కఠోపనిషత్తు శరీరమనే రధమునకు ఇంద్రియములు అశ్వములవంటివని వర్ణించినది. ఇంద్రియములకు అశ్వములని పేరు పెట్టుటలో అంతరార్థము ఏమిటి? అశ్వమనగా నిరంతరము చలించే స్వభావము గలది. అందరకు తెలిసిన విషయమే. గుఱ్ఱము నిద్రించు చుండిన మేల్కొని యుండిన పరుగెత్తుచుండిన నిల్చునివుండిన తన దేహమునందు యేదో ఒక అంగము కదిలిస్తూనే వుంటుంది. లోక తప్పితే కాలో కాలు తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో యేదో ఒకటి కదిలిస్తూనే వుంటుంది. చలన స్వభావము కలిగినది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది. అదే విధముగా రావి వృక్షముగాలి లేకపోయినా దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే వుంటాయి. కనుకనే దానికి అశ్వత్థ వృక్షమని పేరు. ప్రాచీన రాజాలు అశ్వమేధయాగమని ఒక యాగము సలిపేవారు. అశ్వ మేధ- యీ రెండు పదముల అంతరార్థము గుర్తించినప్పుడు అశ్వమేధమనేది ఏమిటో మనకు సుస్పష్టముగా అర్ధమవుతుంది. మేధ అనగా బుద్ధి. ఆశ్వమనగా చలించేది. అశ్వమేధమనగా చలించే బుద్ది ఈ చలించే బుద్ధికి ప్రతిబింబమే ఆశ్వము. అశ్వమేధయాగమునందు ఆశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు. "కస్యధీరః" అని ప్రశ్నించింది భగవద్గీత. ఎవరు దీనిని పట్టెవారు? ఎవరు దీనిని అణగద్రక్కేవారు? ఎవరు దీనిని నిగ్రహించేవారో వారే నిజమైన ధీరులు అన్నారు. ఇంద్రియములను అరికట్టి స్వాధీనము చేసుకున్న వ్యక్తియే ధీమంతుడు. బాహ్యార్థముగా భౌతిక జగత్తునందు ఆశ్వమును ఎవడు పట్టగలడో వాడే ధీమంతుడు. అతనితోనే యుద్ధము చేసే అధికారమున్నది. అని ప్రాచీన మహారాజులు నిరూపించినారు. ఇక్కడ అంతరారర్థము బాహ్యార్థము రెండింటి యొక్క సమన్వయమే నిజమైన యదార్థము. ప్రతి మానవుడు ఈ అశ్వాన్ని పట్టి కట్టాలి. అప్పుడే మీరు ధీరులౌతారు. ఎన్ని యాగములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని క్రతువులు, ఎన్ని గ్రంథ పారాయణములు సల్పినప్పటికిని దీనిని నిగ్రహించలేని ఆశక్తులు యివన్నీటిని వ్యర్థము గావించినవారే.
(బృత్ర.పు. ౪౪/౪౫)