ధర్మసంస్థాపనకు తగినది ఒకటి కలదు విను; దానినే చారుర్వర్ణ్యవ్యవస్థ యని యందురు. ఇది ప్రజల కర్మలనూ గుణములను అనుసరించి నాలుగు విధముల సృజించి యున్నాను.
"ఈ వర్ణ్యవ్యవస్థ సృష్టి సంచాలనమునకు అత్యావశ్యకము. దీని అంతరార్ధమును ప్రజలు అంత సులభముగా గ్రహించుకొనలేరు. ఏదో ఈ వర్ణములు మానవులను అనేక విధముల బాధించి భేదములు కల్పించుచున్నవని అజ్ఞానులు తలంతురు. విషయ విచారణద్వారా పరిశోధించిన పదార్ధము యొక్క యదార్ధము బైటపడును. కాని పరిశోధన సలుపక వర్ణ భేదము సరియైనదికాదని వాదించిన, విషయము తెలియని వాదన, వివేకములేని రోదన, విశ్వాసము లేని వేదనగా మారును, లోకమునకే ఈ వర్ణములు నేను కల్పించితిని కాని లోక క్షామమునకు కాదు. ఈ వర్ణమువలన మానవుడు తన కభిరుచియగు కర్మల నాచరించి పూర్ణమును పొందుచున్నాడు. వర్ణ నిబంధనలు లేనిది మానవుడు ఒక నిమిషమూ సుఖపడడు.
మానవుని కర్మలకు వర్ణములు ప్రాణము వంటివి.
"సాత్విక గుణము ద్వారా బ్రహ్మతత్త్వమును తెలిసికొని లోకమునందు ఆధ్యాత్మిక, నైతిక, ప్రగతి జీవనమును ప్రేరేపించి స్వస్వరూప సందర్శన భాగ్యమును కలిగించునట్టివారలను బ్రాహ్మణులనియు, రాజ నీతిని, శాసన వ్యవస్థను, దేశ క్షేమమును, ధర్మమును రక్షించెడి దృష్టితో దుష్టులను దుర్మారుల నుగ్గడించుచూ అసహాయ దీనులైన దుర్బలులను కాపాడుచూ అట్టివారలకు చేదోడు వాదోడుగా వుండి పరిపాలన చేయు వారలను క్షత్రియు లనియూ, పాడి పంటతో న్యాయబద్ధమైన వృత్తి వ్యాపారములతో వృద్ధినొందించుచూ లోకములో సామాన్య ప్రజలకు తగిన ఆహార సదుపాయములను అందించుచు, ప్రజా దేహ పోషణకు సాధ్యమైనంత సదుపాయములను కల్పించువారలనే వైశ్యులనియు, ప్రపంచ శ్రేయమునకు పునాదులు వేయుచు సేవాకర్మల నాశ్రయించి పైమూడు వర్ణముల వారిని అనుసరించి వారలకు తగిన బలమును అందించువారలను శూద్రులనియూ; నాలుగు వర్ణములను నిర్మించితిని. ఇట్లు వారి వారి విహిత విధాన కర్మలను ఆచరించుచున్న లోకము కాని సమాజము కాని సర్వతోముఖ వికాసమును పొందును. ఇట్టి నిబంధనలు ఉండుటచే శ్రమ విభాగములు జరిగి వ్యక్తి సమాజ జీవితములో ఒడు దుడుకులు లేక హాయిగా వుండగలడు" అని వర్ణవస్థను వివరించెను. ఇట్టి వర్ణ విభాగములు భగవంతుడు భారతీయులు కొసగిన వర ప్రసాదము. భారతీయులెంతటి అదృష్టవంతులో భగవంతుని అనుగ్రహమునకు పాత్రులై ప్రతిచర్య భగవదాజ్ఞకు బద్ధమైనదై యుండుట మహా భాగ్యము. ఈ విషయమున మనము కొంత యోచించ వలసిన విషయము కలదు. ఇది ప్రధానమైన సమస్య. భగవత్ ప్రసాదమైన వర్ణ్యవ్యవస్థకు నేడు భయంకరమైన ప్రమాదము కలుగుచున్నది. పాలకులు గూడనూ వర్ణ్యవ్యవస్తను రూపుమాపిన కాని లోకమునకు క్షేమమేర్పడదని వర్ణ్యవ్యవస్థ వలననే భారతదేశ మంతటి దుస్థితికి వచ్చినదని అనేకమంది వాదించుచూ బోధించుచున్నారు.
