మనము కోరే కోరికలయందు మంచి చెడు విచక్షణ చేసి ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కావాలి. విఘ్నేశ్వరుడని వ్యవహరిస్తున్నారు కాని సరియైన పేరు గజానన, గ అనగా గమ్యమును నిర్ణయించేది. ఆ అనగా జన్మమును ప్రసాదించేది. ఆనన అంటే ముఖము, అనగా సన్మార్గమను ప్రసాదించి గమ్యమును నిరూపింపజేసే ముఖమే. గజానన అని. గమ్యాన్ని మరుస్తున్నారు. ఈ గ కారమును తీసేస్తే జానన అవుతుంది. అనగా పుట్టేది చచ్చేది!
గమ్యమును గుర్తించడానికి పుట్టినాము గాని, జన్మను జన్మంగానే అనుభవించడానికి పుట్టలేదు. మానవుని జీవితమంతా ఏదో ఒక లక్ష్యాన్ని అనుసరించుకొనే ఉంటుంది. అయితే లక్ష్యాన్ని మాత్రమే గుర్తుంచు కొంటున్నాము. లక్ష్యకారణాన్ని మరచిపోతున్నాము. సాధనే అతి ప్రధానమైనటువంటిది. సాధనను లక్ష్యమున పెట్టుకొని ప్రయాణం చేసినప్పుడు గమ్యము చేరగలము.
(వ. 1984 పు. 175)