నీవు దేహమును ఆధారముగా తీసుకుంటే యిది జడమైనది. ఈ దేహము యేరీతిగా తయారవుతుండాది? ఏడు బకెట్లు సున్నపునీరు, రెండించిల ప్రమాణముతో నున్న నాలుగు ఇనుప మేకులు, 1100 అగ్గిపుల్లల్లో వున్న భాస్వరం, నాలుగు పెన్సిళ్లలో వున్న సీసము, రెండు లక్సు సబ్బులు ఇవన్నీ చేరితే ఒక దేహము తయారవుతుంది. సున్నపు నీరే రక్తముగా మారిపోతుండాది. దీనిలోనే ఐరన్ వుంటుండాది. ఈ విధముగా జడపదార్ధములతొ యేర్పడిన దేహము జడముకాక చైతన్యం ఎట్టవుతుంది? కనుకనే యిది దేహము అన్నారు. దేహి అనేవాడు దేహములో వుండటం చేతనే యిది నడుస్తూ వుంటుండాది. అదొక గోడగడియారం, అందులో మూడు పిన్ను లుంటున్నాయి. ఒకటి సెకండ్లది, రెండవది మినిట్లది, మూడవది గంటలది. కీ ఇస్తే మూడు తిరిగుతునే వుంటాయి. ఎంతవరకు తిరుగుతాయి? కీ వుండినవరకు తిరుగుతాయి. కీ నిలచిపోతూనే దానిని ఇది దీనిని అది కదల్చుకోదు. ఎక్కడివక్కడే నిలిచిపోతాయి. మన దేహమనేది ఒక గోడ. ఈ దేహమునకు హృదయము అనే గడియారం తగిలించారు. అక్కడ శ్వాసననే కీ, మనకర్మలే సెకండ్ల ముల్లు. మన భావములే మినిట్లముల్లు. మన ఆనందమే యిందులో గంటల ముల్లు, కర్మలు ఎందుకు చెయ్యాలి? సెంకడ్ల ముల్లు తిరిగితే మినిట్సు ముల్లు ఒక్కయింటికి వస్తుంది. మినిట్పు ముల్లు ఆరవై యిండ్లు చుట్టేటప్పటికి గంటల ముల్లు ఒక్కయింటికి వచ్చేస్తుండాది. సెకండ్సు ముల్లు, మినిట్సు ముల్లు తిరిగేది మనకు కనిపిస్తుండాది. గంటల ముల్లు తిరిగేది కనుపించటము లేదు. అక్కడేమనలోవుండే సూక్ష్మత. ఈ మూడు కూడను గంటకొకతూరి కలుస్తున్నాయి. ఇదే జీవేశ్వర ప్రకృతి.
(శ్రీ .గీ. పు.277)