ప్రేమస్వరూపులారా! ముఖ్యంగా ఈ విజయ దశమి రోజున మీరు ఒక ప్రతిజ్ఞ పట్టాలి. ఏమిటా ప్రతిజ్ఞ? ధూమపానము, మద్యపానము, మాంసభక్షణ - ఈ మూడింటిని త్యజించాలి. చాలా మందికి తెలియదు. ధూమపానం వలన అనేక రోగములు ప్రారంభమవుతున్నాయి. ధూమపానము చేసేవాడు ఒక్కతూరి పొగను పీల్చి తెల్లని బట్టపైన విడిచిన అది పచ్చగా మారిపోతుంది. అదియే Cancer కి ధూమపానం వలన ఆరోగ్యము పాడైపోతుంది. మానసిక పవిత్రత నిర్మూలమవుతుంది. ఇంక మద్యపానము మహా పిశాచము. తనను తానే మరపింప చేస్తుంది. మద్యపానం చేసినవాడు తానేమి మాట్లాడుతున్నాడో తనకే తెలియదు. ఇది మానవుణ్ణి ఉన్మత్తునిగా మారుస్తుంది. కనుక మద్యాన్ని ఏమాత్రము సేవించకూడదు. మాంస భక్షణ కూడా చాల చెడ్డది. నీ దేహమే మాంసముతో కూడినది. దీనికి తిరిగి మాంసము వేయడ మెందుకు?
దీనికి పవిత్రమైన ఆహారమునందించాలి. తద్వారా పవిత్రమైన కర్మలు ఆచరించటానికి వీలవుతుంది. మనం మంచి పనులు చేయటానికి, మనకు మంచి ఆలోచనలు రావటానికి పవిత్రమైన ఆహారము చాలా అవసరము. భీష్ముడంతటి మహాజ్ఞానియే ఆహార దోషముచేత చెడిపోయాడు.
(ద. య. స1998. పు. 109/110)