ప్రేమస్వరూపులారా! మీలో ప్రేమ లేకపోయినా నేను మిమ్మల్ని ప్రేమస్వరూపులనే సంబోధిస్తాను. దేనినీ మీరు పెంచుకోనక్కరలేదు. ఒక్క ప్రేమను పెంచుకోండి. ఎవరైనా క్రొత్త భక్తులు వచ్చినప్పుడు ఆశ్రమంలోనివారు ఎంతో మర్యాదగా స్వాగతం చేయాలి. ఇన్స్టిట్యూట్లోను అంతే, క్రొత్త పిల్లలు వచ్చి చేరినప్పుడు మిగిలిన విద్యార్థులు వారికి ప్రేమతో స్వాగతం పలకాలి. వారు తమ తల్లిదండ్రులను వదలి వచ్చిన బాధను మరపించాలి. కాని, బయటి కాలేజీలలో ర్యాగింగ్ పేరుతో కొత్తగా చేరిన పిల్లల ప్రాణాలు తీస్తున్నారు. ర్యాగింగ్ చేసేవాడు రాక్షసులే! వారి సోదరులనైతే ర్యాగింగ్ చేస్తారా? క్రొత్తగా ప్రవేశించిన పిల్లలకు ధైర్యమును, ఆనందమును అందించవలసిన విద్యార్థులు వారికి భయమును, ఆందోళనను కలిగిస్తున్నారు. ఇది మంచిది కాదు. ఒకరిలో ఒకరు కలసిమెలసి ఉండండి. అప్పుడే మీరు స్వామియొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకున్నవారవుతారు. ఏ మాట మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి. జీవులనుచూస్తే బాధించడం, దేవుని చూస్తే పూజించడం భక్తి అనిపించుకోదు. రాత్రింబవళ్ళు శ్రమించి పని చేసే ఎద్దులను కఱ్ఱతో కొడతారు. రాతినందిని చూస్తే భక్తితో ప్రదక్షిణ చేసి నమస్కరిస్తారు. ఇది భక్తి కానే కాదు.
(స.సా.సె.96 పు.241/242)