మానవుడు జిహ్వచాపల్యం చేత రుచికరమైన పదార్ధాలనే అనుభవించాలని ఆశిస్తున్నాడు. 84 లక్షల జీవరాసులలో మానవుడొక్కడే ప్రాకృతమైన ఆహారాన్ని మార్చు కొంటున్నాడు. ఇంక పశు పక్షి మృగాదులన్నీ సహజమైన ఆహారమునే భుజిస్తున్నాయి. కనుకనే, పశు పక్షి మృగాదులకు ఎక్కువగా రోగములు రావటం లేదు. కాని, మానవుడు తన జిహ్వచాపల్యం చేత ఆహారమును అనేక రకములుగా ఉడుకబెట్టి, అందులోని ప్రాణశక్తిని చంపివేసి, ఒట్టి పిప్పిని మాత్రమే భుజిస్తున్నాడు. మానవుడు జిహ్వ చాపల్యమునకు లోనయ్యాడు. కనుక, రుచి చూడకూడదు. మనం ఔషధాలను సేవిస్తుంటాము. ఎందుకోసం? రోగనివారణ కోసం వాటిని సేవిస్తుంటాము. అయితే, రోగ నివారణమే లక్ష్యంలో ఉంచుకోవాలి గాని, డాక్టరు ఇచ్చే ఔషధము తీయగా ఉండాలనుకుంటే వీలుకాదు. ఈ ఆహారం కూడా ఔషధము వంటిదే. ఏమిటీ ఔషధము? ఆకలి అనే రోగమునకు అన్నము ఒక ఔషధము. దాహమనే రోగమునకు నీరు ఒక ఔషధము. ఈ ఔషధములలో మనం రుచుల నెందుకు చూడాలి? ఎంతవరకు మంచిదో అంతవరకే మనం రుచిని చూడాలి. రోగములు రాకుండా, భావములు మారకుండా, బుద్ధులు కదలకుండా ఉండే నిమిత్తమై ఆహారం అతి శుద్ధమైనదిగా ఉండాలి. చాలా మంది డాక్టర్లు - మాంసమును, చేపలను భుజించమని, వాటిలో మంచి ప్రోటీన్సు ఉంటాయని చెబుతూంటారు. వారు ప్రొటీన్సుని, దేహబలమును చూస్తారే తప్ప, ఆధ్యాత్మిక తత్వాన్ని ఏమాత్రం విచారించరు. పాలలో ప్రొటీన్సు లేవా? పప్పులలో, పెరుగులో ప్రొటీన్స్ లేవా? తుచ్ఛమైన మాంసమును తినిఅట్టి బుద్ధులను మనము ఎందుకు పెంచుకోవాలి? అటువంటి ఆహారము వలన మనం కూడా Animals గా తయారైపోతాము . Food ని బట్టి Head, Head ని బట్టి God కనుక, Food, Head, God ఈ మూడింటికీ సన్నిహిత సంబంధము ఉంటుంది. చేపలు చాలా చురుకు తనాన్ని తెలివితేటలను ఇస్తాయి. నిజమే కాని కంపు స్వభావములను పుట్టిస్తాయి. వీటి వలన Bad Thoughts (చెడ్డ ఆలోచనలు వస్తాయి. చేపలు ఇచ్చే Bad Thoughts మరేవీ ఇవ్వవు కనుక, వీటిని కొంతవరకు అరికట్టుకోవాలి.
(శ్రీ.భ.ఉ.పు.140/141)