బోధము రెండు విధములుగా ఉన్నది. ఒకటి పరోక్ష బొధము. రెండవది అపరోక్షబోధము. వేదవేదాంగములచే, యుక్తి ప్రయుక్తులచే ఊహలచే యిదమిత్ధమని తెలిసికొను తెలివియంతయు పరోక్షబోధము. అట్లు తెలిసి కొననదంతయు అనుభవసిద్ధమైనప్పుడు అదియే అపరోక్ష బోధమని అందురు. సత్యజ్ఞానానంద పరబ్రహ్మము స్వరసిద్ధము గాన పరోక్షజ్ఞానమే; ఒక విధముగా తలంచిన నీ పావనమైన బ్రహ్మమునకు పరోక్షతాపరోక్షతలులేవు. ఇది రెండింటికిని అతీతమైన విలక్షణ వస్తువు. ఇట్టి బ్రహ్మవిద్యయగు నపరోక్షజ్ఞానసిద్ధిని బడయుటకు మొదటి సాధన సద్గురు శిష్య సద్గురువు నాశ్రయించి అతనిపై సంపూర్ణ విశ్వాసముంచి ఆతనిని నిరంతరము సేవించుచుండవలెను. గురు ప్రభుడు కూడను. నిరంతరము బ్రహ్మనుగూర్చి సులలితభావముతో బోధించుచుండవలెను. అట్టిబోధనను నిరంతరము శిష్యుడు వినుచుండినయెడల అది పరోక్షజ్ఞానమగును. ఇట్టి శ్రవణాంగము సిద్ధించినయెడల ఈ పరోక్షజ్ఞానమే ఎల్లప్పుడూ మననము చేసిన, అపరోకజ్ఞానముగా మారును. పరోక్షజ్ఞానమున నీటిపై వ్రాయు అక్షరముల భంగి క్షణభంగురైనది. కాని, అపరోక్ష జ్ఞానమో రాతిపై చెక్కబడిన అక్షరములరీతి శాశ్వతముగా నిలుచును ఇట్లు గురుప్రభువును సంపూర్ణముగా విశ్వసించి ఎల్లప్పుడూ బ్రహ్మజ్ఞాన శ్రవణము చేయుచుండిన అది మననము జేయబడినదై అటు మీదట అపరోక్షజ్ఞానవధిని యగును.
(ప్ర.వా.పు.76)