బ్రహ్మాభ్యాసమనగా ఎల్లప్పుడూ బ్రహ్మమునే తలంచుట, ప్రార్తించుట, ఉపన్యసించుట, అతనితో కలసిపోగలుగుట. అందుకనే పంచదశిలోకూడా ఇట్టే చెప్పబడినది. "తత్ చింతనమ్, తత్ కథనమ్. అన్యోన్యం తత్ ప్రభోధనమ్: ఏతత్ ఏకపరత్వంచ జ్ఞానాభ్యాసం విదుర్బుధాః" బ్రహ్మనే తలచుట, మాటాడుట, చింతించుట మొదలయినవి జ్ఞానులచే జ్ఞానాభ్యాసమని తెలియబడును. దీనినే కృష్ణుడు గీతలో కూడ బోధించెను. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంత:పరస్పరమ్; కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ." నా యందే మనస్సుంచి నాయందే దాగి, నన్ను గురించి ముచ్చటించుచూ తెలుసుకొన్న వారు తృప్తి పొంది ఆనందించెదరు.
కాన బ్రహ్మచింతన అనెడి పదమునే ఆత్మాభ్యాసమనియు, జ్ఞానాభ్యాసమనియు కూడా వాడెదురు. మనసు విషయాసక్తి వలననూ, విక్షేపశక్తివలననూ, బహిర్ విషయములమీదికి పరువెత్తుచుండును. కానీ మరల మరల దానిని లక్ష్యము పైకి తెచ్చు చుండవలెను. ప్రధమములో అది కష్టముగా నున్ననూ, మన శిక్షణద్వారా మనసును పలుచపరుప గలిగినప్పుడు ఓం అను జపముమీద నిలువగలదు, శిక్షణ, సామ, దాన, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము అనెడి ఉపాయములతో మనస్సును కట్ట వలెను. మనసును భజనలు, ప్రార్థనలు, సత్యగుణములు, సత్ప్రవర్తన మొదలగువాటితో నింపి క్రమేణా బ్రహ్మాభ్యాసము లోనికి దింపవలెను. ఆత్మయందు ధ్యానము సాగింపగా సాగింపగా మనసునందు క్రొత్తఆసక్తులు బయలుదేరును. ఇట్టి శిక్షణ చేత మనసును ఇతర విషయములపై వురకకుండా హృదయ గుహయందు బంధింపవచ్చును. అట్టిసాధనయొక్క ఫలితమునే నిర్వికల్ప సమాధి అందురు. అట్టి సమాధిఫలితము బ్రహ్మజ్ఞానమనబడును. బ్రహ్మజ్ఞానఫలమే మోక్షము,లేదా జననమరణముల బారినుండి విముక్తి అనిగాని ఆనుచుందురు. వాంఛలను విసర్జించుట, మనస్సును నిర్మూలించుట, తత్త్యజ్ఞానము, ఈ మూడున్నూ కలిపి సాధన చేయవలెను. అప్పుడే ఆత్మజ్ఞానము లభించును.
(జ్ఞావా.పు. 49/50)
(చూ॥ బ్రహ్మాభ్యాసము)