నా ఉద్దేశ్యంలో - రోగము వచ్చిన తరువాత మనం ట్రీట్మెంటును ప్రారంభించే కంటే, రోగములే రాకుండా ఉంచే స్థితిని కనిపెట్టాలి. తల్లి గర్భములో ఉన్నప్పుడే శిశువుకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉండేందుకై డాక్టర్లు, ప్రభుత్వమువారు దానికి తగిన ప్రచారము చేయాలి. చిన్న చిన్న బిడ్డలకే ఈ గుండె జబ్బు వచ్చిందంటే ఎంత ప్రమాదము! ఎంత బాధ! కొంతమంది చిన్న పిల్లలను చూస్తే ఎంతో ఆనందంగా ముద్దుగా కనిపిస్తారు. కాని, వారి జబ్బుచూస్తే భయంకరంగా ఉంటుంది. దీని వలన ఎవరికి సుఖము? తల్లిదండ్రులకు సుఖము లేదు; బిడ్డలకు సుఖము లేదు; సమాజానికి కూడా సుఖము లేదు. కనుక గర్భములో ఉన్నప్పుడే పిల్లలకు ఎలాంటిజబ్బులు రాకుండా ఉండటానికి తగిన ఉపాయము కనిపెట్టాలి. దీనికై ఔషదములు లేకపోలేదు, ఉన్నాయి. కాని, మనం బద్దకంతో వాటిని సక్రమమైన మార్గంలో వినియోగించటం లేదు.
గర్బవంతులైన స్త్రీలకు విటమిన్ A,B,C మొదలైనవాటి గురించి సక్రమమైన రీతిలో తెలిపి, వాటిని వాడకపోతే కలిగే దోషాలను గురించి హెచ్చరించాలి. "అమ్మా! నీవు Vit A సక్రమంగా తీసికొనకపోతే బిడ్డ కళ్లకు కొంత ప్రమాదం కలుగుతుంది." అని చెపితే ఏ తల్లియైనా తప్పకుండా వాటిని తీసుకొంటుంది. “మధ్య మధ్య నెలకొకసారైనా హాస్పిటల్‌కు వెళ్ళి Check-up చేయించుకోవాలి పుట్టిన తరువాత ఏమైనా దోషాలుంటే ఆ బిడ్డతో జీవితమంతా అనుభవించే బదులు నెలకొకసారి హాస్పిటల్ కు వెళ్ళి ట్రీట్మెంటు తీసుకోవడంలో తప్పేముంది?" - ఇలాంటి ప్రచార ప్రబోధలను చక్కగా చేయాలి. కాని, పాపం! డాక్టర్లు - తమ వద్దకు వచ్చినవారికి మాత్రం ఈ విషయాలను బోధించవచ్చుగాని, అందరికి ప్రచారం చేయడానికి వారికే మాత్రం అవకాశముండదు. ఆయితే డాక్టర్లు ఈనాడు చేయవలసిన ప్రయత్నమేమిటి - వారు ప్రభుత్వంపై ఈ విషయంలో వత్తిడి తీసికొని రావాలి ఎందుకనగా, ప్రపంచంలో ఈ విధమైన జబ్బులు అధికమై పోతున్నాయి కనుక ప్రభుత్వము యొక్క ప్రచారములను, విధానములను కొంత మార్చుకోమని చెప్పాలి. ఆట్లు కాకుండా, కేవలం కోట్లకొలది రూపాయలను ఖర్చు పెట్టి ప్రయోజనమేమిటి? దీని వలన ధనము నష్టమైమౌతున్నది కాని, ఆరోగ్యం కుదరటం లేదు.
(ప.3.మా.93 పు.60)
ఈనాటి అన్ని రోగాలకు కారణం hurry, worry, curry.
(భ.ప్ర.పు.1)
(చూ: శాంతము)