తనకు ఉపకారము చేసిన వారికి అపకారము చేసేటటువంటివాడు. రాక్షసుడు. ప్రేమించిన వారిని కూడను ద్వేషించేవాడు రాక్షసుడు. ప్రేమించినటువంటి వారిని ప్రేమించువాడు మానవుడు, దూషించి నటువంటి, హింసించినటువంటి వారిని కూడను ప్రేమించేటటువంటి వాడే దేవుడు. తనకు కీడు చేసినటువంటి వారిని కూడనుప్రేమిస్తుంటాడు పరమాత్ముడు. పరమాత్ముని యొక్క తత్వము ప్రేమయే. ప్రేమయే అతని స్వరూపము. రాముడు ప్రేమగలిగినవాడు గనుక, ప్రేమ క్షముకు జన్మస్థానము.
(ఆ.రా.పు.86)
రాక్షసులనగా ఒక ప్రత్యేకమైన స్వరూపము గలవారు కాదు. మన దుర్గుణాలు, దుర్భావాలే "రాక్షసులు". ఈ రాక్షస నాయకుడైన రావణాసురుడు పదితలలు కలిగినవాడని మనం భావిస్తున్నాము. రావణుడు పదితలలతో పుట్టలేదు. ఏమిటీ పది తలలు? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు, మనస్సు - బుద్ధి - చిత్తము - అహంకారము - ఈ పది గుణములతో కూడినవాడే రావణాసురుడు. అతనికి ఆ ఒక్కొక్క గుణము ఒక్కొక్క శిరస్సుగా రూపొందుతూ వచ్చింది. కనుక, ఎవరికి వారు "నేను రాముడనా? రావణాసురుడనా?" అని విచారణ చేసుకోవాలి.రామచంద్రుడు ఈ రావణుని ఒక్కొక్క శిరస్సును (అనగా ఒక్కొక్క దుర్గుణాన్ని) ఖండిస్తూ వచ్చాడు. ఈ దుర్గుణములను సంహరించేవాడు కూడా భగవంతుడే. అయితే దుర్గుణాలను నాశనం చేసే సమయంలో రజోగుణ స్వరూపాన్ని ధరిస్తాడు. ఈ రజోగుణము కూడనూ సాత్వికముతో కూడినటువంటిదే. రామునికి రావణునిపై ప్రేమ, దయ ఉండుట చేతనే అతని దుర్గుణాలను నిర్మూలం గావించాడు. ప్రేమయే లేకుండా దుర్గుణాలను దూరం చేయుటకు వీలుకాదు. కనుక ఈ రజోగుణము లోపల కూడా సాత్వికము చేరి యుంటున్నది.
(స.సా.న.91 పు.306)
(చూ ఆద్వైత దర్శనము, దైవస్వరూపులు, నరకాసురుడు, పంచేంద్రియములు, ర్యాగింగ్)