1893వ సం||లో ఒక వ్యాపారికి సంబంధించిన కేసు విచారణ నిమిత్తమై గాంధీ దక్షిణాఫ్రికా వెళ్ళాడు. అప్పటికి గాంధీ వయస్సు 24 సంవత్సరాలు. . దక్షిణాఫ్రికాలో భారతీయులకు - జరుగుతున్న అవమానాలు, .. హింసలు - కనులార చూసాడు. . మానవునకు, మానవునకు మధ్య భేదమేమిటి! రంగులు, ఆశయాలు, అధికారాలు. విద్యలయందు వ్యత్యాసములుండవచ్చుకానీ మానవత్వము మానవత్వమే కదా! ఒక మానవుడు తోటి మానవుని హీనంగా చూడటం న్యాయం కాదని అక్కడ సత్యాగ్రహం ప్రారంభించాడు. అధికారులు ఈ వార్తను అక్కడి ప్రధానమంత్రియైన జనరల్ స్మట్స్ అందజేశారు. అతను గాంధీని పిలిపించి, "మిత్రమా! ఈ శ్వేత జాతీయులు భారతీయులను హింసించడం నిజమే. మరి మీ భారతదేశమునందు మీ భారతీయులనే కొన్ని కోట్ల మందిని - గ్రామములకు వెలుపల ఉంచి అంటరానివారుగా చూస్తున్నారే! అలాంటప్పుడు మీకు మా దోషములను చూపే అధికారమెక్కడున్నది!” అని ప్రశ్నించాడు.
గాయపడిన గాంధీ హృదయం –
స్మట్స్ అన్న మాటలు గాంధీ హృదయానికి తుపాకి గుండ్లవలె తాకినవి. గాంధీ తలవంచుకొన్నాడు. నిజంగా పరుల దోషములను ఎంచే అధికారము తమకెక్కడున్నది? ఈవిధమైన సత్యవిచారణచేత పరిణామము చెందినవాడు - గాంధీ. ఎవరైనా తమ దోషములను, బలహీనతలను ఎత్తి చూపినప్పుడు వాటిని సరిదిద్దుకొనువారే నిజమైన మానవులు. గాంధీ ఈ విషయమునందు ఆదర్శమూర్తి కావటంచేతనే యావద్భారత దేశం అతనిని జాతిపితయని కీర్తిస్తున్నది.
దక్షిణాఫ్రికా అనుభవంతో గాంధీ భారతదేశానికి బయల్దేరి వచ్చాడు. అంటరానితనమును దూరంచేసి, తదుపరి దేశ స్వాతంత్య్రానికి తగిన ప్రయత్నాలకు పూనుకుందామని ఆ సత్యాగ్రహం - ప్రారంభించాడు. భారతీయులందరూ ఒక్కటే. అందరూ సోదరత్వాన్ని పెంపొందించుకోవాలి. జాతి మత కుల భేదములను నిర్మూలము గావించాలి. మొట్టమొదట ఈవిధమైన ఆశయములతో గాంధీ ప్రవేశించాడు. ఇది క్రమక్రమేణా పెరిగి పెద్ద వృక్షంగా మారిపోయింది. అనేక కష్ట నష్టములకు, దుఃఖములకు, ప్రాణాపాయములకు కూడా వెరువకుండా గాంధీ - తన సత్యాగ్రహోద్యమాన్ని సాగించాడు. నాయమాత్మా బలహీనేన లభ్యః అన్నట్లుగా బలహీనుడైనవాడు దేనినీ సాధించలేడు. ఆత్మబలము కలవాడు దేనినైనా సాధించగలడు. కనుక మొట్టమొదట మనం ఆత్మవిశ్వాసమును బలపరచుకోవాలి. విశ్వాసము లేనివానికి ప్రేమ కలుగదు. ప్రేమ లేనివానికి శాంతి లభించదు. శాంతి లేనివాడు సత్యమార్గంలో ప్రవేశించడు. సత్యమార్గంలో ప్రవేశించనివానికి ఆనందము శూన్యము. ఆనందమును - అనుభవించాలంటే ఆ సత్యమార్గంలో ప్రవేశించాలి. విశ్వాసమున్నచోట ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నచోట శాంతి ఉంటుంది. శాంతి ఉన్నచోట సత్యం ఉంటుంది. సత్యమున్నచోట ఆనందముంటుంది. ఆనంద మున్నచోట భగవంతుడు ఉంటాడు.
దైవత్వాన్ని పొందాలనుకున్నప్పుడు, సర్వ మానవ సోదరత్వాన్ని పెంపొందించుకోవాలనుకున్నప్పుడు ప్రేమను అభివృద్ధిపరచుకోవాలి. కాని భారతదేశములో మొదటి నుండి ఐకమత్యము కుంటుపడుతూ వచ్చింది. స్వార్థము, స్వార్థము, స్వార్థము! లౌకికమునందు స్వార్థమే, ఆధ్యాత్మిక విజ్ఞానములందు కూడా స్వార్థమే! స్వార్థమనే పిశాచంచేత పీడించబడుతున్నారు. భారతీయులు. స్వార్థము చేతిలో కీలుబొమ్మలై ఆడుతున్నారు. ఈ స్వార్థమునకు దైవమును కూడా వినియోగించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. ఈ స్వార్థ స్వప్రయోజనముల బంధనలో చిక్కుకోవటంచేతనే మానవత్వాన్ని కూడా మరచిపోయి, దానవులుగా తయా రవుతున్నారు. కనుకనే, స్వార్థత్యాగంద్వారా పరార్థమైన ఐకమత్యాన్ని అభివృద్ధిపరచాలని గాంధీ అనేకవిధములుగా ప్రయత్నించాడు. (శ్రీ సత్యసాయి సనాతన సారథి, ఆగస్టు 2021 పు6-7)