విద్యార్థులారా! ఈ లౌకిక విద్యలందు మీరు చక్కగా ఉత్తీర్ణులు కావలసిందే! కాని. దీనితోపాటు ఆత్మవిద్యయందు కూడా మీరు ఉత్తీర్ణులు కావాలి. "ఆధ్యాత్మ విద్యా విద్యానాం" సంపూర్ణమైన తత్త్వం ఆత్మవిద్యయే. మీరు గొప్ప గొప్ప చదువులు చదవవచ్చు. గొప్పగొప్ప పదవులు ఏలవచ్చు. కాని, అవన్ని ఎంతకాలం?
మీ అందచందములెంత కాలం? అన్నీ కొంతకాలమే!
అందము ప్రాయము ఇంద్రియ శక్తియు
ఉందని నిక్కకు రోరన్నా
ముందున్నదిరా తొందరలోనే
ముసలితనమ్మను ముసళ్ళ పండుగ
మసలలేవు, కనుమసకలు, మోమున
మడతబడె. తల నెరిసెనుగా
ముసలి కోతియని పసివారలు నిన్
ముసిముసి నవ్వగ కనరే బొమ్మా!
తై తై తై తై తై బొమ్మా!
దీని తమాష జూడర మాయబొమ్మా!
ఈ దేహం ఒక తోలుబొమ్మ. ఎంతకాల మీ యౌవనం? ఎంతకాల మీ ఇంద్రియ పటుత్వం? ఎంతో కాలం ఉండవు. మెరుపు మెరిసినప్పుడు గొప్ప వెలుతురు వస్తుందిగాని, మరుక్షణంలోనే దట్టమైన చీకటి కమ్ము కుంటుంది. ఉదయం వికసించిన పూవు సాయంకాలానికి వాడిపోతుంది. అదేరీతిగా, దేహం కూడా యవ్వనం నుండి వార్థక్యం లోకి ప్రవేశిస్తుంది. ఇట్టి శరీర తత్త్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి.
(స.సా.ఏ. 2000 పు. 102)