ఒక పర్యాయం విశ్వహిందూ పరిషత్ జనరల్ సెక్రెటరీ అశోక్ సింఘాల్ నా దగ్గరకు వచ్చి "స్వామీ! రాముడు జన్మించిన చోట మేమొక మందిరమును కట్టాలనిఆశిస్తున్నాము. రాముడు ఎక్కడ పుట్టాడు? మేము నిర్ణయించిన స్థానం లోనే పుట్టాడా? లేక, ఇంకో స్థానంలో పుట్టాడా? ఎక్కడ పుట్టాడో మాకు తెలియజేస్తే మేము అక్కడొక మందిరం కట్టిస్తాము" అన్నాడు. అప్పుడు నేను "పిచ్చివాడా! కౌసల్య గర్భమే రాముని జన్మస్థానము" అని చెప్పాను. వ్యక్తులు గాని, అవతారములుగాని అందరూ తల్లి గర్భము నుండియే జన్మిస్తున్నారు. గనుక, ప్రతి ఒక్కరూ తల్లి యొక్క కీర్తి గౌరవాలను కాపాడే వ్యక్తులుగా తయారు కావాలి. ఈ నవంబరు 19వ తేదిని లేడీస్ డే గా జరుపుకోవడంలో గల అంతరార్థం ఇదే. ప్రతి ఒక్కరూ తల్లి యొక్క ఇష్టమును అనుసరించాలి. ఒకవేళ తల్లికి తెలియకపోతే ఆమెను నొప్పించకుండా తగిన రీతిగా నచ్చజెప్పాలి.
(స.పా.డి.99 పు. 362/363)
ఈనాడు మీరు రాముని జన్మదినమును జరుపు కుంటున్నారు. అయితే, రాముడు బోధించిన విషయాలను ఆచరించకుండా కేవలం రాముని జన్మదినమును జరుపుకున్నంత మాత్రమున ప్రయోజనం లేదు. “
రామో విగ్రహవాన్ ధర్మః" రాముడు ధర్మస్వరూపుడు. రామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులు నల్గురూ దశరథుని కుమారులని మీరు భావిస్తున్నారు. దశరథుడనగా ఎవరు? భౌతికంగా చూస్తే అతడు అయోధ్య నగరానికి రాజు, అయోధ్య అనగా ఏదో కాశీకి సమీపంలో ఉన్న పట్టణమని, అక్కడే శ్రీరామచంద్రుడు పుట్టాడని భావించడం చాల పొరపాటు. ఒక రోజు అశోక్ సింఘాల్ నన్ను అడిగాడు. "స్వామీ, రాముని జన్మస్థానం గురించి అనేకమంది అనేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రాముని నిజమైన జన్మస్థానమేమిటో దయచేసి మాకు తెలియజేయండి." అప్పుడు నేను చెప్పాను. "సింఘాల్! రాముని యొక్క జన్మస్థానము కౌసల్య గర్భమే. రాముడు ఇక్కడ పుట్టాడు. అక్కడ పుట్టాడు అని మీరు కేవలం ఆకారాన్ని మాత్రమే ఆధారం చేసుకుంటున్నారు. కాని, రాముడు సర్వ వ్యాపకుడు."
(స.. సా. మే. 2000 పు.143)