గృహిణులు, మీ ఇంటి పనులను మీరు చక్కగా చేసుకొండి. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. మీ భర్తను, పిల్లలను చక్కగా చూసుకొండి. దీనిని మించిన కర్తవ్యం మరొకటి లేదు. అంతేగాని, ధ్యానమని ఊరికే కూర్చుంటే, మీ మనస్సంతా మార్కెట్లో తిరుగుతుంది. కనుక, మీరు నిర్మలంగా భగవన్నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేసుకోవాలి. మీరు ఇల్లు ఊడ్చే సమయంలో నా హృదయాన్ని పరిశుద్ధం చేస్తున్నాను అని అనుకోండి. ఎంతహాయిగా ఉంటుంది! మీరు చపాతీలు గాని, పూరీలు గాని చేస్తుంటారు. అయితే, వాటిని చేస్తున్నంత సేపూ "ఈ పూరీలు చేసే ఖర్మనాకు పట్టింది. దీనివలన సత్సంగమునకు పోలేకపోతున్నాను" అని తిట్టుకోనక్కర లేదు. "నేను చేసేది పూరీలు కాదు, నా హృదయాన్ని విశాలం చేసుకుంటున్నాను" అని అనుకుంటే? ఎంత బాగుంటుంది! వంట ఇంట్లో కూరగాయలు కోసేటప్పుడు. "ఇది నాతల వ్రాత, నాకీ వంటిల్లేనా గతి" అని దూషించుకోరాదు. “నేను కోసేవి కూరలు గాదు నాలోని అరిషడ్వర్గాలనే దుర్గుణాలను జ్ఞానమమనే కత్తితో కోస్తున్నాను. ఈ కూరలను ప్రేమ అనే జలములో తడిపి, జ్ఞానమనే అగ్ని లో ఉడుకబెడుతున్నాను" అని భావించండి. అప్పుడా పని ఎంతో పవిత్రతను పొందుతుంది. మీరు బియ్యంలోని రాళ్ళను ఏరివేస్తుంటారు. ఈ విధంగా బియ్యంనుండి రాళ్ళను వేరు చేసేటప్పుడు "దుర్గుణాలను దూరం చేసి, సద్గుణాలను పెంచుకుంటున్నాను - ఇది నాయోగం అని భావించండి. దానినే - "క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగయోగము" గా "ఆత్మానాత్మ విభాగయోగము"గా భావించుకోండి. ఈ విధంగా మీరు చేసే ఇంటి పనులను కూడా భగవత్కర్మలుగా స్వీకరించాలి.
(శ్రీ భ ఉ. పు. 124)