ఈ చరాచర ప్రపంచమంతయు త్రిగుణాత్మకమైనది. గుణాతీతమైన తత్వాన్ని గుర్తించే వ్యక్తిత్వమే నిజమైన మానవత్వము. భగవంతుడు ఆత్మ స్వరూపుడు. "సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ" అని బ్రహ్మమన్నా, సత్యమన్నా, అనంతమన్నా, ఆత్మ అన్నా, భగవంతుడన్నా దేవుడన్నా పర్యాయ పదములే. మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి. పంచభూతములు పంచతత్వములను యిముడ్చుకొని వుంటున్నాయి. పంచభూతముల నుండి పంచీకృతము ఆరంభమైనది. పంచీకృతభావము నుండి ఆవిర్భవించినవే త్రిగుణములు, త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వము, విశ్వమునందు సత్వరజస్తమోగుణములు నిండి ఉంటున్నాయి. సర్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. సత్వసృష్టి యొక్క సమిష్టి సత్వాంశమే అంతఃకరణ. ఆకాశ సత్వసృష్టి అయిన యిది వ్యష్టి తత్వాన్ని అనుభవిస్తూ వచ్చింది. పంచభూతములలో ఆకాశము మొదటిది. ఈ ఆకాశము యొక్క వ్యష్టి తత్వము నుండి శుద్ధ సర్వాంశము ఒకటి బయలు దేరింది. ఇదియే మానవాకారములకు ప్రథమస్థానము. ఆకాశము యొక్క వ్యష్టి సత్వము నుండి చెవి పుట్టింది. పంచభూతములలో రెండవది గాలి. ఈ గాలి వ్యష్టి సత్వమైన అంశమే చర్మము. పంచభూతములలో మూడవది అగ్ని, అగ్ని యొక్క వ్యష్టి సత్వాంశమే కన్ను, పంచభూతములలో నాల్గవది నీరు. దీని వృష్టిసత్వాంశమే నాలుక, ఐదవ భూతము భూమి - ప్రకృతి. ప్రకృతి వ్యష్టి సర్వాంశమే ముక్కు, శబ్దస్పర్శ రూపరస గంధములు ప్రధమున పంచభూతముల శుద్ధ సత్వము నుంచి ఆరంభమైనాయి. ఒక్కొక్కటి వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించిన యీ అంగములు (ఇంద్రియములు) ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించు కోవటానికి వీలవుతుంది. ఆకాశము గుణము శబ్దము. శబ్దమునకు చిహ్నము (ఇంద్రియము) చెవి. చెవి వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు. అదే విధముగనే రెండవ భూతమైన గాలి గుణము స్పర్శ - చర్మము ఇంద్రియము. దీనికి శ్రవణశక్తి లేదు. మూడవది అగ్ని, దీని అంశము కన్ను. ఇది చూడగలదే కాని స్పర్శించలేదు. నాల్గవది నీరు. దీని అంశము నాలుక. నాలుక రుచి చూడగలదే కాని వ్యక్తిని చూడలేదు. ప్రకృతి యొక్క అంశము ముక్కు, ఇది వాసన చూడగలదే కాని రుచిని చూడలేదు. ఈ అంశముల ప్రతిబింబము లగుటచేత ఒక్కొక్క గుణము మాత్రమే యిది స్వీకరిస్తూ వచ్చింది.
బృత్ర.పు. ౧౧౨/౧౧౩)
ప్రపంచం త్రిగుణాత్మకమైనది. ప్రతి వ్యక్తి త్రిగుణములతో కూడినట్టివాడే. సూర్యోదయాన్ని గమనించండి. తెలుపు, చుట్టూ ఎరుపు, ఆ పైన నలుపు రంగులు కనపడతాయి. మీ కనుగ్రుడ్డును గమనించండి. అందులో కూడా తెలుపు, ఎరుపు నలుపు రంగులు కనపడతాయి. ఈ మూడు రంగులే సత్వరజస్తమో గుణాలను సూచిస్తాయి. ఈ జగత్తంతయు త్రిగుణాత్మకమే. గుణములలో దైవమున్నప్పటికీ దైవమునందు గుణములు లేవు. కనుకనే దైవాన్ని త్రిగుణాతీతుడన్నారు. ఈ గుణములలో ఏది అధిక భాగమున్నదో దానిని బట్టి వ్యక్తిత్వము, చర్యలు, ఫలితములు ఆధారపడి ఉన్నవి. తమోగుణమును సత్కార్మాచరణ ద్వారా జయించవచ్చును. రజోగుణముద్వంద్వానుభవమునుఅందించునట్టిది. కోపతాపాలకు, నిందాస్తుతులకు, జయాపజయములకు, లాభ నష్టములకు, సుఖదుఃఖములకు, రాగద్వేషములకు స్పందించునట్టిది రజోగుణము.నిర్మల, నిస్స్వార్థ కర్మల నాచరించి, సర్వ కర్మలను భగవదర్పితం గావించి, సర్వ జీవులయందున్న సర్వేశ్వరుని సేవించి, భజించాలి. ఆత్మతత్త్వము యొక్క ఏకత్వమును గ్రహించాలి. అట్టి జ్ఞానముచేత రజోగుణ ప్రధానుడైనవాడు సాత్వికుడు కాగలడు. "కర్మానుబంధీని మనుష్య లోకే" కర్మఫలితంగానే జ న్మ వచ్చింది. జన్మ కర్మాచరణ నిమిత్తమై ఏర్పడింది. "తస్మై నమ: కర్మణే" అన్నారు. నేను చేయు కర్తవ్య కర్మలకు నమస్కరిస్తున్నా.." అని అర్థం. ఏతావాత, తమోగుణమును కర్మచేత రజోగుణముగను, నేను చేయు కర్తవ్య కర్మలకు నమస్కరిస్తున్నాను.." రజోగుణమును భక్తి జ్ఞానములచేత సత్వగుణముగను తీర్చి దిద్దుకొనుటయే సాధన. వ్యక్తి స్థాయిలో విచారణ ద్వారా మీ తత్త్వమును మార్చు కొనవచ్చును. జంతు లక్షణాలైన సోమరత్వము, చంచలత్వము వచ్చినప్పుడు "నేను జంతువును కాను, నేను మనిషివి" అని పదితూర్లు అనుకోండి. ఈ విధంగా, జంతులక్షణాలను తొలగించుకోవచ్చును. ఇక, మీరు ఆఫీసులో చేసే పని మీకు సంతృప్తిగా ఉండాలి. ఏదీ ఆడంబరంగా చేయవద్దు. ఎవరు గమనించకపోయినా భగవంతుడు గమనిస్తున్నాడని తెలుసుకో. మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా, ప్రేమతో నిర్వర్తించండి...
Duty with Love is desirable. Duty without love is deplorable. Love without duty is divine. చేసే పనిని భగవదర్పితం గావించినప్పుడు అదే పూజగా మారుతుంది. ఇంక మీ ఆఫీసులో తోటివారితో కలిసి పని చేసేటప్పుడు వారివారి ప్రవృత్తుల ననుసరించి స్పర్థలు, కలహాలు సంభవించి మీరు అశాంతికి గురి అయ్యే అవకాశముంది. కనుక, ఇతరులతో అనవసరమైన సంబంధాలు పెట్టుకోకండి.
(స.సా.డి. 99 పు. 374/375)
(చూ: కర్తవ్య ధర్మము, క్షేత్రము, త్రిమూర్తులు, త్రివేణి, దైవము)