సముద్రమంథన సమయమున అమృతభాండమును ధరించి, భగవానుడు ధన్వంతరిగా అవతరించి రోగ నివారణోపాయములను ప్రజలకు నేర్పి మానవులను చికిత్సకులుగా చేసెను. వారే వైద్యులనియు, భిషగ్వరు అనియు, చికిత్సకులనియు, లోకమున ప్రసిద్దికాంచునట్లు చేసెను. రాజా ఇంతేకాదు. వైద్యులకు పూర్వము యజ్ఞభాగములిప్పించెను. చూచితివా దైవలీలలు! హరి యొక్క చిత్రలీలలు హరికే తెలియును. అన్యులకు అర్థము కావు, వూహించుటకు కూడనూ వీలుకాదు. మానవులు అజ్ఞానవశులగుటచే, వారి వారి బుద్ధి శక్తి సామర్ధ్యములను పురస్కరించుకొని వాక్ వాదములు జరిపి లేని పాపములకు గురియగుదురు. దైవకార్యములను సంశయించక మానవులు వారివారి వూహలకు తగినట్లుగా వాటిని మార్చుకొనక తమ భావములనే ఆ దైవ కార్యములకు తగినట్లు మార్చుకొన్న అట్లు మానవులు దైవానుగ్రహమునును పొందగలరు. కానీ ఆట్లు చేయలేని అనుగ్రహ పాతృలు కానేరరు. ఆనందమును అందుకోలేరు.
(భా.వా. పు. 205)