మన భారతదేశము ఎంత గొప్పదో ఒక్క తూరి మీరు విచారణ చేయండి. ఇది త్యాగభూమి, యోగ భూమి, కర్మభూమి, మహత్తరమైన భూమి. బాబర్ కుమారుడైన హుమాయూన్ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రోజులలో ఒకనాడు బాబర్ అతనికి ఒక ఉత్తరం వ్రాశాడు. “నాయనా! నీవు చాల అదృష్టవంతుడవు కనుకనే, పవిత్రమైన భారత దేశానికి నాయకుడివైనావు. భారత దేశమును సామాన్యమైనదిగా భావించవద్దు. భారతీయ సంస్కృతిని చక్కగా పోషించు. భారతీయులకు ఆనందాన్ని అందించు" అని వ్రాశాడు. మహమ్మదీయులు కూడా భారత దేశాన్ని ఎంతో ప్రీతిగా చూసుకునేవారు. పూర్వం భారత దేశంలో మహమ్మదీయులు, సిక్కులు, హిందువులు అందరూ చక్కని ఐకమత్యంలో ఒక్క కుటుంబంగా జీవించేవారు.
|
కానీ, ఈనాడు ఒకరి నుండి ఒకరు విడిపోతున్నారు. ఉన్నది ఒకే కులము, అదే మానవ కులము; ఉన్నది ఒకే మతము, అదే ప్రేమమతము: ఉన్నది ఒకే భాష అదే హృదయ భాష ఈ మూడింటినీ దృష్టిలో పెట్టుకుంటే ఎవ్వరినీ మీరు ద్వేషించరు.
(స. సా..మే99.పు.125/126)