యజ్ఞ మనగా ఏమిటి? "యజ్ఞో వై విష్ణు. కనుక, యజ్ఞ మనగా విష్ణు స్వరూపమును భజించటమే. విష్ణుస్వరూపానికి అర్పితం గానించటమే. అయితే, దేనిని అర్పితం చేయాలి? లౌకికమైన ధన కనక వస్తు వాహనాదులను కాదు. మీ హృదయాన్ని అర్పితం చేయాలి. దుర్గుణములను, దురాలోచనలమ త్యజించి సద్భావములను, సత్ప్రవర్తనను సచ్చింతనము భగవంతునికి అర్చితం గావించాలి. "యద్భావం తద్భవతి" మీ భావం ఎలాంటిదో మీకు అలాంటి ఫలితమే లభిస్తుంది.
సత్య స్వరూపుడైన భగవంతుణ్ణి పొందే నిమిత్తమై ప్రాచీన ఋషులు ఈ వేదపురుష సప్తాహ జ్ఞానయజ్ఞాన్నిప్రారంభించారు. భగవంతుడే వేద పురుషుడు. ఈ సప్తాహంలో సప్త ఋషులు. సప్త సముద్రములు సప్త వర్ణములు, సప్త స్వరముల తత్త్యము చేరియుంటున్నది. ఒకనొక సమయంలో ఒక వ్యక్తి ఒకచోట యజ్ఞం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి యజ్ఞయాగాది క్రతువుల పేరుతో విలువైన ఆవునేతిని అగ్నిపాలు చేయడం మూర్ఖత్వమని విమర్శించాడు. అతని మాటలు విని అమ్నాయ వాచస్పతి అనే పండితుడు లేచి అతనికి బుద్ధి చెప్పాడు - " అయ్యా! యజ్ఞము యొక్క అంతరార్థాన్ని గుర్తించకుండా విమర్శించడానికి పూనుకున్న నీవే పరమ మూర్ఖుడవు. రైతు నాలుగు మూటల వడ్లు తీసుకు పోయి మడిలో చల్లుతాడు. ఏమిటి, ఈ పిచ్చి మనిషి తినడానికి తిండి లేకపోతే నాలుగు మూటల వడ్లను బురదలో పడవేస్తున్నాడే. అని ఎవరైనా అనుకుంటారా? ఈనాడు నాలుగు, మూటల వడ్లను బురదలో చల్లితే నాలుగు నెలల తరువాత నలభై మూటలను ఇంటికి తెచ్చుకోగలడు. యజ్ఞము కూడా అటువంటిదే". అది ‘వేస్ట్ కాదు, భగవంతునికి టేస్ట్! ఢిల్లీ రేడియో స్టేషన్ లో మాట్లాడే మాటలు అదే సమయంలో ఇక్కడ కూడా రేడియోలో వినగల్గుతున్నారు కదా. అది ఎట్లా వస్తున్నది? ఆ శబ్ద తరంగములు గాలిలోని విద్యుత్ తరంగములలో చేరి సర్వత్ర వ్యాపించిపోతున్నది. అదే విధంగా, యజ్ఞ శాలలో పండితులు దివ్యమైన మంత్రాలను ఉచ్ఛరిస్తూ యజ్ఞకుండంలో అర్పితం చేయడం వల్ల ఆ మంత్ర మహిమ గాలిలో సర్వత్ర వ్యాపించిపోయి వాతావరణాన్ని పరిశుద్ధిగావిస్తుంది.
