తమిళ భాషలో "తిరుక్కురళ్” అనే ఒక వేద సమానమైన గ్రంధం ఉన్నది. దీనిని రచించినవాడు తిరువళ్ళువర్, ఇతడు ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తూ లోక శ్రేయస్సు కోసం పాటు పడుతూ, నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ప్రతిరోజు భోజనం చేసే సమయంలో ఒక కప్పులోనీరు, ఒక సూది తన ప్రక్కవ పెట్టమని భార్యను కోరేవాడు. కానీ, ఒక దినమైనా ఆ నీరునుగాని, సూదినిగాని ఆతడు ఉపయోగించకపోవడం గమనించి ఆమె ఒకనాడు "నాథా! మీరు కోరినట్లుగా ప్రతి దినమూ భోజన సమయంలో ఒక కప్పులో నీరును, ఒక సూదిని మీ ప్రక్కన పెడుతున్నాను. కాని, ఒక్క దినమైనా మీరు వాటిని ఉపయోగించటం లేదే!" అని ఆడిగింది. దానికి సమాధానంగా తిరువళ్ళువర్ "భోజనం చేసే సమయంలో ఒక్క మెతుకువైనా వ్యర్థం చేయటం నాకు ఇష్టం ఉండదు. పొరపాటున కంచం నుండి ఒక మెతుకు క్రింద పడితే, దానిని సూదితో గుచ్చి, నీటిలో ముంచి శుభ్రంచేసి తీసుకోవాలని నా ఉద్దేశ్యం. కానీ, ప్రతిరోజు నేను ఒక్క మెతుకు కూడా క్రింద పడకుండా జాగ్రత్త వహించడం చేత ఇంతవరకు ఈ నీటిని గాని, సూదినిగాని ఉపయోగించవలసిన అవసరం నాకు కలుగలేదు" అన్నాడు.
(స.పా.మే. 99 పు. 127/128)
(చూ॥ ఆద్వైత దర్శనము, తిరువళ్ళువర్)