ఈ క్రింద వ్రాసిన బుఱ్ఱకథ" అర్థము చేసుకో. చాలవరకు నీవు అనునది ఎవరో బోధపడగలదు. దాని మూలమున కూడా చాలావరకు వైరాగ్యము రాగలదు. ఆపై నేను చెప్పెడి విషయము నీవు అనునది సులభముగా తెలియును. "బుట్టకథ" కేవలము చదువుటయేకాక పదపదమునకూ అర్ధము తెలసికొని ఆలోచించు; గిర్రున నీ బుఱ్ఱతిరుగును.
1. విను చక్కగ
తైతైతైతైతై బొమ్మా
దీని తమాషజూడర మాయబొమ్మ
ఖ్యాతి దీనికి ముందు వెన్కగల
కథ వివరింతును విను జీవా “తై”
2. మాతృగర్భమున మలమూత్రమ్ముల రోతల నీవు రోదింప
ప్రీతిగ వీరలు పేరంటమ్ములు చేతు రిదెంతటి
చిత్రమురా “తై”
3. పుట్టితి, మది గోల్పోయితి, దుర్గతి పట్టితివని నీ వేడువగా
అట్టెనవ్వు చునానందించెద రిట్టివీరు నీ కెవరయ్యా “తై”
4. మసిలో మట్టిన మలమూత్రములన్
మసలుచు సిగ్గనమాటయె లేక
పసిపాపడపై పడుచు లేచుచు
దిన మొక నాటక మాడవకో “తై”
5. తోడివారలతో కూడియాడుచు వేడుకతో పలువిద్దెలు నేర్చుచు
చూడచూడగ చోద్యపుకళతో ఏడేడునకు ఎదిగే బొమ్మ “తై”
సతిపతియని సరసభావమున జత జేరుచు సంసారరంగమున
అతికౌతుకముననంతకన్ననికఅన్యములేదనిఆడితిరే “తై”
6. బొమ్మను బొమ్మను పొందుపఱచి పలు
బొమ్మలు సేయుర బ్రహ్మయ్య
నమ్ముట వన్నియు నావేయని దిం
దిమ్మని వానితో నాడుదుగా “తై”
7. ధనము గూర్చునెడ దాచి పెట్టునెడ
దానిబెంచ నది చనినపుడున్
తనువుతోడ నీ మనసుతోడ
నీ తాండవ మెన్నగ తరమౌనా “తై”
8. కామము క్రోధము గట్టికోలగా తామసంబు ముక రాడును గాగన్
కామినియున్ కనకంబు చేతిలో గంగిరెద్దులై గంతులు వేసే “తై”
9. సాగుచున్నదని లోగినవారిని సంకట పెట్టుటె సంతసమా
ఈగకాలియంతే వికటించిన నీగతి తైతకలేగాదా “తై”
10. ఉరిమిచూచును కరములూచుచు ఒడలెరుగని శివ
మొందుచును
ఆరుచు చెగురుచు నందురు. నవ్వగ ఆగ్రమను
దయ్యము పట్టిన“తై”
11. చదువెందులకను సంగతెమఱచి
ఉదరపూర్తికే ఉటుకులెత్తుచు
ఎదటి గొప్ప సహియింపకేడ్చుచు.
సతమతమయ్యే చదువలబొమ్మ “తై”
12. గుట్టుగ నీ చెడుకోర్కె చెల్లనని లొట్టలు గొట్టకు రోరన్నా
చిట్టా వ్రాసే చిత్రగుప్త కండ్లెట్టుల గంతలు గట్టుదురా .. “తై”
13. అందము ప్రాయము ఇంద్రియ శక్తియు
ఉందని నిక్కకు రోరన్నా
ముందున్నవిరా తొందరలోనే
ముసలితనమ్మను ముసళ్ళపండువు “తై”
14. మెసలలేవు కనుమసకలు మోమున
మడతలుబడె తల వెరిపెనుగా
ముసలికోతియని పనివారలు నిన్
ముసిముసి నవ్వగ గసరుకొనే ఓ - “తై”
15. చచ్చుదాక సంసారచింతలో పుచ్చిన లాభము ఒచ్చేనా
అచ్చట నీ మయనూతన కడ్డము వచ్చే దేదిరా పిచ్చయ్యా “తై”
బుర్రుమనుచు జీవుం డను పిట్ట బొట్టబొమ్మను విడిపోగా
బిర్రుగనీల్గిన కఱ్ఱబొమ్మ యిది బర్రున బైటికి పట్టి లాగే “తై ”
16. పంచభూతసంభవమై మేనిక
పంచత్వము ప్రాప్తించుగదా
వంచితుడై నాదంచు దీనకై
వాంఛగొంచు దుఃఖించే జీవా“తై ”
17. బంధువులందరు వాకిటదాకను వత్తురుగా
బంధమణచి నిన్ బాయని ఆపద్బంధువు భగవన్నాము మెరా “తై ”
18. నమ్ముకొనకు నిత్యమ్మని దేహము
పుట్టిముంచు విది నట్టేటన్
తుమ్మునంతలో తూలిపోవు నీ
తొమ్మిది తొఱ్ఱల తోలుబొమ్మ “తై ”
19. ఆపదలన్ సౌఖ్యంబులందురు
ఏపుమీరగా ఏడ్చుచు నవ్వుచు
ఆ పరమేశ్వరు నానతి మేఱకు
ఆడే భోగము తాపా బొమ్మ “తై ”
20. ధర్మకర్మసూత్రంబుల గొనినన్ దా నాడింపక దైవంబు
మర్మమెరుంగక మాయేటందువు మాధవుచేతి కీలుబొమ్మ “తై ”
21. తరతరమును సుస్థిర మనిపించుచు
పరమావస్థలపాలు సేయుచు
మరునిముసం బిది మరుగుపడురా
పరమాత్ముడు సల్పిన మాయబొమ్మ “తై ”
22. చెట్టైపుట్టి చేమై దోమై చిలుకై కొండచిలువయు నౌచు
పుట్టుచు గిట్టుచు కొట్టుకొనుచును గట్టే వెదుకని కర్మ జీవా “తై ””
23. అరుదుగ దొరికెను నరజన్మం బిది.
అరనిముసము వృధపరుపకురా
తెరవు నెరిగి చని పరమాత్ముని గని
చిరసుఖమొందర చింతా జీవా “తై ”
24. ఏ యదృష్టమున సాయికృష్ణుడై ఆ యఖిలేశుం డగుపడురా
హాయిగ సత్యసాయి నాత్మలో అరయుచు నిను విని ఎరుగుమురా “తై ”
25. నీటుగ మాటలు కోటి పల్కిన నీకడు పింతయు నిండదురా
సూటిగ నాత్మజ్యోతిని గన్ననె ఆటవిడుపు నీ కగునయ్యా “తై ”
26. వ్యర్ధంబగు నీ వెర్రి బుఱ్ఱ కథ విని యజ్ఞానము వీడు జీవా
సార్థక సత్యసాయి బుఱ్ఱ కథ కని ప్రజ్ఞానము కొనరన్నా “తై ”
(స.వి.పు.45/49)