వేదాంత రహస్య మంతయు నీ చేతిలోనే యున్నది. ఎట్లందువా? ని చేతి బొటన వేల (అంగుష్ఠము) పరమాత్మ, చూపుడు వ్రేలు (తర్జని) జీవాత్మ. తక్కిన మూడు వేళ్ళును (మధ్యమము, అనామిక, కనిష్ఠిక) సత్వరజస్తమో గుణములు. అంగుష్టము - తక్కిన వేళ్ళతో చేరక, యెడముగా నుండును. అట్లే, పరమాత్మయు, ప్రపంచములో చేరక యెడముగా నుండును.
తర్జని - తక్కిన మూడు వేళ్ళతోను చేరియుండును. అట్లే జీవాత్మయు, త్రిగుణాత్మక ప్రపంచములో చేరియుండును.
మధ్యమాదులు మూడును - కలిసియే పని చేయు చుండును. అట్లే త్రిగుణములును కలసియే పనిచేయుచుండును. నీ కుడిచేతిని, నీ వక్షము ముందు నిలువుగా పెట్టి చూడు. బొటనవ్రేలు నీ హృదయమును చూపుచుండును. నీవు పరమాత్మాంశవనుటకు అది సూచన.
తర్జనిని అంగుష్టములో చేర్చితివేని, అప్పుడు దానికి తక్కిన మూడు వ్రేళ్ళతో సంబంధము వదలిపోవును. అది, జీవుడు, ప్రపంచ సంబంధము వదలి, పరమాత్మతో చేరుటను తెలుపును. అది సామీప్యము అను దశను తెలుపును.
తర్జని యంగుష్ఠముతో చేరినపుడు అది చిన్మద్రయగును. ఆ ముద్ర పరిపూర్ణ జ్ఞానమునకు చిహ్నము.
మీరు మీ శ్రద్ధను, మీ సర్వ ప్రయత్నములను, మీలో నున్న యాత్మ మీదనే కేంద్రీకరింపుడు. అట్టి యుత్సాహము మీకు కలుగునట్లునే నాశీర్వదించుచున్నాను. ఆ విధముగా మిమ్ము సంస్కరించుట కొరకే ప్రశాంతి విద్వన్మహాసభ స్థాపింపబడినది.
(శ్రీస.వ. 1995 పు. 235/236)
బొటనవేలు పరమాత్మకూ, చూపుడువేలు జీవాత్మకు సంకేతాలు. ఈ రెండు వేళ్ళ కలయికను "చిన్ముద్ర" అంటారు. అది జీవాత్మ పరమాత్మల ఏకత్వమును సూచిస్తుంది.
(శ్రీ స. ది పు.47)