద ముప్పొంగుతుంది. ఇవన్నీ భగవంతుని శక్తి సామర్థ్యాలను నిరూపిస్తున్నాయి. తారలు వెలుగు తున్నాయి. గ్రహములు తిరుగుతున్నాయి. సూర్యుడు మండుతున్నాడు. గాలి వీస్తున్నది. ఇవన్నీ భగవత్తత్వానికి చిహ్నములే. ఆగ్ని కణాన్ని అర్థం చేసుకున్నప్పుడు అగ్ని స్వభావాన్ని అర్థం చేసుకోగల్గినట్లుగా, అణువైన ప్రకృతి స్వభావాన్ని గుర్తించినప్పుడు అనంతమైన భగవత్తత్వాన్ని గుర్తించ వచ్చును. దీనిని పురస్కరించుకొనియే ఉపనిషత్తులు,
"అణోరణీయాన్ మహాతో మహీయాన్" అన్నాయి. సమస్త మానవులందు ప్రకాశించేది ఈ దివ్యత్వమే. కాని, మానవుడు దేహభిమానమును అభివృద్ధి పర్చుకోవడం వల్ల దీనిని గుర్తించలేక పోతున్నాడు.
(స. సా.అ..96 పు.253)