ఒకానొక సమయంలో బుద్ధుడు దేశంలోని వివిధప్రాంతాలలో పర్యటిస్తూ, ప్రజలకు సత్యబోధలు సల్పుతూ వచ్చాడు. ఒక రోజున ఒక గ్రామం చేరుకునే సరికి అతడు బాగా అలసిపోయాడు. అప్పుడు తన శిష్యుల్లో ప్రధానుడైన నిత్యానందుణ్ణి పిలిచి "నాయనా ! ఈ రోజు నేను కొంత విశ్రాంతి తీసుకుంటాను. ఇక్కడ చేరిన భక్తులకు నివేదైనా సద్బోధలు సల్పు " అని చెప్పి, విశ్రాంతి తీసుకోవడానికి లోపలికి వెళ్ళాడు. కాని, నిద్ర రాక పోవడంచేత నిత్యానందుని ప్రసంగాన్ని వినసాగాడు. నిత్యానందుడు ఏమని బోధిస్తున్నాడు? ప్రజలారా! బుద్ధునివంటి మహనీయుడు ఇంతకు పూర్వం పుట్టలేదు, ఇకముందు పుట్టబోడు. బుద్ధునికి సమకాలీనులుగా పుట్టడం మీ అదృష్టం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన కృషి చేయండి" అన్నాడు. ఈ మాటలు విని అక్కడ గుమికూడిన భక్తులు పెద్ద ఎత్తున కరతాళ ధ్వనులు చేశారు. వెంటనే బుద్దుడు లేచి వచ్చి నిత్యానందుని భుజంపై చేయి వేసి "నాయనా! నిత్యానందా! నీ వయస్సెంత?" అని ప్రశ్నించాడు. నిత్యానందుడు "నలభై సంవత్సరములు స్వామీ"! అన్నాడు. "ఇంతవరకు ఎన్ని పట్టణాలు చూశావు" ? అని ప్రశ్నించగా "రెండు పట్టణాలను మాత్రమే చూశాను స్వామీ!" అన్నాడు. "ఎంతమంది మహానీయులను దర్శించావు?" అని మళ్ళీ ప్రశ్నించగా, ఎవ్వరినీ దర్శించలేదనిసమాధానం చెప్పాడు. అప్పుడు బుద్ధుడు చెప్పాడు, "పిచ్చివాడా! నీ వయస్సు నలభై సంవత్సరాలు, నీవు రెండు పట్టణాలను మాత్రమే చూశావు. ఏమహనీయులనూ నీవు దర్శించలేదు. అలాంటప్పుడు బుద్దునివంటి మహనీయుడు ఇంత వరకు పుట్టలేదు. ఇకముందు పుట్టబోడు అని చెప్పడానికి నీకేమీ అధికారం ఉంది? నలభై సంవత్సరములకు పూర్వం ఎవరు పుట్టారోనీకేమి తెలుసు? ఎందరో మహానుభావులు పుట్టారు. మున్ముందు ఇంకెందరో మహానుభావులు పుట్ట బోతున్నారు. మహనీయులే పుట్టకపోతే ఈ జగత్తే నిలువలేదు. "జగతియందు పుణ్య పురుషులు లేకున్న జగము లెట్లు వెలుగు పగలుగాను?"మహానీయులు ప్రభావముచేతనే ఈ జగత్తు ప్రకాశిస్తున్నది. "
(స.పా.మే 2000పు. 142/143)
బుద్ధుడు ఆత్మజ్ఞానం నిమిత్తమై అనేక సాధనలు సల్పి కట్టకడపటికి ఇది పండితులు బోధించేది కాదనీ, గ్రంథపఠనంచేత లభించేది కాదని గుర్తించాడు. మొట్టమొదట భగవంతుడు ప్రసాదించిన పంచేంద్రియాలను పవిత్రం గావించుకొన్నప్పుడే ఆత్మజ్ఞానానికి తగిన అర్హతప్రాప్తిస్తుందని. పంచేంద్రియాలను సద్వినియోగ పర్చుకోవడం ద్వారానే మానవుడు తనయందున్న దివ్యత్వాన్ని గుర్తించుకోగలడని బోధించాడు. నిత్యజీవితంలో అనుభవించే ఇంద్రియాలనే పవిత్రం గావించుకోలేనివాడు ఇంక ఇంద్రియాతీతమైన దివ్యత్వాన్ని ఏరీతిగా గుర్తించగలడు? కనుకనే మొట్టమొదట సమ్యక్ దుృష్టిని అలవర్చుకొమ్మని బోధించాడు. బుద్ధుడు. సమ్యక దృష్టి వల్ల హృదయంలో సమ్య భావములు ఆవిర్భవిస్తాయి. సమ్యక భావములవల్ల సమ్యక్ వాక్కు వెలవడుతుంది. సమ్యక వాక్కునుఆచరణలో పెడితే అది సమ్యక్ కర్మగా రూపొందుతుంది. సమ్యక కర్మలను చేస్తూ ఉండడమే సమ్యకసాధన అవుతుంది.
