ప్రేమస్వరూపులారా! సుఖముగాని, ఆనందము గాని మనకు ధనకనక వస్తు వాహనాదులవలన లభ్యం కాదు. వ్యక్తులవలన అసలే లభ్యం కాదు. ఆనందము హృదయము నుండియే ఆవిర్భవిస్తుంది. కనుక, మీ దృష్టిని హృదయంవైపు మరల్చుకోండి. "అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః" అనే సత్యాన్ని గుర్తించండి. మానవుడు ఆనందపిపాసి. అయితే, ఆనందాన్ని బయట వెతకనక్కర్లేదు. ఆనందం మన ఇంటనే, వెంటనే, జంటనే ఉన్నది. అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకున్నప్పుడు ఆనందం మనం పిలువకనే ప్రత్యక్షమౌతుంది. మానవుడు భౌతికమైన సుఖాలకోసం ప్రాకులాడుతున్నాడు. ఏమిటీ సుఖాలు?
"మలినపు కొంప రోగముల మ్రగెడు
సేవక గంప జాత సం
చలనము పొందు దుంప భవసాగర
మీదగలేని కంప అం
బులపొది లెమ్ము చూడ మనమెప్పు
దలంప దేహమింక ని
శ్చలమని నమ్మబోకు మనసా హరిపాదము
లాశ్రయింపవే!"
ఇలాంటి దేహంతో మనకు శాశ్వత సుఖం ఎలా లభిస్తుంది? హరిపాదములే మనకు శాశ్వత సుఖాన్ని అందిస్తాయి. హరిచింతనయే నిజమైన సుఖము. కాని, ఈనాడు భారతదేశంలో భక్తి ప్రపత్తులు సన్నగిల్లుతున్నాయి. భౌతికమైన, ప్రాకృతమైన విషయాలపై మనస్సు భ్రమిస్తున్నది. ఏమిటీ భ్రమలు? ఏమిటీ సుఖాలు? ఇదంతా కేవలం బొమ్మలాటగా కనిపిస్తున్నది.
ఈ లోకపు లీలానటన
ఒక బొమ్మల ఆటయే కాదా!
అతడొక రాజా, ఇతడొక కూలీ
కాదని ఎవరనినా అదేగా
అవునని ఎవరనిగా ఇదేగా
లోకములోని పోకడ చూడ
ఈ గతి కాదా బాగా తెలియ
లోకములోని చీకటి చూడ
ఈ గతి కాదా బాగా తెలియ..."
లోకంలో అంతా చీకటే. అదే అజ్ఞానం. ఇది కేవలం తమోగుణ ప్రభావమే. తమోగుణంలో జీవిస్తూ సాత్వికతత్యాన్ని గుర్తించాలంటే ఎలా సాధ్యమౌతుంది?
(స.పా.మే. 2002 పు. 151/152)