ఒకనాడు తెల్లవారు ఝామున మూడు గంటలకు దశరథునికి ఒక పీడకల వచ్చింది. ఆ సమయంలో వచ్చిన స్వప్నం నిజమౌతుందని దశరథుని విశ్వాసం. తాను వృద్ధుడై పోయినట్లు. తన చేతులు, కాళ్ళు వణుకుతున్నట్లు అనేక అపశకునాలు కనిపించాయి. చాలా బాధపడుతూ లేచాడు. "ఇంక నేనెంతో కాలం ఉండను. కనుక, రామునికి వెంటనే పట్టాభిషేకం చేయాలి. దీనికి ఏర్పాట్లేమీ అవసరం లేదు" అని అప్పటికప్పుడు సంకల్పించుకున్నాడు. వశిష్టులవారిని సంప్రదించి ఆయన అనుమతి పొందాడు. రాముణ్ణి పిలిపించి "రామా!రేపటిదినం నీకు పట్టాభిషేకం చేయాలని సంకల్పించు కున్నాను. సిద్ధంగా ఉండు" అన్నాడు. రాముడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమయుడు, సర్వవ్యాపకుడు. అయినప్పటికీ తండ్రిమాటకు ఎదురు చెప్పడం మంచిది కాదని కొద్ది సేపుయోచించి "నాన్నా! భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు కదా! వాళ్ళు కూడా రావాలి కదా!" అన్నాడు. "అది నీకనవసరం. నా ఆజ్ఞను నీవు శిరసావహించు" అన్నాడు దశరథుడు. అప్పుడు రాముడు "మేము నల్గురమూయజ్ఞ పాయసమునుండి పుట్టాము, మా నల్గురికీ నామకరణం, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు సమానంగా ఒకేరోజునఒకే పర్యాయం మా నలురికీ పట్టాభిషేకం చేయండి" అని పలుకగా దశరథుడు "నాయనా! రాజ్యం ఒక్కటే. కనుక, రాజు కూడా ఒక్కడే ఉండాలి. నలుగురికీ పట్టం కట్టడానికి వీలుకాదు" అన్నాడు. "రాజ్యాన్ని నాల్గు భాగాలుగా విభజించి, మా నల్గురికీ ఒకే పర్యాయం పట్టాభిషేకం చేయవచ్చు" అన్నాడు రాముడు. దశరథునికి తల తిరిగింది. "రామా! నీవు కొద్దిసేపు బయటికి వెళ్ళు" అన్నాడు. రాముణ్ణి పంపించి, వసిష్టులవారిని పిలిపించి ఆయనతో ఈ విషయాన్ని చర్చించాడు. వసిష్ఠులవారు రామునికి నాయనా! నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. "రామా! తరతరములనుండి మన రాజ్యం విభజనకు గురి కాకుండా ఒక్కరి ఆధిపత్యంలోనే ఉంటూ వచ్చింది. ఇప్పుడు నీవు రాజ్యాన్ని విభజించాలంటున్నావు. అది శ్రేయస్కరం కాదు" అన్నాడు. “విభజించనక్కర్లేదు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు పరిపాలించవచ్చు" అన్నాడు రాముడు. కాని, దశరధుడు అంగీకరించలేదు.
రాముడు సమత్వమునకు, పాంఘికవ న్యాయానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చాడు. అందరూ సమత్వంగా జీవించాలి. హెచ్చుతగ్గులు ఏమాత్రం ఉండహడదు, భదములకు అవకాశం అందించ కూడదు. ఇది రాముని ఆశయం. కాని, దశరధుడు వృద్ధాప్యంవలన రాముడు చెప్పేమాటలను అర్థం చేసుకునే స్థితిలో లేడు. అందుచేత, రాముడు "భరత శత్రుఘ్నులు కూడా రావాలి" అన్నాడు. వాళ్ళు రావడానికి కనీసం పదహైదు రోజులు పడుతుంది. కాబట్టి, ఈలోపల తగినరీతిగా యోచన చేసుకోవచ్చనిభావించాడు. అప్పటికి పట్టాభిషేకం నిలిచిపోయింది. రాముని శక్తిసామర్థ్యములు, యుక్తి ప్రయుక్తులు చాలా చిత్రమైనవి. విచిత్రమైనవి. అందరూ సమత్వంగా ఉండాలన్నదే భారతీయ సంస్కృతి యొక్క ప్రధానసందేశం. "సర్వేజనాః సుఖినో భవంతు", "లోకాస్సమస్తా: సుఖినో భవంతు". అందరూ సుఖంగా ఉండాలి. ఇలాంటి ప్రాచీన సంస్కృతిని రాముడు పాటిస్తూ వచ్చాడు. ఈనాడు అనేకమంది రామాయణం చదువుతున్నారు. పెద్ద పెద్ద తలదిండ్ల మాదిరి ఉండే పుస్తకాలను తెచ్చి పెట్టు కుంటున్నారు. శ్లోకాలను కంఠస్థం చేస్తున్నారు. కాని, సారాన్ని కించిత్తైనా గ్రహించడం లేదు.
(స.పా.మే. 2002 పు. 142/143)