యజ్ఞయాగాది క్రతువులు ముహూర్తములు, వేదమంత్రములు మహత్తరమైన అంతరార్థముతో కూడినవి. కవరుపై అడ్రసు సరిగా వ్రాసి పోస్టు బాక్సులో వేస్తే, అది ప్రక్క వీధి కైనా వెళ్ళగలదు. ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న ఊరికైనా వెళ్ళగలదు. అడ్రసు సరిగావ్రాయకపోతే అది ఎక్కడికీ పోయి చేరదు. అడ్రసు ముఖ్యం. పండితులు ఒక్కొక్క మంత్రమును ఉచ్చరిస్తూ యజ్ఞకుండంలో అర్పితం చేస్తూ వచ్చారు. మంత్రమే అడ్రసు. మంత్రమును స్వరబద్ధంగా చెప్పినప్పుడు వారు అర్పితం చేసింది సరియైన స్థానానికి చేరిపోతుంది. పవిత్రమైన మంత్రములను దివ్యమైన భావాలతో స్వరబద్ధంగా, సుస్పష్టంగా చెప్పాలి.
(స.సా..న.99పు.302/303)
వేదమునకు ఛందస్సు ప్రాణ సమానమైనది. ఛత్ అనే ధాతువు నుండి పుట్టినది ఛందస్సు. ఛత్ అనగా ఆనందము, ఆహ్లాదము, ఉత్సాహము, యజ్ఞములన్ని కూడా ఆనందమయములైనవి. ఉత్సాహకరమైనవి. ఆత్మప్రాప్తిని చేకూర్చేవి. వేద మంత్రములకు అర్థము గుర్తించి అనుభవించేప్పుడే ఆత్మ మనకు గోచరమవుతుంది. "విష్ణోవై విష్ణు" యజ్ఞ పురుషుడు విష్ణువని దీని అంతరార్థము. విష్ణువుకు యజ్ఞభృత్ అని పేరు. యజ్ఞభృత్ అనగా యజ్ఞమునకు యజమాని. అధిపతి. యజ్ఞమునకు "తానే" నాథుడైనప్పుడు, దాని విశిష్టత ఎంత గొప్పదై ఉంటుందో మనమువిచారించుకొనవచ్చును. అంతే కాదు యజ్ఞ కృత్ అని కూడా అతనికి పేరు, యజ్ఞము చేసే వాడని,యజ్ఞమును పోషించే వాడని కట్టకడపటికి యజ్ఞమును ధ్వంసము చేసేవాడని కూడా దీని అర్థము. అనగా సృష్టి స్థితి లయములకు ఇతనే మూలకారణము. .
"యజ్ఞభుక్ అని మరొక పేరు. అనగా మనము ఆర్పితముచేసిన సమస్త పదార్థములను,
హా మము చేసిన సుగంధ ద్రవ్యములను, మంత్రములను, యంత్రములను ఆరగించే వాడని దీని అర్థము. పవిత్ర మంత్రముల చేత స్వాహా కారములతో భగవంతునికి అర్పితము చేసిన ప్రతి పదార్థమును భగవంతుడు ఆరగిస్తాడు. అయితే భగవంతునికి ఆరగింపు చేసే పదార్థములు చాలా మధురమై, రమ్యమై, అతి ఆకర్షణీయమై, పరిశుద్ధమై, పవిత్రమైనవిగా ఉండాలి.
(స.సా. మా 84 పు.73)
ఇంద్రుడు చేతికి అధిష్ఠానదైవం. ఇంద్రయజ్ఞం అంటే సర్వహస్తములను చేర్చి క్రియాసక్తిని సమాజశ్రేయస్సు కోసం ఏకముఖంగా అభివృద్ధి చేసేది. బృహస్పతి బుద్ధికి అధిష్టానదైవం. బృహస్పతి యజ్ఞం అంటే మానవుల అందరి బుద్ధిని ఏకోన్ముఖంగా వికసింపచేసేది. చంద్రుడు హృదయమునకు ఆధిష్టాన దైవము. చంద్రయజ్ఞమంటే మానవ హృదయములన్ని కలిసి ఒకే కార్యములో నిరతులయ్యేటట్లు చేసేది. సూర్యుడు కంటికి అధిష్టానదైవం. సూర్యయజ్ఞమంటే సర్వుల దృష్టిని ఏకదృష్టిగా చేసేది. ఈ విధంగా ప్రతి యజ్ఞము మానవుల తత్త్వములపై కనిపించకుండగా గొప్ప ప్రభావము చూపుతుంది. కారణం ఈ మంత్రములు, ఈ శబ్దములు ఎంతో శక్తివంతములైనవి.
