జీసస్ మొట్టమొదట తాను దేవుని దూతనని చెప్పుకున్నాడు. క్రమక్రమేణ అంతరాత్మ తత్వాన్ని గుర్తించి, "నేను దేవుని కుమారుడను" అన్నాడు. తాను భగవంతుని కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో తనకు హక్కు ఉంటుంది కదా! కనుకనే భగవత్సంబంధమైన సదాలోచనలు, సచ్చింతనలు, సద్గుణములు అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి. ఈ ఆస్తి ఎప్పుడు లభ్యమైందో తండ్రియైన భగవంతుడు తన ఆస్తినంతా కుమారునికి అప్పజెప్పాడు. అప్పుడు జీసస్ అందులోను, ఇందులోను ఉన్నది ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించి, "నేను, నా తండ్రి ఒక్కటే" అన్నాడు.
అదే ఏకాత్మభావము. అదేవిధంగా పర్షియన్ మత ప్రవక్తయైన జోరాష్టర్ కూడా మొదట "నేను వెలుగులో ఉన్నాను" (I am in the light) అన్నాడు. అనగా భగవంతుడు స్వర్గములో ఉన్నాడని, అతని వెలుగులో తాను జీవిస్తున్నానని భావించాడు. తరువాత బయట కనిపించునదంతా ‘రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగే’ అన్న సత్యాన్ని గుర్తించి, వెలుగు నాలో ఉన్నది" (The light is in me) అన్నాడు. చిట్టచివరికి, నేను వెలుగును (I am the light) అన్నాడు. ఈ మూడింటిని ద్వైత విశిష్టాద్వైత అద్వైత సిద్ధాంతములతో పోల్చవచ్చును.
(స. సా.జులై. 97 పు.171)