మంచిదే! సర్వులకూ లోకక్షేమమే ప్రధానము. కాని వర్ణ్యవ్యవస్థ వలన లోకము ఇంతమాత్రమైనా నిలువ గలిగినదా, లేక వర్ణ్యవ్యవస్థ క్షీణించుటచేత ఈ దుర్గతి పట్టినదా? అని బుద్ధిమంతులు శాంతముగా విచారణ సలిపి పరిశోధనల ప్రమాణములచే వీటిని ప్రక్కకు నెట్టిన, తప్పక అందరూ ఒప్పుకొనదగినదే. అట్లుకాక, విచారణలు సలుపక, వివేకదృష్టితో పరిశోధించక అనుమాన ప్రమాణములతో వర్ణ్యవ్యవస్థను నిందించుట సహించలేని విషయము.
కొంత మంది పెద్దలు చెప్పినట్లు వర్ణ్యవ్యవస్థలు సక్రమమార్గమును తప్పి వక్ర మార్గమును పట్టినది వాస్తవమే. అంతమాత్రాన దానిని పారద్రోలుట న్యాయముకాదు. చేతులు చేయవలసిన పనులు కాళ్ళు, కాళ్ళు చేయవలసిన పనులు తల చేయుచున్నదని చేతులు, కాళ్ళు, తెగగొట్టుట మంచిదికాదు. అట్లు దారితప్పిన వాటిని క్రమముతప్పినవాటిని, ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించవలెను. కాని అసలుకే మోసము చేసిన అన్యాయమునకు గురియగును. అసలు యింత అరాజకమునకు మూలకారణము వర్ణ్యవ్యవస్థ యేర్పడి కాదు. వర్ణ్యవ్యవస్థను సరియయిన మార్గమున పాషించకుండుటే కారణము. వర్ణ్యవ్యవస్థ భగవత్ ప్రసాదితమైనది. తగినరీతిగా గౌరవించక, సక్రమ మార్గమున నడిపించక, ఇష్టమొచ్చినట్లు వుపయోగించు కొనుటచే ఈ విధమైన అవలక్షణములకు దారితీసినది. ఈ చాతుర్ణ్యవ్యవస్థ ఒక మన భారతీయులకే కాక యావత్ ప్రపంచమునకు అవసరమైనది. విదేశములలో మాత్రము ఈ పద్ధతి లేకపోలేదు. అక్కడికీ ఇక్కడికి ఒక్క పేరు మాత్రమే వ్యత్యాసము. అక్కడ కూడనూ శిక్షక వర్గమని, రక్షక వర్గమని, వణిగ్వర్గమనీ, శ్రామిక వర్గమని నాలుగు రకములు కలవు.
అయితే మన భారతవర్ణములు జన్మతో నిర్ణయింపబడినవి. విదేశీయులకు కర్మతో నిర్ణయించబడినవి. ఇదే వాటికీ వీటికీ భేదము. ఇప్పుడు ప్రథమస్థానము ప్రతిష్టించబడిన బ్రాహ్మణులయందు దారి తప్పి తుచ్ఛమార్గములకు వడిగట్టినవారు లేకపోలేదు. నాలుగవ స్థానమున శూద్రులనువారలయందు పవిత్రభావములు అభివృద్ధి ఆయి చిత్తశుద్ధి కొరకు పాటుపడువారు లేకపోలేదు. ఇంతమాత్రమునకే వర్ణము పనికిరాదనుట ఒప్పుకోదగినది కాదు.