(వ 61-62.పు.210)
యజ్ఞమనగా ఏమిటి? పేరు చాలా పెద్దదే గాని మన నిత్యజీవితములో మనము చేసే సర్వకర్మలు యజ్ఞ స్వరూపమే. యజ్ఞము చేయాలనుకుంటే గొప్ప తపస్సు చేయనక్కరలేదు.
న తపాంసి న తీర్థాని నశాస్త్రాణి జపానహి
సంసార సాగరోత్తారే, సజ్జనం సేవనం వినా
తపస్సు చేయనక్కరలేదు. తీర్థయాత్రలు సలప నక్కరలేదు. జపములు ఆచరించక్కనరలేదు. ఎదుటి మనిషి సేవలు మనం చేస్తుంటే, ఎదుటివాని బాధలు మనం నివారణ గావిస్తుంటే దాని ఫలితము మనకు లభ్యమవుతుంది. సజ్జనుల సేవలు మనం చేయాలి. అట్టి సేవయే సమాజ సేవ. సమాజ సేవ వల్ల మనకు లభించేది ఏమిటి? సర్వేశ్వారానుగ్రహము మనం పొందగలము.
(ద.స. స.పు.6)
యజ్ఞములు రెండు విధములు: ఒకటి ఆంతర్ యజ్ఞము రెండవది బహిర్ యజ్ఞము. అంతర్ యజ్ఞమనగా జ్ఞానము చేత మానవుని యందున్న దైవత్వాన్ని దర్శించ యత్నించడం. ప్రతి మానవునియందు దివ్యత్వమైన దైవత్వమున్నది. అది ధ్యానము ద్వారా లభ్యమవుతుంది.ఈ దైవత్వాన్ని సందర్శించడానికి కొన్ని ఆర్పితము గావించాలి. మనస్సు బలి పీఠము, ఈ మనస్సనే బలి పీఠం పైన మానవుని యందున్న దుర్గుణములను బలి చెయ్యాలి. దైవమే నివాసముగా ఉన్న ఈ దేహములోఈ దుర్గుణములు ఎట్లు వచ్చాయి? మానవ జన్మము ఒక్క జన్మములో లభించినటువంటిది కాదు. అనేక జన్మముల తదుపరి మానవ జన్మ ప్రాప్తించింది. కనుక నరజన్మను కడ జన్మగా విశ్వసిస్తారు. మానవ అనే పదమే మానవుడు అనేక జన్మల నుండి వస్తున్నాడని నిరూపిస్తున్నది. "మా" అనగా కాదు "నవ” అనగా క్రొత్తది. మానవ అనగా క్రొత్తది కాదు పాతదే అని దీని అర్థము. 84 లక్షల జీవరాసుల తరువాత మానవ జన్మము వస్తున్నది. కడ జన్మమైన నరజన్మము లోపల గడచిన జన్మల గుణములన్ని కూడా చేరుతుంటాయి. ఎన్నియో మృగజన్మలు, క్రిమి కీటకాదులు జన్మల నెత్తియుండ వచ్చును. వాటి తదుపరే ఈ నరజన్మ ప్రాప్తిస్తుంది. .. బంతులక్షణాలకు కారణం: కనుకనే మానవునియందు, దివ్యత్వం ముండినప్పటికి మదము మానవునిబాధిస్తున్నది. మదము