రావణుడు ఎన్ని విద్యలు చదివినా, ఎంత కఠోర తపస్సు చేసినా అతనిలో హృదయ పరివర్తన కలుగలేదు. అతడు వాంఛలచేత కుమిలిపోయాడు, ఆశలచేత కృంగిపోయాడు. కోరికలచేత కల్మషుడయ్యాడు. కానీ, చిట్టచివరికి తనప్రాణం పోయే ముందు ప్రజలకు ఒక చక్కని సందేశాన్ని అందించినాడు. "ఓ. ప్రజలారా! నేను కామమునకు లొంగిపోయి నా కుమారులను పోగొట్టుకున్నాను . నావాంఛలకు లోబడి నావంశమును నాశనం గావించు కున్నాను. రాగమునకు లోబడి రాజ్యమును భస్మం గావించుకున్నాము. మీరు నావలె చెడిపోకండి, రామునివలె ధర్మమార్గమును అవలంబించి జీవితంలో ఉత్తీర్ణులు కండి" అన్నాడు.
(పసా. మే 99 పు.114)
రావణుడు మహావిద్యావంతుడు, మహా తపస్వి మహా శక్తివంతుడు. కాని, తన తెలివి తేటలను స్వార్థ స్వప్రయోజనాలలో ప్రవేశ పెడుతూ వచ్చాడు. మానవునికి సరియైన మార్గమును నిరూపింప చేయటానికి సుజ్ఞాన విజ్ఞాన ప్రజ్ఞానములు మూడూ ఆధారముగా ఉంటాయి.మొదట రావణునికిసుజ్ఞానమనే మండోదరి ఎంతగానో బోధించింది. "రావణా! నీ పత్నిని పరపురుషుడు అపహరించినప్పుడు నీ మనస్సు ఏ రీతిగా ఉంటుందో యోచించు,పరపురుషుని పత్నినినీ వపహరించి నప్పుడు ఆ పతి ఎంతగా బాధపడతాడో యోచించు. అనంతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన నీవు విచారణా శక్తి, విచక్షణా జ్ఞానము లేక అజ్ఞానములో ప్రవేశిస్తున్నావు. ఇది మంచిది కాదు" అని బోధించింది.
తరువాత విజ్ఞానమనే విభీషణుడు కూడా రావణునకు బోధించాడు. "సోదరా! నీవు చక్రవర్తివి, మహాతపస్వివి. ఇది చక్రవర్తి చేయవలసిన పనికాదు. మహా తపస్వివైన నీ
విట్టి పెడమార్గం పట్టడం మంచిది కాదు. నీ విజ్ఞాన శక్తితో చక్కగా విచారణ చేసి పవిత్రమైన మార్గంలో ప్రవేశించు" అని విభీషణుడెంతగా బోధించినప్పటికీ స్వార్థపరుడైన రావణుని తలకెక్క లేదు
ఈ విధంగా సుజ్ఞానమనే మండోదరి, విజ్ఞానమనే విభీషణుడు ఎంతగా బోధించి నప్పటికీ రావణునిలో ఏమాత్రం మార్పు లేక పోవడం చేత ప్రజ్ఞానమనే హనుమంతుడు ప్రవేశించి చెప్పాడు.
బుద్ధిచెప్పెద రావణా...!
ఈ లంక నీకింక లేదుర దుర్గుణా!
బుద్ధి చెప్పద వినుము నీవిక
సద్దుచేయక నాదు పల్కులు
బుద్ధికి యోచించక చావుకు
బద్ధుడవైతివి పాపమతివై ||బుద్ధి చెప్పెద
లోకమునకు తల్లిరా సీతమ్మ
నీకును చూడగ తల్లిరా...!
లోకమాతను తెచ్చి ఇప్పుడు
పాతకమున కొడిగట్టుకొంటివి
ఏక శరమున నీదు శిరముల
నేక మారుగ ద్రుంచు రాములు ||బుద్ధి చెప్పెదః
పది తలలుండే తీరు
నీ ఎప్పుడు చేసే దర్బారు
ఇవి కదా నే చూడవలెనని
ఇంద్రజిత్తు చేత చిక్కితి
పదె పదె నీ కేల చెప్పుదు
ప్రాణములు నీ సామ్ము కావురా!" బుద్ధి చెప్పెద॥
అని హనుమంతుడు ఎంతగానో బోధించాడు. కాని, స్వార్థపరునకు తన ప్రాణము తన హస్తములో లేదు. పవిత్రమైన హృదయము పరోపకారమైన భావములు కలిగి నిస్వార్థమైన హృదయంతో లోక కల్యాణమును ఆశించిన రామునకు మాత్రమే తన ప్రాణము తన హస్తములో ఉన్నది. ఇట్టి సత్యాన్ని గుర్తించిన వ్యక్తుల యందు దివ్యత్వమనేది సాక్షాత్కరిస్తుంది...
(స. సా.ఆ.93పు.209/210)
రావణుడు గొప్పవాడు. రాముడు మంచివాడు మంచితనమునకు గొప్పతనమునకు గల వ్యత్యాసమును మీరు గుర్తించాలి. అందరియందు దైవత్వమును గుర్తించి వర్తించడమే మంచితనము. రావణుని యందు కూడాదైవత్వాన్ని గుర్తించాడు రాముడు. యుద్ధానికి వస్తున్న రావణుణ్ణి చూసి "లక్ష్మణా! రావణుని తేజస్సు ఎంత గొప్పగా ఉందో చూడు సాక్షా త్తు ఇంద్రునిలా కనిపిస్తునాడు" అన్నాడు. ఇంత తేజస్సుండి ఇన్ని విద్యలుండి కట్టకడపటికి ఒక్క దుర్గుణంచేత రావణుడు నాశనమైపోయాడు.
(స. సా. జూ లై 2001పు.204)
(చూ దైవవిశ్వాసము, మంగళవారము, మంచితనము, మంచివాడు, రామచరిత్ర, సందేశము)