మనస్సు నందు రెండు విధములైన తలంపులు జరుగురూ ఉంటాయి. ఒకటి ఆలోచన. రెండవది మానసిక సంభాషణ. మన సమస్యలను పరిహారము గావించుకొనే స్థితిని పొందేవి ఆలోచనలు. సమస్యలను మరింత అభివృద్ధి గావించి, మానవుని అనేక విధములైన పెడమార్గములను పట్టించేవి మానసిక సంభాషణలు. అట్లు అవి రెండూ భిన్న భిన్నముగా ప్రవర్తిస్తున్నవి. ఈ మానసిక సంభాషణలలో, పరుల దూషణలను, చెడ్డను, పరిస్థితిని, ప్రవేశపెట్టుచున్నాము. మనకున్న అనారోగ్యమునకు త్వరలో ప్రవేశిస్తున్న వృద్ధాప్యమునకు, సమస్త దుఃఖములకు ఈ మానసిక సంభాషణలే కారణము. ఇవి మనస్సునందు కారుమబ్బుల వలె చీకటిని క్రమ్ముచున్నవి. ఈ సంభాషణలు పెరిగి పెద్దవై, మానవత్వమును కూడా మరపింపచేయుచున్నవి. జాగ్రదావస్థయందనుభవించిన సంభాషణలను, స్వప్నావస్థయందు కూడా ప్రారంభమవుతున్నందున, నిద్రలోని మానసిక విశ్రాంతిని కోల్పోయి బాధలను, దుఃఖములను, విషాదములను అరికట్టలేని బలహీనులము అగుచున్నాము. వాటివలన లభించే ఫలితము ఏమాత్రము లేదు. ఏ మానవుడు ఈ మానసిక సంభాషణలను స్తంభింపజేసి విశ్రాంతినందు కోగల్గునో, అట్టి మానవుడే సంపూర్ణ మానవుడు.
(శ్రీభ.ఉపు.23)