మానవుని లక్షణము కాదు. దున్నపోతు లక్షణము. మదములో మనము సంచరించామంటే ముందు జన్మలో దున్నపోతుగా పుట్టినామని నిర్ధారణ చేసికొన వచ్చును. కొంతమంది చాలా మూర్గంగా ప్రవర్తిస్తుంటారు. అది కూడా మానవ లక్షణము కాదు. ఇది గొర్రె గుణము. మన మెప్పుడో గొర్రెగా పుట్టినామని నిర్ణయము చేసికొన వచ్చును. ఒక్కొక్కప్పుడు మానవునియందు దొంగ బుద్ధులు బయలుదేరు తుంటాయి. ఈ దొంగబుద్ధి కూడా మానవుని గుణము కాదు. ఇది పిల్లి లక్షణం. ఈ లక్షణము మనలో ఉంటే మన మెప్పుడో పెల్లిగా పుట్టి ఉంటామని నిర్ణయించుకోవచ్చు. ఒక్కొక్క సమయములో మానవుని బుద్ధి అతి చంచలముగా ఉంటుంది. ఈ చంచలత్వము కూడా మానవుని లక్షణముకాదు. చంచలత్వమునకు పుట్టిన ఇల్లు, పెట్టిన పేరు కోతి. ఈ లక్షణము మనలో ఉంటే, మనము కోతిగా ఒకప్పుడు పుట్టినామని నిర్ధారణ చేసికొన వచ్చును. నరజన్మకు పూర్వము కోతి జన్మ నెత్తినవారు, మానవులలో అధిక భాగముండటం వల్ల, చాలామంది చంచలత్వముతో కూడి యుంటున్నారు. ఇతరులచేత అనేక ఉపకారములు సహాయములు పొంది. వారికే అపకారం చెయ్యడం, కీడును సంకల్పించడం ఇలాంటి చర్యలకు పాల్పడు తుంటారు. తమను ఉన్నత స్థాయికి తెచ్చినవారికే చెడును కోరుకుంటారు. ఇది మానవుని గుణము కాదు! పాలు తాగిన సర్పము విషమును చిందుతుంటుంది. పాలు, గ్రుడ్లు మధురమైన ఆహారమునందించిన యజమానినే ఈ పాము చంపుతుంది.సర్పమునకు కృతజ్ఞత లేదు. ఈగుణము మనలో ఉండినప్పుడు మన మెప్పుడో విష సర్పముగా పుట్టినామని నిర్ణయము చేసికొనవచ్చును.
మనస్సుకే ఆహ్వానం: కనుక మనస్సనే బలి పీఠము పైన దున్నపోతు అనే మదమును, మూర్ఖత్వమనే గొర్రెను, దొంగబుద్ధి అనే పిల్లిని, చంచలత్వమనే కోతిని, కృతఘ్నుడనే సర్పమును బలి చెయ్యాలి. ఈ విధమైనదుర్గుణములను దుష్టస్వభావములను బలి చేయడమే అంతర్ యజ్ఞము. దురదృష్టవశాత్తు ఈ అంతరార్థమును గమనించక మనము బాహ్యమైన జంతువుల బలి ఇస్తున్నాము. కనకనే ఉన్న దుర్గుణములు మరింత అభివృద్ధి అవుతున్నవి.
