గ్రామ ప్రజలలో అనేక విధములైన భేదభావము లుంటుంటాయి. కొన్ని పార్టీలు గ్రామాల్లో చేరి సమాజ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుంటాయి. వాళ్ళకు మనం చక్కగా నచ్చచెప్పాలి. పార్టీతో వ్యక్తికి మాత్రమే సంబంధం కాని, గ్రామానికి సంబంధము లేదు. గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులలో ఆందరూ, అన్ని పార్టీల వారు ఏకమై పని చేయాలి అని బోధించాలి. నీ వ్యక్తిత్వము ఏ పార్టీకైనా అనుకూలముగా ఉండవచ్చును. కాని గ్రామాభివృద్ధి సమస్యలను మాత్రం పార్టీ విషయం చేయకూడదు. అందరూ ఐకమత్యంగా పని చేయాలి. కొన్ని గ్రామాలలో అపరిశుభ్రత కారణంగా అనారోగ్యం పెరిగిపోతున్నది. అలాంటప్పుడు గ్రామానికి కొన్ని అనుకూలాలు చేయాలి. దొడ్లు కట్టించాలి. నీటి వసతులు కల్పించాలి. ఈ రకమైన పనులకు మనము పూనుకుంటే గ్రామస్తులు అందులో చేరి మనకెంతో సహాయంగా నిలుస్తారు. గ్రామస్థులతో చేరుకొని మనం పని చేయాలి.
(ఆ.ప్రన. - డి. 1992 పు.27)