ఈ ప్రపంచంలో దైవం ఎవరంటే - సత్యమే దైవము. కనుక, సత్యాన్ని అనుసరించినప్పుడే దైవాన్ని ఆరాధించిన వాడవుతావు.
"క్రమము తప్పక మింట ప్రతిదినంబు భాను
డుదయాస్తమయముల నందనేల?
గగనంబునకు కాంతి కైసేయు తారలు
పగలు మాత్రము దాగు భంగియేల?
క్షణమైన విశ్రాంతి గొనక తా పవనుండు
జీవకోటిని బ్రోవ వీవ నేల?
అనిశంబు కలకల ధ్వనుల నవ్వుచు నది
సలిలమై ప్రవహించు చందమేల?
ప్రకృతిలో నెందు జూచిన ధన
కుల మత జాతి విభవ భేదమేల?
ఎవరి ఆజ్ఞకు బద్దులో ఎవరు ప్రభువొ
అతని ఆజ్ఞను పాలింప అరయ రండు.
అంతటికీ దైవాజ్ఞయే మూలకారణం. "కదలదు. తన సంకల్పము లేనిదే గడ్డిపోచయును." మంచి చెడ్డలు నీ భావము యొక్క ప్రభావములేగాని, దైవములో ఉన్నదంతా మంచిదే, సమత్వమే. భారతీయ సంస్కృతి ప్రాచీనకాలము నుండి ఇట్టి పవిత్రమైన ఉపదేశములనే అందిస్తూ వచ్చింది. "విశ్వం విష్ణుస్వరూపం". విష్ణువనగా సర్వత్ర వ్యాపించిన వాడు. కనుక, ఈ జగత్తునందు దైవత్వము లేనిది లేదు. అలాగయితే దైవాన్ని చూపుమని అడుగుతారు కొందరు. "పశ్యన్నపిచ న పశ్యతి మూఢో, " చూస్తున్నదంతా దైవమే. అయినా దైవాన్ని చూపుమని అడగటం మూర్ఖత్వం. దైవం యొక్క రూపమేమిటి? అన్ని రూపములూ దైవానివే. చూసేదంతా దైవస్వరూపమే. ఇందులో మంచి చెడ్డలనే భేదం లేదు. సాయంకాలం ఫలము తిన్నావు. తెల్లవారేటప్పటికి అది మలంగా మారింది. ఫలము మంచిదంటున్నావు. మలము చెడ్డదంటున్నావు. నీ దృష్టిలో ఇవి మంచి చెడ్డలుగా కనిపిస్తున్నాయి కాని, దైవదృష్టిలో రెండూ సమానమే. కాలమార్పుచేతనే ఈ మంచి చెడ్డలు ఏర్పడుతున్నాయి. కాలము చాల ప్రధానం. ఇట్టి విశాలమైన తత్వాన్ని నిరూపించినది భారతీయ సంస్కృతి. కనుకనే, ఇండియా ఈజ్ ది టీచర్ ఆఫ్ ఆల్ ల్యాండ్స్, అన్నారు. భారతదేశము అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానములో ఉన్నటు వంటిది. ఇది దివ్యత్వమును ఏ భేదమూ లేకుండా ఒక్కటిగా భావించినది. దైవం ఒక్కడే, గమ్యం ఒక్కటే. ఈ ఏకత్వంలోనే అనేకత్వం వ్యాప్తి చెందినది.
(స.పా.మా. 96 పు. 59)