మోక్షములో ప్రవేశించే సమయంలోపల సాత్వికమును కూడ దూరము చేసుకోవలసినదే. ఈ మూడు (సత్వ, రజస్తమో గుణములు.) సోదరత్వమును పొందిన ఒకేజాతికి చెందినవే. త్రిగుణములకు అతీతమైన స్థితిని పొందుమని చెప్పి బోధిస్తూ వచ్చినది వేదాంతము. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాపసంహారం ఏకబిల్వం శివార్పణం ఈ మూడింటిని అర్పితము చేయాలి అన్నారు. ఒక ముల్లు మన కాలిలో విరిగినప్పుడు దానిని తీయటానికి గొడ్డలి, కొడవలి తెస్తే ప్రయోజనము లేదు. తిరిగి ముల్లునే తీసుకురావాలి. ఒకముల్లుతో యింకొక ముల్లును తీసిన తరువాత యిది తీసినముల్లే, యిది విరిగిన ముల్లే యని భేదము చేసుకోము. రెండింటిని తీసిపారవేస్తాము. అదేవిధముగనే తమోగుణమును రజోగుణముతో తీసివేయాలి. రజోగుణమును సాత్వికముతో తీయాలి. కట్టకడపటికి బ్రహ్మానందమనే భవనంలో ప్రవేశించే సమయములో యీ మూడింటిని పారవేయాలి. ఇందులో యేగుణముండినప్పటికిని ఆనందము ప్రాప్తించదు. అందువలననే త్రిగుణములకు అతీతమైనవానిగా నీవు కమ్మని అర్జునునకు ఆదేశించాడు. “నిస్త్రై గుణ్యో భవ" ఈ త్రిగుణములను అరికట్టుకొనే సమయములో దూరము గావించుకొనే సమయములో తగిన జాగ్రత్త వహించుమన్నాడు.
(శ్రీ. గీ.పు, 265/266)