(గీ పు.69/72)
ఇదే వర్ణ్యవ్యవస్థను మరి కొంతమంది వేరొక రకమున ప్రచారము సల్పుదురు. ఏదెట్లున్ననూ ఒక దేహమందుండిన అంగములవలె ఈ నాలుగు వర్ణములూ నాలుగు అంగములుగా నిలచినవి. భగవంతుడను దేహమునందే ఉద్భవించిన అంగములే ఈ వర్ణములు. ముఖము నుండి బ్రాహ్మణులనియూ, భుజముల నుండి క్షత్రియులనియూ, తొడల నుండి వైశ్యులనియు, పాదముల నుండి శూద్రులనియు చెప్పబడుచున్నది. అయితే దీనికి సూక్ష్మార్థము వేరు కలదు. గురువులవలె జ్ఞానమును ఉపదేశించుటకు వాక్కువంటివాడు బ్రాహ్మణుడనియు భూభారము వహించువాడు బాహుబలుడగు క్షత్రియడనియు, శరీరమును నిలబెట్టు తొడలవలె సంఘ సౌధమును నిలబెట్టు సమర్థుడు వైశ్యుడనియు, తిరిగి పని పాటు చేయుటకు పాదము లుపయోగమగునట్టితరి కృత్యములు చక్కబెట్టువాడు, శూద్రుడనియు భావము. శరీరమునకు యే అవయవములు లోటు వచ్చిననూ దాని కది కొఱతయే యగునట్లు సంఘమున కీ కార్యములు చేయువారిలో నెవరు లోటయిననూ లోపము వచ్చి క్షేమము చెడును. శరీరావయవములు అన్నియూ ఉత్తమములయినట్లు వర్ణములన్నియూ శ్రేష్టములయినవే. కాలుచేతులు కడుపు పై కోపించి పనిమానుటవంటిదే వర్ణ వైషమ్యము. ఒక చక్కెర బొమ్మ నుండి వచ్చిన పదార్ధములే కదా! తల గిల్లుకొని నోటిలో వేసుకొన్ననూ తిపే,కాలు గిల్లుకొని నోటిలో వేసుకొన్ననూ తిపే. అన్నీ ఒక పరమాత్మ దేహము నుండే వచ్చిన ఈ వర్ణములను అంగములు వేరు వేరుట్లగును! కర్మలు వేరు వేరు కాని రక్తనాళములూ సుఖదుఃఖములూ, అందఱికి ఒక్కటే. దేహమంతా సమాన రక్తమే ప్రవహించును కానీ చేతులకొకరక్తము, పాదముల కొక రక్తమూ, ముఖమునకు మరొక రక్తమూ ప్రవహించదుకదా! ఇది వేదవిహితమైన సమానధర్మము కానీ కల్పితమైన మానవ నియమములు కావు. కనుక వర్ణవ్యవస్థను అర్థము చేసుకొనక, వాటివలన లోకమునకు అనేక భేదభావములు కలుగుచూ ద్వేషములకు గురి యగుచున్నట్లు తలంచుట అజ్ఞానము తప్ప వేరుకాదు.
వర్ణ్యవ్యవస్థను నిర్మూలము చేసిన లోక క్షేమము కలుగునని వాదించు వారు మాత్రమే లోక క్షేమమును కోరుచున్నారని వారు భావింతురు కాబోలు: వర్ణ్యవ్యవస్థ మంచిదని వాదించువారు. లోకమునకు హాని కోరువారని వారి ఉద్దేశ్యమై యుండవచ్చును. ఇవి రెండనూ భ్రమలే. వర్ణ్యవ్యవస్థను వ్యతిరేకించువారికంటే వర్ణ్యవ్యవస్థను కాపాడవలెనను వారలలోనే లోకక్షేమము నిండుగా దండిగా నుండును. అది వారు తెలసికొనలేకున్నారు. ఏదో వర్ణ్యవ్యవస్థను నిర్మూలము చేసిన మేము దేశాన్ని కాపాడినవార మగుదమని భ్రాంతిపడుచున్నారు. అది అమాయకపు తృప్తి, వర్ణ్యవ్యవస్థను వ్యతిరేకించువారు కానీ, పోషించవలెనను వాంఛకలవారు కానీ, చక్కగా విచారణ సల్పి మంచి చెడ్డలు స్పష్టముగా దెల్పితదుపరి పరిపాలించుటో పాడుచేయుటో చూచు కొనవచ్చును. కాని, వూరికే విషయము తెలియని వాదనలలో విపరీతార్థములు చెలరేగించిన వింతమార్పు కలుగును. ద్వేషము పెరుగును. అది యెవరికీ క్షేమము కాదు.
యెండమావుల జలమను భ్రాంతిచేత తరుముకొని పోయినట్లు సర్వం సమానమను భ్రాంతితో సర్వులకూ అశాంతిని కలిగించుచున్నారు. ప్రజా ప్రతినిధులయిన పండితులునూ, అనుభవజ్ఞాలయిన పెద్దలను చేరి పరిపాలకులు పరిశోధనలు సలుపుట చాలా మంచిది. కానీ వీటి విషయమే తెలిసికొనక బాహ్యకర్మలనే ప్రధానముగా పట్టుకొని ఇందులో యేదో విషయమున్నదని అదిరిపడుట అవివేక లక్షణము. పరిపాలకులకు, పండితులకు ప్రజాక్షేమమే ప్రధానము. అసలు ఈ వర్గములు అందరి క్షేమమువకే అవతరించినవి. దీనిని వినియోగించు విధానములు అనుభవజ్ఞులద్వారా యోచించక, ఆచరించక ఇన్ని అపోహలకు దారి తీసినవి. ఒక చిన్న ఉదాహరణము యోచించుడు. ఇపుడు పరదేశీయులు లక్షల మందిని చంపే బాంబులు తయారుచేసినారు. అవి చెడ్డవనే తెలుసు. వాటికి ప్రభుత్వమే అనేక విధముల తోడ్పడుచున్ననూ చేసిన శాస్త్రజ్ఞుడు తెలివి తేటలు గల వాడైననూ వినియోగించే విషయమున, తిరిగి ప్రభుత్వపు అనుమతి అవసరము కదా! చెడ్డవాటికి ప్రభుత్వము సర్వసహాయము చేసిననూ అది అవసరమును బట్టి వినియోగించవలెనే కాని చేసితిమి కదా యని యిష్టమొచ్చినట్లు ఉపయోగించిన అందరికి ప్రమాదమే! లోకమున అరాజకము సంభవించినపుడు ఆత్మ రక్షణ కొరకు వారివారి దేశరక్షణ కొరకు వాటిని ఉపయోగింతురేకాని లోకమునే నాశనము చేయవలెనను దృష్టి కాదుకదా!
