మానవునకు మూడు విధములైన దృష్టి కలదు. ఒకటి దేహదృష్టి. ఇది బాహ్యమునకు మాత్రమే పరిమితము. తన రూపసౌందర్యమును మాత్రమే తన ఒడ్డు పొడుగు మాత్రమే చూచేటటువంటి స్వభావము. ఇది దృశ్యకల్పిత మైన దృష్టి ప్రసారము. రెండవది మానసిక దృష్టి, అతని భావములను, అతని చర్యలను అతని ప్రవర్తనను ఆధారము చేసుకొని యీ భావములు హృదయము నుండి ఆవిర్భవించినవి అనే సత్యాన్ని గుర్తిస్తూ వుంటారు. మానవునకు మనసు మరుగుతున్న యీభావములే చర్యలయందు కనుపిస్తుంటాయి. లోపల వుండినదాని ప్రతిబింబములే యీ బయటి చర్యలు. Reflection of inner being. ఈ చర్యలను దృష్టియందుంచుకొని మానవుడు మెలుగుతుంటాడు. మూడవది ఆత్మదృష్టి, తన చర్యలనుగాని, తన రూపురేఖలనుగాని, ఒడ్డుపాడుగులుగాని, తన ప్రవర్తనగాని యేమాత్రము యోచించడు. గుర్తించడు. రూపనామములు చేసే సిద్ధాంతములు ప్రత్యేకముగా వుండినప్పటికిని అందరియందుండే ఆత్మతత్వము ఒక్కటే అనే సత్యాన్ని నిరూపించేది. రూపములు కానీ చర్యలు కానీ మార్పు చెందునట్టివి, పరిణామము కలిగినవి. షడ్వికారములలో కూడినవి. ఇట్టి నిత్యము, అసత్యము, అశాశ్వతము అయిన చర్యలయందు రూపములయందు దృష్టిని అభివృద్ధి పరచుకోవటం సమ్యక్ దృష్టికాదు.
(శ్రీ.. పు. 253)