దైవత్వము పరిశోధన లచే లభ్యమయ్యేది కాదు. చెఱకు లోని తీపి, మిరపలోని కారము, నిమ్మలోని పులుపు ఇవన్నీ భగవంతుని ఉనికిని ప్రబోధిస్తున్నాయి. తారలు వెలుగుతున్నాయి. గ్రహములు తిరుగుతున్నాయి, గాలి వీచుచున్నది. వర్షము కురియుచున్నది. సూర్యుడు మండుచున్నాడు- వీటికన్నిటికీ కారణం భగవత్తత్వమే. పర్వతములను, ప్రవాహములను, అడవులను చూస్తే ఆనందం ఉప్పొంగుతుంది. ఇవన్నీ భగవంతుని చిత్ర విచిత్రములే, ఈ ప్రకృతి సౌందర్యము భగవంతుని ఉనికిని నిరూపిస్తూ వస్తున్నది.
భగవంతుని ఉనికిని కనుగొనుటకు ఆధ్యాత్మిక మార్గము ఎంతైనా తోడ్పడుతున్నది. నవవిధ మార్గముల గమ్యం ఒక్కటే. ఏ మార్గమునందైనా భగవంతుని చేరవచ్చు. అయితే దివ్యమైన నామస్మరణయే దీనికి రాజమార్గం. ధ్యానము చేసినా, జపము చేసినా తపము చేసినా ఇంకేవిధమైన క్రతువు లాచరించినా అన్నింటికీ నామమే మూలాధారము. ఋగ్వేదమంతయు నామములో కూడినది. యజర్వేదమంతయు మంత్రముతో చేరినది. సామవేదమంతయు గానముతో కూడినది. నామము, మంత్రము, గానము- ఈ మూడింటితో కూడినదే మానవ హృదయం. మానవదేహమే ఒక యంత్రము శ్వాసయే ఒక మంత్రము(సోహం..) హృదయమే ఒక తంత్రము. ఈ దేహమనే యంత్రములో ఏ చిన్న భాగమైనా సరిగా లేకపోతే ఇది పనికి రాదు. చంద్రమండలానికి ఈనాడు రాకెట్స్ పంపుతున్నారు. అయితే అందులో ఏ చిన్న స్క్రూ గాని, పిన్ను గాని సరిగా లేకపోతే అది క్రింద పడి భస్మమై పోతుంది. అదేవిధంగా దేహమనే యంత్రంలో సర్వేంద్రియాలు సక్రమమైన రీతిలో పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడే మానవత్వము దివ్యత్వంగా మారడానికి అవకాశము ఉంటుంది. దీనికి తగిన మార్గమేమిటి? ఏ కర్మల నాచరించినా భగవ త్ప్రీత్యర్థం చేస్తున్నామనే ఉత్తమ భావం ఉంచుకోవాలి. అప్పుడే జీవితం సార్థకమవుతుంది.మీ పనులను, మీ ఉద్యోగాలను మీరు వదలనక్కర లేదు. కాని, మీరు చేసే సర్వకర్మలూ భగవ త్రీత్యర్థమనే భావాన్ని హృదయంలో చిత్రించుకోవాలి.
(స. సా.మా 96 పు.67/68)