అట్లే వర్ణములను తీక్షణమైన రక్షణలను, వారివారి కర్తవ్యములను కొనసాగించి దేశమును రక్షించునట్టి ఆయుధములనే భావించవలెను. వాటిని యే యే విధముగా క్రమము తప్పక వినియోగింతుమో భద్రపరతుమో అట్లే వాటిని ఆచరించి భద్రపరచవలెను. కానీ వాటిని హద్దూ పద్దూలేక ఇష్టమొచ్చినట్లు ఉపయోగించుటచే ఇంతటి అరాజకమునకు గురి అయినవి. కనుక పూర్వపురుషులు, మహారాజులు, ఉత్తమ పండితులు, అనుభవజ్ఞులయిన మహానుభావులు, వీటి నెంతటి పవిత్రముగావాడి, తరించి ఇంతకాలము కాపాడుకొని వచ్చిరో ఒకపరి యోచించిన అవి మంచివా చెడ్డవా బుద్ధిమంతులకు గోచరము కాగలదు. అవి లోకమునకు అపకారమే చేయునవయినా వారల కేమీ తెలివి లేకనా, లేక ఇప్పటి కాలపు చదవు సంధ్యలు లేకనా, అసలు అమాయకులా? కాదు కాదు. వారి తెలివితేటలు, వారి బుద్ధికుశలతలు వారి ఆత్మ విద్యలూ, వారల పరిశోధనాబలములూ, ఇప్పటివారలలో వెతికిననూ కొటికొక్కరిలో చిక్కవు. వారు కందమూలాదులు భక్షించి, కాయకష్టములు సలిపి, లోకక్షేమమును ప్రాణముగా భావించి, తమ తమ సర్వశక్తులనూ ధారబోసిన మహాత్యా గులు, యోగులు, యోధులు. నిజమున దేశక్షేమమును కోరి, ఆశించి అన్ని విధములా ఢీకొట్టిన మహాఋషులు, ఇప్పటి వారలవలె మాటలతో క్షేమమును కోరుచూ చేతలతో అంతా నాశనమే చేయుట పూర్వీకులకు తెలియని విద్య. ఇట్టివే నేటి నూతన భావములు, నవీన ప్లానులు: వీరి ప్లానులు గాలి మేడలు. వారిని వారికే తెలియును తప్ప అన్యులకు అర్థము కాదు. ఒక వైపు కట్టుచూ వచ్చుచుండిన మరొక వైపున కూలుచూ వచ్చుచుండును: వూహమేడలు.
జీవునకు దేహమెట్లు ప్రధానమో దేవునకు దేశమట్లు ప్రధానము. దేహమునందలి యే భాగమున యేమి జరిగిననూ జీవునకెట్లు సంబంధమో దేశమున యే భాగమున యేమి ప్రమాదము జరిగిననూ, దేవునకట్లే సంబంధించి యుండును. దేహములోని సర్వాంగములూ యెట్లు క్షేమముగా నుండకోరుదుమో, దేశములో సర్వ ప్రాంతములూ అంత క్షేమముగా నుండవలెననే దేవుని భావము. దేశమంతా దేవుని దేహమయినపుడు, తన అంగముల నాశమును దైవము కోరుకొనుననుట వివేకమా? దైవవిషయమున సర్వులూ సమానులే.
