పదార్థమునకు రెండు శక్తులు ఆధారంగా ఉంటాయి. ఒకటి నిమిత్త మాత్రం రెండవది మూలాధారం. మూలాధారతత్వము లేనిదే కల్పితమున కాధారంలేదు. ఉ|| బంగారం అధిష్టాన (మూలాధార) పదార్థం. బంగారం తనంత తాను నగ కాలేదు. - నగ చేసే నిమిత్తమాత్రుడు (కంసాలి) ద్వారా తయారైంది. కంసాలిని వదలి నగ ఉండవచ్చును గాని ఆధారభూతమైన బంగారాన్ని వదలి నగ ఉండటానికి వీల్లేదు. అట్లాగే అధిష్టానమైన దైవత్వం నుండి నిమిత్తమాత్రమైన జగత్తు తయారైంది. నిమిత్తాన్ని వదలి అధిష్టానం ఉండవచ్చును. అధిష్టాన్ని వదలి నిమిత్తంఉండలేదు. - చేపలు లేక జలం ఉండవచ్చును. జలం లేక చేపలు ఉండలేవు. జగత్తు లేక బ్రహ్మ ఉండవచ్చును. బ్రహ్మలేక జగత్తు ఉండలేదు. ప్రపంచం వేరు బ్రహ్మవేరు అని భావించవద్దు. ప్రకృతి స్త్రీ. పరమాత్మ పురుషుడు. ప్రకృతి పురుష సంయోగమే సృష్టికి మూలం.
తల్లి, తండ్రి రెండూ కూడినదే జగత్తు. ప్రకృతి ద్వైతం, బ్రహ్మ అద్వైతం. ప్రకృతి సంగ్రహం, బ్రహ్మ అనుగ్రహం. సంగ్రహానుగ్రహాలు రెండూ కూడినచే జగత్తు. జడ చైతన్యములు చేరినదే జగత్తు. వీటిని వేరు పరచ వీలులేదు. జగత్తంతా బ్రహ్మయే. మృణ్మయ జగత్తులో చిన్మయ బ్రహ్మ ఉన్నది.
(త.శ.మ.పు.44/45)