ప్రాప్తించిన వస్తువు స్థిరమయినది. కాకుండా నశించిపోయేదయి ఎప్పటికినీ అది స్థిరముగా తనకే ఉండవలెనను పట్టుదలనే రాగము అని అందురు. రంజననే రాగమందురు. ఇట్టి కామ రాగములకు రెండింటితోను దూషితమైన బలము భగవత్ బలము కాదు. అయితే కొన్ని కొన్ని స్థానబలమును బట్టి విశేషబలమును బట్టియోగ్యతా అయోగ్యతలను పొందును. ఉదాహరణమునకు ఒక్కటి చూతము. ధనమున్నది. అది దుష్టుని చేరి మదకారణమౌతుంది. సజ్జనులను చేరి దాన ధర్మములగు సత్కర్మలకు ఉపయోగ మవుతుంది. అటులనే బలము దుర్మార్గుల చెంతచేరి పరపీడనకు ప్రాకుతుంది. సజ్జనుల చెంతచేరి పర రక్షణకు ప్రయోగింపబడుతుంది.
(గీ.పు, 108)
విద్యాబలము, బుద్ధిబలము, ధనబలము, జనబలము, ఎన్ని ఉన్నా గొప్ప అధికార స్థానమును ఆక్రమించినా, మానసిక కోమలత్వము, దయ, ప్రేమ శూన్యమైతే లక్ష్యం సిద్ధించదు. దైవత్వము పొందాలన్న ఆశగల వ్యక్తులు మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
మానవుని మాధవునిగా మార్చే నిమిత్తమై దైవము మానవాకారము ధరించి వచ్చేడు. దైవం మానుషరూపేణ, జనార్థనుడు జనం రూపంలో ఉంటున్నాడు. మానవుల కంటే ఉన్నతమైన స్థాయి నందుండు వాడు గనుక పురుషోత్తముడని పేరుపెట్టేరు. "సహస్రశీర్జాపురుషః సహస్రాక్షస్సహస్రపాత్" మానవునికి ఒక శిరస్సు, భగవంతునికి అనేక శిరస్పులున్నాయని, భగవంతుని శక్తి అనేక రెట్లు అధికంగా ఉన్నదని ప్రస్తుతిస్తూ వస్తున్నారు. "దైవం మానుషరూపేణ" అన్నది - ఇక్కడ, ప్రత్యక్షంగా గోచరిస్తున్నది. అయితే పురుషత్వము గుర్తెరిగే మార్గం ఏమిటి? అహంతత్వము, మమత్వము, వాసవతత్వము ఈ మూడింటిని క్షయం చేసుకున్నపుడే పురుషోత్తమ తత్వము అర్థం అవుతుంది.
ఆగమ శాస్త్రాన్ని పురస్కరించుకొని దేవాలయములందు ప్రవేశించే ముందు బలిపీఠము అని పెడతారు. మమత్వమును, అహంతత్వమును, వాసనలను యీ బలిపీఠమున బలి ఇచ్చి తర్వాత లోనికి వెళ్ళమని దీని అంతరార్థము. లక్ష్యాన్ని మాత్రం దృష్టి యందుంచు కుంటున్నారు. గాని సాధనను అలక్ష్యం చేస్తున్నారు.
(త.వ.మ.పు.60) ||
లోకమున అనేక విధములైన బలము లున్నవి; ధనబలము, బుద్ధిబలము, విద్యాబలము, జనబలము, మనోబలము, దేహబలము అని కలవు ఇవన్నియూ పరమేశ్వరుడనైన నా బలమనే భావించవలెను. కానీ అవి కామ రాగ రహితమై ఉండవలెను. అట్టివి మాత్రమే భగవత్ స్వరూపము లనబడును. అట్లుకాక కామరాగ సహితమైన బలములు పశుబలము లనవచ్చును. కాని పశుపతి బలము కానేరదు.
(గీ.పు. 107/108)
(చూ|| ఆత్మబలం, ధర్మబలము, భక్తి, యోగము)