సీతాపహరణం ఎన్నో రహస్యాలను వెల్లడి చేస్తుంది. ఇట్టి సూక్ష్మమైన రహస్యాలను కలిగినట్టిదే అవతార తత్వం ఇది పండితులకు పారాయణ చేసేవారికి అంత తేలికగా బోధపడేది కాదు. ధనకనక వస్తు వాహనాదులను, చీనాంబరములను, దివ్యాభరణాలను వదలి పెట్టి సీత రాముణ్ణి అనుసరించింది. అంటే కామము (కోరిక) ను జయించినది కనుకనే రామునికి దగ్గరైంది కానీ బంగారు లేడిని కోరుకున్నప్పుడు సీత కామునికి దగ్గరైంది. కనుకనే రామునికి దూరమైంది. రాముడున్నచోట కాముడుండడు. కాముడున్నచోట రాముడుండడు. ఇక్కడ మరొక ధర్మసూక్ష్మమున్నది. రాముడు బంగారు లేడి నిమిత్తమై బయలుదేరినప్పుడు లక్ష్మణుణ్ణి సీతకు కాపలాగా ఉండమని, ఎట్టి పరిస్థితిలోను సీతను వదలి పెట్టి వెళ్ళవద్దని ఆజ్ఞాపించాడు. కానీ లక్ష్మణుడు సీత దూషణలను వినలేక రామాజ్ఞను ధిక్కరించాడు. అనగా తన కర్తవ్యాన్ని విస్మరించాడు. కనుకనే సీతాపహరణం జరిగింది. దీని కంతటికీ తానే కారణమని, తాను రామాజ్ఞను ఉల్లంఘించడం వల్లనే ఈ అనర్థం జరిగిందని లక్ష్మణుడు చివరి వరకు చింతిస్తూనే ఉన్నాడు.
ఇక్కడ భగవంతుని సంకల్పం కూడా కనిపిస్తుంది. అంతా ఆయన మాస్టర్ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. విశ్వామిత్రుని యాగ సంరక్షణ సమయంలో రాముడు సుభాహుణ్ణి వధించి మారీచుణ్ణి వదలి పెట్టాడు. ఆ మారీచుడే బంగారు లేడి రూపంలో వచ్చాడు. అతడి ద్వారా సీతాపహరణం, రామరావణ యుద్ధం జరగవలసి ఉంది. కాబట్టే ఆనాడు అతణ్ణి వదలి పెట్టడం జరిగింది. దీనికి పూర్వం సీతారాములు భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని సందర్శించినప్పుడు ఆయన వారికి అర్ఘ్య పాద్యముల నిడి, ఆతిథ్యమునోసగి, ముందు ప్రయాణానికి సిద్ధం చేసి వారిని సాగనంపినాడు. ఎందుకంటే వారు భరద్వాజాశ్రమంలోనే ఉండినట్లయితే సీతాపహరణం జరగదు. రావణ వధ అన్న ప్రశ్నే ఉదయించదు. కనుక శ్రీరాముడు శ్రీమన్నారాయణుడని తెలిసినప్పటికీ రాక్షసవధ నిమిత్తమై భరద్వాజుడు వారిని తదుపరి ప్రయాణమునకు సిద్ధం చేసినాడు. ఇది భగవంతుని మాస్టర్ ప్లాన్! ఈ ప్రకారం రామాయణంలోని అన్ని ఘట్టాలూ మానవతా విలువలను ధర్మాలను సూచిస్తూ ఆధ్యాత్మిక తత్వాన్ని అవతార రహస్యాన్ని నిరూపిస్తాయి.
(స.సా,జూ..98 పు.193/194)