భగవంతునికి నివాసమైన శుద్ధమానసం ప్రతి భక్తునకు పవిత్రమైన పెన్నిధి. మానవుని మనస్సున పవిత్రమైన, శాశ్వతమైన, సత్యమైన తలంపులు ఆవిర్భవింప చేసుకోవాలి. ఇట్టి పవిత్రమైన భావములను ఏ మానవుడు తనయందు ఆవిర్భవింప చేసుకొనునో, అట్టి వాని జన్మయే సార్ధకము. చాతకపక్షి స్వాతి వర్షబిందువునకై అనేక కష్టములను అనుభవిస్తుంది. కారుమేఘుములు చూచినంతనే, తన దీక్షను ప్రారంభిస్తుంది. ఈ ధరణిలో కావాలసినంత కాలము ఉంటున్నది. కానీ, ఈ చాతకము ఈ మలినజలమును ఆశించదు. స్వాతి కార్తిలోని స్వాతిచిందువుకై, జలధరం నుండి కురిసిన ఈ శుద్ధమైన వర్షబిందువునే ఆశించుగాని నిల్చిన నీరునుగాని, ప్రవహించే నీరునుగాని తాను ఆశించలేదు. భయంకరమైన ఉరుములకు తాను ఏమాత్రము భయపడదు. మిరుమిట్లు గొలిపే మెరుపులకు తాను రువదు. అదరక బెదరక, కదలక స్థిరమైన భావముతో మేఘబిందువులకై తాను తపస్సు చేస్తుంది. ఆ జలబిందువుకై "పీ-పీ" అని తన ఆనందమును వ్యక్తం చేస్తుంది. ప్రీతికి ప్రతి నిధి ఈ చాతకము. నిజమైన భక్తుడు ఇట్టి తపస్సును ఆచరించాలి. ఇట్టి దీక్షను వహించాలి. ఆశించిన ఆనందమును అనుభవించటానికి ఈ కఠోరమైన సాధన చెయ్యాలి. లోక సంబంధమైన వాసనలకు గాని, పరువు ప్రతిష్టలకు గాని తమ పవిత్రమైన జీవితమును పాడు చేసుకోరాదు. బంగారమువంటి మానవ జీవితమును భగవత్ నామమనే గీటురాయి పైన గీటు పెట్టాలి. ఇట్టి సులలితమైన మార్గమును అనుభవించక, అతి కష్టతరమైన మార్గమునే తాను ఆచరిస్తూ తనయొక్క విలువైన జీవితమును నిరుపయోగము చేసుకొంటున్నాడు. మానవుడు మానవుడే కాదు. మానవుడే దేవుడు. తనయందున్న దైవత్వాన్ని క్రమ క్రమేణా విషయ వాసనలలో వ్యర్థము చేసుకొంటున్నాడు. అందుచేత తనలో ఆవిర్భవించిన దివ్యమైన భావాన్ని సా త్వికమైన మార్గములో ప్రవేశపెట్టాలి.
(స సా.మా 1991 పు.59)
బలమైనటువంటి తుఫాను చెలరేగినప్పుడు అనేక రకములైన ఉరుములతో, మెరుపులతో, భయంకరమైన పెనుగాలులతో ఏకధారగా వర్షము కురుస్తూ ఉంటుంది. ఇటువంటి కృత్యములు జరుగుతున్నప్పటికిని చాతక పక్షి వీటిని ఏ మాత్రము లెక్క చేయక మొగమును ఆకాశమువైపు త్రిప్పి, పై నుండి పడే వర్షపు బిoదువులను మాత్రమే గ్రోలాలని, తన లక్ష్యమంతా వర్షపు బిoదువుల పైన ఉంచును. ఆ పక్షి బోధించే దీక్షను ఆధారము చేసుకున్నపుడు, ఆనందము అనే దాహము నివారణ కాగలదు.
భూమి పైన సర్వత్ర నిండిన జలమును ఆ పక్షి గ్రోలటానికి అంగీకరించదు. భూమి సంబంధము లేని సమయము నందే, ఆ బిందువును త్రాగటానికి తాను ఇష్టపడుతుంది. అదే రీతిగా, భూమికి సంబంధించిన విషయవాసనల ఆనందములను ప్రక్కకు నెట్టి ఎన్ని కష్టములు, నష్టములు, దు:ఖములు, నిందలు, నిష్టూరములు వచ్చినప్పటికినీ, వాటిని లెక్క చేయక దైవము పైన సంపూర్ణ విశ్వాసము కలిగియుంటివా, ఆనందము తప్పక గ్రోలవచ్చును.
(త్వశమపు. 61/62)||