ప్రాచీన కాలమునుండి కృష్ణుని గోపాల అనిపిలుచుట పవిత్రముగా భావిస్తున్నాము. గోవు అనగా ఏమి?పశువు అనుకొంటున్నారు. కాదు, కాదు. ఆహారమును అందించి, వ్యవసాయమునకు తోడ్పడి,పాడిపంటల నిచ్చేజీవులను గోవులని పిలుస్తున్నారు. గోపాలురనగా గొల్లవారనిభావిస్తున్నారు. కాదు గోవులను పోషించే వారంతా గోపాలురే. ప్రపంచమునకు సరియైన సంపద గోవులని విశ్వసించినవాడు కృష్ణుడు. నిజమైన సంపదలంటే ఏమిటో గుర్తించలేని స్థితిలో మానవుడు ఈనాడు జీవితమును నిరర్ధకము కావించుకుంటున్నాడు. ప్రింటు కొట్టిన నోట్లను చూచి ఆనందపడే దౌర్భాగ్యస్థితిలో మానవుడు ఈనాడు ఉన్నాడు. గోవులే సరియైన సంపద అని, గోవులవలన ఆహారమును ఉత్పత్తి చేయవచ్చునని, ఈ ఆహారము పైనే దేశసాభాగ్యము ఆధారపడి ఉంటుందని ఆనాడే గుర్తించి సోషలిజమ్ను తాము ఆచరణ పూర్వకముగా అనుభవించి లోకమున వెల్లడి చేసినవాడు కృష్ణుడు. గోవు ద్వారా పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఇత్యాది ఆహార పదార్థములు పొందుటయే కాక గోపుల సంతతియైన పశువులను వ్యవసాయమునకు ఉపయోగించుకొని పంటలను అభివృద్ధి కావించి లోకమునకు కల్యాణము అందించిన వాడు కృష్ణుడు.
సోదరులైన బలరామకృష్ణులు పాడిపంటలను రెండు విభాగములుగా భావించుకున్నారు. పాడి గోపాలుడు.పంట బలరాముడు. పంట పండించే వానికి నాగలి ప్రధానము. దీనినే హలం అంటారు. హాలాహలము లేని వాడు, హలముమ ధరించినవాడు బలరాముడు. వారు పాడిపంటలద్వారా లోకమునకు కల్యాణము కలిగించినారు. పాడి పంటలద్వారా లోకమునకు ఆనాడు సౌభాగ్యము కలిగించినారు. పాడి పంటలద్వారా లోకమునకు ఆనాడు సౌభాగ్యము కలిగింది. లోకమునకు సౌభాగ్యము ఆకాశమునుండి ఊడిపడేది కాదు. భూమినుండి పుట్టేది కాదు; లేదా మధ్యలో అందుకునేది కాదు. సోమరి తనమును దూరము చేసి నడుము వంచి పనిచేసే తత్వమును నిరూపించినాడు బలరాముడు, సర్వజ్ఞుడు, సర్వ వ్యాపకుడు, సర్వశక్తిమయుడు. సర్వాంతర్యామి అయిన పరమాత్ముడు తన దివ్యత్వమును ఒక ప్రక్కకు పెట్టి ఒక సేవకునివలె అర్జునుని రథమును తోలినాడు. సమాజ సేవ ప్రధానమని విశ్వసించి ఆదర్శమును నిరూపించినాడు కృష్ణమూర్తి. భారత యుద్ధములోయుద్ధము ముగియగానే గుఱ్ఱములను నదికి తీసుకొని వెళ్ళి ఆ గుఱ్ఱముల గాయములకు తగిన మందులు వేసి జీవకోటిని ప్రాణసమానముగా భావించి సేవ చేసినవారు బలరామకృష్ణులు.
(ని.పు.15/16)