సమ్యక్ దృష్టి అనగా ఏమిటి? పవిత్రమైన దృశ్యములను మాత్రమే చూడాలి. ఎందుకంటే చూసిన దృశ్యములన్నీ హృదయంపై ముద్రించు కొని పోతాయి. కనుక కన్నులున్నాయి కదా అని దేనిని పడితే దానిని, ఎవరిని పడితే వారిని చూడకూడదు. మన శాస్త్రజ్ఞాన మంతయునేత్రములపై ఆధారపడియున్నది. నేత్రమే శాస్త్రము, దృష్టియే సృష్టి, కనుక పవిత్రమైన జ్ఞానం ప్రాప్తించాలంటే దృష్టిని పవిత్రంగా ఉంచుకోవాలి. దృష్టియే మన హృదయంలో సంకల్పములను సృష్టిస్తుంది. దృష్టి మన హృదయ క్షేత్రంలో నాటుకొనే విత్తనం వంటిది. కనుక దృష్టి మంచిదిగా ఉన్నప్పుడే హృదయంలో మంచి సంకల్పములు సృష్టింప బడతాయి. కాని మానవుడీనాడు అసహ్యకరమైన, అసభ్యకరమైన ఘోరమైన దృశ్యములను చూడడం చేత దుర్భావములకు లోనై మానవత్వాన్ని కోల్పోయి మృగంగా మారి పోతున్నాడు. చిట్ట చివరికి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎట్టి దృష్టియో అట్టి హృదయం, ఎట్టి హృదయమో అట్టి సంకల్పం, ఎట్టి సంకల్పమో అట్టి వాక్కు. కమక సమ్యక్ దృష్టి వల్ల సమ్యక్ భావం, సమ్యక్ భావంవల్ల సమ్యక్ వాక్కు ఆవిర్భవిస్తాయి. చూపినదానిని తలచి, తలచినదానిని చెప్పి, చెప్పినదానిని చేయాలి. దీనినే సమ్యక కర్మ అన్నాడు బుద్ధుడు. సమ్యక్ కర్మల నాచరించడమే సమ్యక్ సాధన. దుర్భావములను వీడి సద్భావములను పోషించుకొని సత్కర్మల నాచరించడమే సమ్యక్ సాధన. సత్కర్మలలో ప్రవేశించడమే సరియైన సాధన. పూజలు, జపములు, ధ్యానములు ఇవన్నీ సత్కర్మలు మాత్రమేకాని సాధనలు కావు. సమ్యక్ దృష్టి, సమ్యక భావము, సమ్యక్ వాక్కు, సమ్యక్ కర్మ, సమ్యక్ సాధన - వీటన్నింటితో కూడినదే సమ్యక్ జీవనం.
(స.సా.ఫి.98 పు.29/30)
(చూ ఇంద్రియ నిగ్రహము, దూషించుట, నిర్యాణము, భారతదేశము,
భావము ప్రధానము, వర్తమానము, శీలము, సత్యసాయి)
ఒకానొక సమయంలో కొందరు బుద్ధుని వద్దకు - కచ్చి దైవాన్ని గురించి ప్రశ్నిస్తూ వచ్చారు. అప్పుడు బుద్ధుడు ఏందుకు మీరీవిధమైన వాదోపవాదములతో కాలాన్ని వ్యర్ధం చేస్తున్నారు? దైవము గురించి ఏమీ తెలియని మీతో వాదించి నా కాలాన్ని వ్యర్థం చేసుకోదల్చుకోలేదు. ఈ ప్రపంచమునకు మూలాధారమైనది - సత్యము. అత్యమే భగవత్స్వరూపము. దానినే నేను ఆధారంగా వేసుకున్నాను. మీరు కూడా సత్యాన్ని అనుసరించండి" అన్నాడు. (శ్రీవాణి 2011ఏ పు 4)