నేడు ఎంతో మంది గొప్ప విద్యావంతులు, శాస్త్ర వాసన వేదవాసన పాండిత్యములు కలవారును, వాటియందలి విశ్వాసములను కోల్పయి, ధర్మములను ఆదరించక, విశ్వాసహీనులై ధర్మమును ఆచరించక, లోకభీతి చేతను, నవీన విద్యల సాంప్రదాయము చేతను, మధ్య మధ్య తమకు తోచిన కుయుక్తులచేతను, సనాతన ధర్మ సాంప్రదాయమైన ఏకాదశ వ్రతమును కూడను (అనగా ఉపవాసమును కూడ) స్నాన, సంధ్య, ఉపవాసములు ఆరోగ్యము కోసమేనని, కర్పూర హారతులు, వాని జ్వాల, ధూమము ఊపిరితిత్తులకు జబ్బు ఆనియు, ప్రాణాయామములు జీర్ణరోగ హరములనియు, తీర్థయాత్రలు, పుణ్యనదీ స్నానములు ఇత్యాది వన్నియూ, లోకానుభవం, కలుగడం కోసమనియూ, దానధర్మములు పేరు ప్రతిష్టల కనియు, ఇంకను అనేక మంది అనేక విధముల పవిత్ర కార్యములను అపవిత్రభావములలోనికి దింపుచున్నారు.
అట్టివారు లోకవంచకులు. ధర్మతత్త్వము పాలిటి దానవులు, ఇట్టివారు మనుధర్మమును విచారించిన కొంత బోథపడగలదు..
"ఆర్షం ధర్మోపదేశం చ వేదశాస్రా విరోధినా
యస్తర్కే ణానుసంధత్తే స ధర్మం వేద, నేతరః"
అన్నాడు మనవు. అనగా వేదమూ, ధర్మశాస్త్రమూ ఈ రెండింటినీ వేద శాస్త్రములకు విరోధముకాని తర్కములతో ఎవరు విమర్శిస్తున్నాడో వాడే ధర్మమెరుగగలడు. కానీ యితరు లెరుగజాలరు. దీని ఆంతర్గామేమన ఏయూహ, వేదశాస్త్రములకు విరోధముగా నుండదో, ఆ దానినే మనువు గ్రహించినాడు. కానీ, వేద శాస్త్రములు తర్కమూలమని తెలుపలేదు. లేనిపోని శుష్కతర్కముల వలన ప్రయోజనమేమియు లేదు, రాదు. చాలా మంది ఇప్పటి కాలమున హేతువాదము నాశ్రయించి, తాము ఆధర్మాచరణ గావిస్తూ, ధర్మాచరణ తత్పరులను కూడా హేతువాదములుచేసే ధర్మదూరులను గావించుచున్నారు.
(ధ.వా. పు. 47, 48)
(చూ|| చదువు)