ఈ యజ్ఞము వలన మానవునందున్న పవిత్ర గుణములను బలపరచుకొన వచ్చును. ఈ యజ్ఞములో ముఖ్యముగా ఇంద్రుని ఆహ్వానము అధికముగా జరుగుతుంది. ఇంద్రుడనగా ఎవరు? ఇంద్రియముల కధిపతియైన మనస్సే ఇంద్రుడు. ఈ మనస్సనే దానిని ఇంద్రియములు అనేక విధములుగా లోబరచుకొనడము చేత మనస్సనే ఇంద్రుని ఈ యజ్ఞములో ఆహ్వానించడము జరుగుతుంది. ఈ ఇంద్రునకు మరొక పేరు పురుహుతుడు. అనగా అనేక పర్యాయములు ఆహ్వానింప బడునటువంటి వాడు. కనుకనే ఈ మనస్సనేదానిని మనము మరి మరీ ఆహ్వానిస్తుంటాము. ఈ మనస్సును వేదము రుద్రడని కూడా పేర్కొంటుంది. ఒకే మనసు, ఇంద్రుడని కూడా పేర్కొంటుంది. ఒకే మనస్సు ఇంద్రుడని, రుద్రుడని, పురుహూతుడని ఇన్ని పేర్లతో చెలామణి అవుతున్నది. అయితే రుద్రుడనే పేరెట్లు వచ్చింది? ఇంద్రియములను స్వాధీనము చేసుకున్న సమయములో ఇంద్రుడు, ఇంద్రియములను మధించి తాను సర్వాంతర్యామిగా సర్వేంద్రియములను ప్రకటించినపుడు రుద్రుడుగా రూపొందుతాడు. ఇతనే ఈశ్వరుడు. ఇంద్రియములను నిగ్రహించిన ప్రతి మానవుడు ఈశ్వరుడే. మానవత్వము నుండి ఈశ్వరత్వమునకు బయలు దేరిపోవాలను కున్నప్పుడు ఇంద్రియములకు స్వాధీనమై ఉన్న మనస్సు కంటే ఇంద్రియములను వశం చేసుకున్న రుద్రునిగా మనము రూపొందడము సాధన లక్షణము. ఏతావాతా మానవత్వము ఈశ్వరత్వముగా మారిపోవడమే అంతరికయజ్ఞము యొక్క లక్ష్యము. అనగా మనము ఇంద్రియములను వశము చేసికోవాలి. ఇష్టానుసారము ఈ మనస్సు పరుగెత్తకూడదు. మనస్సు ఇంద్రియములకుయజమాని, యజమానియైన మనస్సు తన పరిచారకుల వెంట పరిగెత్త కూడదు. పరిచారకుల వెంట పరుగెత్తే ప్రభువు చులకనై పోతాడు. కేవలం అనుకరించే వాడుగా రూపొందుతాడు. అనుకరణ నీడవంటిది. నీడకు ఒక రూపము, ఒక నామములేదు. ఈ రూపనామములు లేవు కనుక దీనికి కీర్తి లేదు. దీనికి ప్రాణము కూడా లేదు. ఈ ఇంద్రియములను అనుసరించడం చేత మనస్సు తన శక్తిని కోల్పోతుంది. కనుకనే మానవుడు బానిసగా తయారవుతున్నాడు.
ఇంద్రియాల నిగ్రహానికే యజ్ఞం: ఆశలున్న వాడే పరులలో సంబంధము పెట్టుకుంటాడు, పరులను ఆశ్రయించవలసి వస్తుంది. పరులతో కూడి, ఆడి తిరుగవలసి వస్తుంది. ఆశలేలేని వానికి ఎవ్వరితోనూ సంబంధము ఉండదు. కనుక మనము ఇంద్రియములతో సంబంధము పెట్టుకొనడం వలన ఆశలు పెరిగి పోతుంటాయి. ఇంద్రియాలను వశము చేసికొవడానికి ప్రయత్నము చేస్తే జగత్తంతా మన చెంతకు పరిగెత్తుకొని వస్తుంది. నిజముగా ఈ యజ్ఞయాగాదులు ఇంద్రియ నిగ్రహము కోసము చేసే ప్రధాన క్రతువులు, యజ్ఞయాగాదులు చేస్తూ, ఇంద్రియాలను ఉద్రేక పరచుకున్నామంటే ఇది క్రతువుల యందు సంపాదించుకొనే పాప మవుతుంది.
