ప్రాచీనకాలంలో అనేకమంది మహనీయులు తల్లి ఆశీర్వాదము తీసుకున్న తరువాతనే తమ కర్తవ్యకర్మలను ఆచరించడానికి పూనుకునేవారు. యుద్ధమునకుగాని, తపస్సుకుగాని బయలుదేరే ముందు కుమారుడు తల్లిపాదములపై పడి ఆశీర్వదించుమని ప్రార్థించినప్పుడు,
"తారకాఖ్యాసుత దోర్థర్ప మణచు వేళ
గౌరి తనయుని కిడ్డ వీరరక్ష
శంభరాసుర వీర జoపగా జనువేళ
భార్గవ సుత కిడ్డ భవ్యరక్ష
మాతృదాసీత్వంబు మాన్ప నఱగు వేళ
వినత పుత్రున కిడ్డ విమలరక్ష
జనకు యానతి పాలింప వనికేగెడున్ వేళ
తల్లి రాఘవు కిడ్డ ధన్యరక్ష
రక్షలందున దివ్యమౌ రామరక్ష
తోడు నీడయై నిన్ను కాపాడుగాక"
అని తల్లి ఆశీర్వదించి పంపేది. ఇట్టి ఆశీస్సులచేతనే కుమారులు యుద్ధములో పోరాడి విజయాన్ని సాధించగలేవారు, అరణ్యంలో కఠోరమైన తపస్సు చేసి దైవానుగ్రహాన్ని పొందగల్గేవారు. తల్లి ఆశీస్సులు పొందలేనివారు అనేక జన్మల నెత్తవలసి వస్తుందని శంకరులవారు అన్నారు. తల్లి ఆశీస్సులు పొందినవారికి పునర్జన్మ లేదని కూడా అన్నారు. కనుక మొట్టమొదట తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. అయితే ఇది ప్రాకృతమైన జీవితానికి మాత్రమే సంబంధించినది.
(స. సా.జూ. 1997 పు. 141)
పాండవులు యుద్ధానికి బయలుదేరేటప్పుడు తల్లి కుంతీదేవి చక్కటి ఆశీర్వాదమును అందించింది. "నాయనలారా! మీరు యుద్ధమునకు పోతున్నారు. యుద్ధములో విజయమును సాధించడానికి వెళ్ళుతున్నారు. ధర్మం కొద్దీ విజయం లభిస్తుంది " అన్నది.
మాతృప్రేమను నిరూపించే నిమిత్తమై స్వామి కూడనూ జన్మ యొక్క ఆదర్శమును అందించే నిమిత్తమై నా తల్లి సమాధికి పుట్టిన దినం వెళ్ళుతుండే వాడను. ఎందుకోసం వెళ్ళుతూ వచ్చాను? నేను ఏది చేసినప్పటికిని ఇతరులకు ఆదర్శవంతమైనదిగా నిరూపిస్తూ వచ్చాను. ఈ భావమును పురస్కరించుకొనియే తల్లుల యొక్క ఉత్తమ మనస్సులు కూడా కరిగి పోతుంటాయి.
(శ్రీ జూలై. 98 పు. 10/11)
(చూ॥ తల్లి/తల్లులు)