దైవమును పొందే విధానమునకు సర్వలకు అధికారమున్నది. కాని యే యే కర్మలు చేసి తమ తమ కర్తవ్యములను జరుపవలెనో ఆయా అవయవములు అట్లు చేయవలెను. అట్లే ఆయా వర్ణములవారు తమ తమ హద్దులను దాటక తమ తమ కర్తవ్యములను సలిపి దేశ క్షేమమునకు పాటుపడవలెను. దేహమునకెట్లు అవస్థా భేదములున్నవో అట్లే దేశమునకు వర్ణములు, అవస్థాభేదములు. అట్లుకాక వ్యాపారము చేయువారే అందరూ వుండిన కొనువారవరు? అందరూ యుద్ధము చేయువారే వుండిన వారికి తగిన తిండి, తీర్థములు, సరఫరా చేయువారెవరు? అందుకనే ఒకరు ఒక వర్గమును వర్ణమును నియమించుకొని, వారి వారి పనులు వారు చేయుచూ, తమ తమ కర్మలన్నియూ దేశ రక్షణ నిమిత్తమని భావించుట చాలా ఉత్తమ మార్గము. చేయవలసిన వెన్నియో ఉండగా అనవసరంగా వర్ణములను అడ్డు పెట్టుకొని మనలో మనము యుద్ధము చేయుచున్నాము. మన మన దేహములనే హద్దులో పెట్టుకొనలేని వారలము. ఇక దేశము నేమి హద్దులో వుంచగలము? వర్ణకలహములు మాని దేశ క్షేమమును యోచించుట మంచిది. ఇంత కాలమూ మన పూర్వీకులు యెట్లు కాపాడుకుంటూ వచ్చారో అటులనే నేడునూ మన వర్ణములను కాపాడుకొనుట దేశమునకే పరమ శ్రేయస్సు.
ఈ వర్ణ్యవ్యవస్థలో పరమాత్ముడు యెట్టి పక్షపాతమూ చేయలేదు. అతనిలో అట్టి గుణమేలేదు భగవంతునికి కూడా ఈ భేదమెందుకని కొందరు తలంతురు. అతనిలో భేదము యే కొననులేదు. చక్కెర ముద్దవంటి చల్లనివాడు, తియ్యనివాడు దేవుడు, సర్వభేధములూ, బాధలూ, అనాత్మ భావముగల జీవుల కల్పనలేకాని దేవుని కల్పనలు కావు. ఉదాహరణమున కొకవిషయము యోచింతము: ఒక తల్లికి నలుగురు పిల్లలు గలరు. నలుగురూ ఒకే తల్లి గర్భము నుండి జన్మించినవారే! కాని, తొట్టిలో పరుండబెట్టిన బిడ్డ యోగక్షేమములు చూచినట్లు మిగిలిన పిల్లలను ఆ తల్లి చూడదు. అంతేకాక పిల్ల పిలువక పోయిననూ కాలకాలములకు తగిన ఆహార సదుపాయములు తల్లియే గమనించుచుండును. మిగిలిన ముగ్గురు బిడ్డలు వచ్చి అడిగిననే అన్నము పెట్టును. ఆటబొమ్మలిచ్చును. అంతమాత్రముచేతనే తల్లి భేదబుద్ధిగలదనికాని, తన ప్రేమంతా కడగొట్టుబిడ్డపై నున్నదనికాని చెప్ప వీలులేదుకదా! బిడ్డల యొక్క శక్తి సామర్థ్యమునూ, పరిస్థితులను పట్టి తల్లి యెట్లు మెలుగునో అటులనే లోకమంతా తనవారైనప్పటికినీ అందరూ తన సంతతే అయినప్పటికిని ఒక్కొక్కరి శక్తి సామర్ధ్యములను పట్టి ఒక్కొక్క రక్షణ బాధ్యతను దేవుడు నియమించినాడు. అట్టి విస్స్వార్థమైన, నిర్దోషియైన నిరాడంబరుడైన నిత్యానందునిపై నిందలు మోపుట సూర్యునిలో చీకటిని వెతుకుట వంటిది. తన కిరణములు పడిన వెంటనే చీకటి పటాపంచలయైపోవును. అట్టిది ఇక తనలో చీకటి నిలుచుటకు వీలగునా! ఇది యెంత ఆజ్ఞానము. ఇట్టివారలను సూర్యుని విషయమే తెలియని వారనవచ్చును.
అసలు ఆధ్యాత్మిక దృష్టిలో ఈ వర్ణములను మరొక రీతిగా భావించ వలసియుండును.బ్రహ్మ నిష్ఠగలవాడే బ్రా హ్మణుడు. అసత్యపక్ష మును ధిక్కరించువాడే క్షత్రియుడు;సదా సద్విచారము చేయు జాలెడి వ్యవసాయాత్మికబుద్థి గలవాడే వైశ్యుడు; కర్మనిష్ఠా సత్యాచరణను సల్పువాడే శూద్రుడు; మానవత్వము పోందుటకు ఈ నాలుగు వృత్తులుఅత్యావ శ్యకము.
(గీ పు.74/79)