బాహ్యముగా జరిగే ఈ యజ్ఞముల అంతరార్థమును గమనించినప్పుడే వాటి విశిష్టతను తెలిసికొన్న వారమవుతాము. కనుక నిత్యజీవితములో మనము యజ్ఞముల ద్వారా తెలిసికొనవలసిన వెన్నో ఉన్నాయి. ఈ యజ్ఞముల స్వార్థం కోసము చేసేవి కావు. లోకకళ్యాణం కోసమై చేస్తున్నాము. ఇది నిజ తత్వాన్ని గుర్తింప చేసేటటువంటిది. దురదృష్టవశాత్తూ అంతరార్థములను గుర్తించలేక బాహ్యార్థములను మాత్రమే గ్రహిస్తూ బాహ్యమైన మార్గములను మాత్రమే అనుసరిస్తున్నాము. ఇంద్రియాలను నిగ్రహించుకోలేక పోతే ఎన్ని సాధనలు చేసినా అవి వృధా అవుతాయి.
పాతవాసనల బలి: మనలో అభివృద్ధి అవుతున్నదుర్గుణాలను అదుపులో పెట్టుకొనుటకు తగిన కృషి చెయ్యాలి. పాత జన్మల వాసనలను మనసునే యజ్ఞ వేదికల పైన బలి ఇవ్వాలి. మానవునకు ప్రధానగా క్రోధము, ద్వేషము, అసూయ అధికంగా పెరుగుతున్నాయి. వీటికన్నింటికీ కారణము స్వార్థమే. స్వార్థముండడము చేతనే క్రోధము. ద్వేషము, అసూయాదులు పెరుగుతున్నవి. క్రోధము అసూయ, ద్వేషము, చిరుత గుణములు, ఈ గుణములు మనలో ఉండరాదు. దేనినైనా నమ్మవచ్చును గాని, చిరుతపులిని నమ్మరాదు. ఈ కోప, తాప దంభ అసూయాదులను జయించినట్లుగా నటిస్తూ కొన్ని యుక్తులను కూడా మనము ప్రవేశ పెడుతున్నాము. ఈ యుక్తిని యోగముగా చెప్పుకొంటున్నాము. ఇది యోగము కాదు. నక్క లక్షణము.
ఈ గుణములు మనలో అప్పుడప్పుడూ వస్తున్నాయి గనుక, వచ్చిన తక్షణమే ఈ మనస్సు అనే బలి పీఠముపై వానిని బలి ఇవ్వడానికి ప్రయత్నము చెయ్యాలి. ఈ బాహ్యయజ్ఞములు సంవత్సరమునకు ఒక పర్యాయము ఏదో ఒక ప్రదేశమునందు జరుపుతుంటాము. కానీ అంతర్ యజ్ఞవేదిక మన మెక్కడకు పోయినా వెంటనే ఉంటుంది. ఇది దేశకాల పాత్రలకు అతీతమైన వేదిక. ఈ పీఠము నిరంతరము నీడవలె మన వెంటనే ఉంటుంది. దుర్గుణములు బయలు దేరిన తక్షణమే వాటిని సంహరించడానికి ప్రయత్సము చెయ్యాలి. ఈ విధమైన చర్యలకు సంసిద్ధులమైనప్పుడే దైవ ప్రీతికి అర్హులు మవుతాము. దైవాను గ్రహమునకు, దైవ ప్రీతికి పాత్రులు కావాలని కోరే ప్రతి వ్యక్తి ఈ దుర్గుణాలను మొదలు దూరం చెయ్యాలి. ఈ దుర్గుణాలను ఏనాడు దూరము చేస్తామో ఆనాడే మనలో దైవత్వం ఆవిర్భవిస్తుంది. దైవత్వము మనలో ఏనాడు ఆవిర్భవిస్తుందో ఆనాడే మనము "మనయేవ మమష్యాణాం కారణం బంధ మోక్షయోః " మనస్సే బంధనకు మోక్షానికి మూలకారణమని గుర్తిస్తాము.
కనుక మనము పవిత్రమైన హృదయాన్ని అభివృద్ధిగావించుకొని దివ్యత్వమైన ఆత్మతత్వాన్ని పెంచు కోవడానికి కృషి చేయ్యాలి.
(స.సా.న. 1983 పు.263/265)
(చూ॥ ఈక్షతేర్నాశబ్దం, జ్ఞానయజ్ఞము, శ్రద్ధ)