ఈ ఉపనిషత్తులో బ్రాహ్మవిద్యోపదేశముపక్రమింప బడినది. ఈ తైత్తిరీయము శిక్షావల్లి, బ్రహ్మానందవల్లి. భృగువల్లి అని మూడు భాగములుగా నున్నది. ఇందు బ్రహ్మజ్ఞానోపదేశికలగు చివరి రెండు వల్లులు ముఖ్యము. బ్రహ్మవిద్యకు దేవఋష్యాదులుకూడా విఘ్నకారులగు చున్నారు. అట్టి విఘ్నము లుపశమించుటకును చితైకాగ్రత లభించుటకు నుపయోగించు కొన్ని ఉపాయములు శిక్షావల్లి యందుపదేశింప బడినవి. ఈ వల్లియందు పండ్రెండు అనువాకములు గలవు. చివరి రెండు బ్రహ్మానందవ ల్లి, భృగువల్లియను ప్రత్యేక నామములచే వ్యవహరింప బడుచున్నవి. ఈ వల్లీద్వయము మోక్షమునకు సాక్షాత్సాథన భూతమగు వారుణీ విద్యయని ప్రసిద్ధిగాంచినది. రెండింటియందును విషయ మొక్కటియే అగుచున్నది. పఠన సౌకర్యమునకు మాత్రము ప్రత్యేక వల్లులుగా పరిగణింపబడుచున్నవి.
(ఉ.వా. పు. 72)
ఈ ఉపనిషత్తునందు బ్రాహ్మణమున వివిధ ధర్మములు వివరింప బడినవి. అవి కామ్యములు. నైమిత్తికములు, నిమిత్తములు అని మూడు విధములు. కర్మల నాచరింపుమని శాస్త్ర మెవ్వరిని వినియోగింపదు. మనుజునకు కర్మాచరణము సహజ రాగప్రాప్తము. కామన ప్రవృత్తికి ముఖ్య కారణము, కామనానురూపముగ మనుజుడు ప్రవర్తించి యద్దాని ఫలము అనుభవించును. సహజసిద్ధములగు కోరికలను పడయు మార్గమును మాత్రము శాస్త్ర ముపదేశించుచున్నది.
అధ్యయనాధ్యాపనములను గూర్చి ప్రమాదములను పొందకుము. సత్యమును గూర్చి ప్రమాదమును పొందకుము. ధర్మమును గూర్చి ప్రమాదమును పొందకుము. తల్లినే దైవముగా భావించుము. తండ్రియే దైవముగా భావించుము. ఏ పనులు నింద్యములు కావో అవియే నీకు సేవింపతగినవి; తదితరములు సేవ్యములు కావు.
శ్రవణ, మనన, నిదిధ్యాసములను మూడు ఆత్మ సాక్షాత్కారోపాయములుగ మనకుపదేశింపబడినవి. వీనిలో మొదటిది అగు శ్రవణము వేదములయందు సంపూర్ణ విశ్వాసము కలిగి గురుసన్నిధియందు జేయతగినది. అందువలన బ్రహ్మము యొక్క పరోక్షజ్ఞాన మబ్బును. మననాత్మకమగు తపస్సు భృగువల్లి యందు పదేశింపబడుచున్నది. మననముచే నిశ్చితమయిన నిర్గుణ బ్రహ్మాత్మస్వరూపమును మనమునందు నిలిపి బ్రహ్మా నన్యమగు స్వరూపమున నవరతము భావించుటయే నిధిధ్యాసము. బ్రహ్మవిద్యయే బ్రహ్మభృగువల్లీ ద్వయము నందు వివరింపబడినది. ఉప దేశాత్మకము బ్రహ్మపల్లి: అనుభవాత్మకము భృగువల్లి.
(ఉ.వా.పు. 75/76)
(చూ|| పంచాగ్నులు, ప్రేమ మార్గం, మంత్రము, శిక్షావల్లి)