సంసార సముద్రమందు యెడతెరిపి లేకుండా వచ్చిపడే సుఖదుఃఖములను తరంగములకు కించిత్తైనను చలించక, చిత్త సామ్యాన్ని కోల్పోక, తన పట్టుదలతో నిలిచిన (అనగా నిష్ఠలో నిలచిన) వాడు ధీరుడగును. విషయ ద్వంద్వాలను తిరస్కరించే శక్తి సామర్థ్యములు కలిగినవాడే బుద్ధిమంతుడు. అట్టి బుద్ధికలవానినే ధీరుడని అందురు."
"ధీ" అనగా బుద్ధికదా! అట్టి బుద్ధికలవాడే పురుషుడు. కేవలము మీసములు పెంచీ చొక్కా వేసుకొన్నవాడు కాదు. పురుషుడు. ద్వందతిరస్కారబుద్ధి కలవాడే పురుషుడు. అట్టి పురుషుడు బైట శత్రువులను గెలుచుటకంటే లోని శత్రువులను గెలుచుట చాలా వుత్తమ మార్గము. సుఖ దుఃఖములను జయించుటే - ఈ ధీరుడు చేయవలసిన పని, అదే నిజఫలము.
(గీ. పు 30/31)
జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తొణకక, బెణకక వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి.
తలచినట్టి పనులు తారుమారైనచో
తొణక వలదు ఎవరు బెణక వలదు
చీకు చింత వీడి చిరునవ్వు నవ్విన
అతడె గుండె పండినట్టివాడు
జీవితమొక సవాలు. ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎట్టి పరిస్థితులందైనా బలహీనతకు చోటివ్వకూడదు. బలహీనులు ఏ చిన్న కార్యమునైనా సాధించలేరు. కనుక, మీరు మానసిక బలమును సంపాదించుకోవాలి. మీ మనస్సు దైవవిశ్వాసంతో కూడినదిగా ఉండాలి. మంచి పైన విశ్వాసమును, చెడుపైన అవిశ్వాసమును పెంచుకోవాలి. కష్టాలు కదలిపోయే మేఘాలవలె వస్తుంటాయి. పోతుంటాయి. వాటికి వెఱువకూడదు. పట్టాభిషేకానికి సంసిద్ధమైన రాముడు అదే క్షణంలో ఆనందంగా అడవికి వెళ్ళాడు. "సుఖ దుఃఖే సమేకృత్వా లాభా లాభౌ జయా జయౌ", సుఖ దు:ఖాలయందు సమత్వాన్ని వహించాడు. ఇట్టి సమత్వం మానవునియందు కనిపించటం లేదు. తనకు అర్హత ఉండినప్పటికీ రాముడు అధికారమును ఆశించలేదు. కాని మానవుడు తనకు అర్హత లేనప్పటికీ అధికారం కోసం ప్రాకులాడుతున్నాడు. రామునికి అన్నింటియందు ధీరత్వమే గాని,ఏనాడూ దీనత్వం లేదు. రామ నామాన్ని స్మరించేవానికి కూడా ధీరత్వమే వస్తుందిగాని, దీనత్వం రాదు. నిరంతరం రామ నామాన్ని స్మరించిన హనుమంతుడు రాముని ఎదుట దీనుడై నిలిచాడు. రావణుని వద్దకు పోయినప్పుడు ధీరుడై నిలిచాడు. అనగా, దివ్యత్వము ఎదుట దీనుడైనాడు. అహంకారము ఎదుట ధీరుడైనాడు.
(స.సా.మే 99 పు.116)
(చూ॥ ధీమంతుడు)