పెండ్లి చేసుకొని భార్యాబిడ్డలతో వుండినంత మాత్రమున గృహస్థుడు కాడు. వర్ణాశ్రమధర్మంబులు వర్జింపక, తనవారు పరాయి వారను భేదము లేక, పిన్న పెద్దలను తారతమ్యము లెరింగి, సర్వభూతములను తనవలె భావించి, సమరస భావము కలవాడై తన్నా శ్రయించిన ప్రాణికోటి యందు ఆదరణ చూపుచు లోకజ్ఞాన విశేషములను తెలిసికొని శాస్త్రజ్ఞానము సంపాదించి, ఇహపర చింతనలలో ధర్మమును తప్పక, సమయా సమయములనక సర్వవేళలయందు తన వర్ణధర్మములను వీడక, బంధు మిత్రుల యందును. భార్యాబిడ్డల యందును, ప్రీతి గలవాడై ఆదరించుచు, అష్టమదముల ద్రుంచి, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్ధముల యందు, బహు నేర్పరియై మసలు కొనుచు, ధన కనక వస్తు వాహనములతో తులతూగుచూ, ఎందును గర్వితుడు కాక, దానధర్మ పరోపకారార్థము కొంత కాలమును వినియోగించుచు, పరగృహముల పంచల పడక, తన యిల్లాలు తనను నమ్మునట్లును తన సతిని తాను నమ్మునట్లును, ఒకరి కొకరు తెలుసుకొని మెలగుటయే గృహస్థమని పిలువబడును.
(ప్ర. వా, పు. 9, 10)