రామబాణము తగులుతూనే మారీచుడు తన నిజస్వరూపాన్ని ధరించి, “హా సీతా! హా లక్ష్మణా!" అని అరుచుకుంటూ పడిపోయాడు. ఈ అరుపును సీత విన్నది. "లక్ష్మణా! ఇది రాముని గొంతువలె ఉన్నది. ఆయనకు ఏ ఆపద సంభవించిందో ఏమిటో! నీవు తక్షణమే మీ అన్నగారికి సహాయంగా వెళ్ళు" అన్నది. కాని, లక్ష్మణుడు సీత మాట వినలేదు. "వదినా! ఇది రాముని గొంతు కాదు నీకింత మాత్రము తెలియదా! ఇది రాక్షసుల మాయ.
రాముడు సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి, అతనికి ఎట్టి ప్రమాదమూ సంభవించదు. నీవు దిగులు చెందవద్దు" అని ధైర్యం చెప్పాడు. సీతకు తెలుసు - రామకార్యము జరగటానికి తానొక ఉపకరణమని, లక్ష్మణుని ఎట్లాగైనా బయటికి పంపాలి. కాని, మంచి మాటలతో ఈ లక్ష్మణుడు కదలడని గుర్తించి, "లక్ష్మణా! ఈ అరణ్యంలో నీవు, నేను, రాముడు తప్ప మరెవ్వరూ లేరు. రాముడు మరణిస్తే నీవు నన్ను పొందాలనుకున్నావా?" అని కఠి నోక్తులాడింది. ఈ మాటలు వినలేక లక్ష్మణుడు తక్షణమే బయలుదేరాడు. వెడుతూ వెడుతూ పర్ణశాల ఎదురుగా ఒక గీత గీసి, "తల్లీ! ఎట్టి పరిస్థితుల్లోను నీవీ గీత దాటి బయటికి రావద్దు" అని హెచ్చరించాడు. కాని, జరుగవలసిందేదో జరిగే తీరాలి కదా! రావణుడు మారు వేషంలో వచ్చాడు. సీతను అపహరించాడు. రామలక్ష్మణులు తిరిగి వచ్చేటప్పటికి పర్ణశాల ఖాళీగా ఉన్నది.
సీతకు కూడా తెలుసు. ప్రపంచములో బంగారు జింక ఉండదని, సర్వమును త్యాగం చేసిన సీతకు బంగారు లేడిపై ఆశ కల్గడమేమిటి" "త్యాగేనైకే అమృతత్వ మానశుః" త్యాగము చేసినప్పుడు రాముడు దక్కాడు. ఆశలు పెంచుకున్నప్పుడు రాముడు దూరమయ్యాడు.
(శ్రీ భ ఉపు.71)