వైదికోపాసన : -
ఇది నాలుగు విధములుగ వున్నది. (1) సత్యవతి (2) అంగవతి (3) అన్యవతి (4) నిదానవతి అని.
“సర్వవ్యాపిన మాత్మానం క్షీరేసర్పిరివార్పితమ్" పాలలో నెయ్యి కలసివున్నట్లే ఆత్మ సర్వవ్యాప్తమై ఉన్నదనే భావముతో చేసే సాధనే సత్యవతీ ఉపాసన అంటారు. “మాయాతీత మిదం సర్వం జగదవ్యక్తమూర్తినా" నేనీ సమస్తంలోఅవ్యక్తంగా వ్యాపించివున్నాను. నన్ను అంతటా నాలో అంతటిని చూస్తూ ఉండే సత్యవతీ ఉపాసకునకు నేను కనిపించకుండా ఉండను. నాకు ఆ ఉపాసకుడు కనుపించకుండా ఉండడు అంటూ ఉన్నాడు మాధవుడు. ఆ సర్వాత్మనే నిప్పు, గాలి, సూర్యుడు, చంద్రుడు (మొదలైన వన్నీ) అనే భావముతో చేయబడే అంగవతీ ఉపాసన. ప్రాణరూపమై అందరికీ ఆత్మీయమైన ఆ గాలి అన్నింటిని వెలిగించు అగ్ని ప్రాణములకు వివిధ జీవనాధారములైన అన్నము ఉత్పాదన చేయటానికి కావలసిన వరుణ (వర్షము) అని పరమాత్మను పొగుడుట అంగవతీ ఉపాసన.
“శంఖచక్రగదాపాణి" అనివిష్ణువును, "ఏకదంతగజాననా" అని విఘ్నేశ్వరుని."శూలపాణి" అనిఈశ్వరుని,"కోదండపాణి"అనిరాముణ్ణి,"శిఖిపింఛమౌళి మురళీథర"అనికృష్ణుని, "వీణాపాణి" అని సరస్వతిని ఇలా ఆయా దేవతల చిహ్నములను ధ్యానపూర్వకంగా మనస్సును తన్మయము చేసుకొని హృదయంలో ఆరాధిస్తూ ఉండటం అన్యవతీ ఉపాసన అని అందురు.
"శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం,అర్చనం,వందనం,దాస్యం, సఖ్యం,ఆత్మనివేదనంతన్మయాసక్తి, పరమ విరహాసక్తి" అని పదకొండు భక్తిసాధనలు కూడా నిదానవతీ ఉపాసనలో చేరును.
సత్యవతీ, అంగవతీ, అన్యవతీ. నిదానవతీ ఉపాసనలు అనుక్రమేణా ఒకదానికంటే ఒకటి అత్యుత్తమ స్థితికి కారణా లై విశ్వనియంతతోతాదాత్మ్యా న్ని ప్రసాదిస్తాయి. ప్రతీకోపాసన అని మరొకటి ఉన్నది. అది అంగవతీ ఉపాసన లాగానే, ప్రతిరూపోపాసనః - "సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖమ్". ఆత్మయైన మాధవునికి ఆంతటాచేతులూ,కళ్ళూ; చూస్తాడు,ఆలోచిస్తాడు, తింటాడు,వింటాడు. సర్వోన్నతఆదర్శభావముతోప్రతిరూపోపాసనజరుగుతూవుంటుంది.
భావోపాసన:-
మంచి గుణములన్నింటినీ మాధవుని లో అమితంగా వుండినట్లు చూడటమే..
గీతోపాసనం:-
భారతం పంచమ వేదం. అది ఐహిక అముష్మిక ధర్మాలనిధి. మాధవుడు భారతదేశ ధర్మక్షేత్ర రంగస్థలంలో తన నాటిక సామగ్రిని దింపుకొని ఆడిన అద్భుతమైన ఆట, మహాభారతము. భారత నాటకానికి పాత్రధారులును, మాటలను, పాటలను సమకూర్చిన రచయిత, నటకుడు, దర్శకుడు, నిర్మాత అంతా ఒక్క మాధవుడే. ఒకవైపున అధర్మవృద్ధమైన అపార భౌతిక బలం, మరొకవైపున ధర్మవృద్ధమైన పరిమిత ఆత్మబలం.
ఈ రెంటి ఘర్షణలో పర్యవసాన రూపమైన ధార్మిక విజయ జ్యోతిగా తనను నిర్దేశించుట, ఇదే భారతామృత సర్వస్వం, అదే భగవద్గీత. మహాభారత సారాంశమంతయూ భగవద్గీతలో ఉన్నది. "కరిష్యేవచనం తవ” నీవు చెప్పినట్లే చేస్తాను. "స్వధర్మే నిధనం శ్రేయః" ఇదే ఐహిక తత్వానికి గీటురాయి. సర్వశ్రేయస్సులను ప్రవహించే శక్తిని నిర్లక్ష్యము చేసి కళ్ళు మూసుకొని "అహం బ్రహ్మాస్మి" అనే అహంకారముతో బాధపడే నకిలీ బ్రాహ్మలకు క్లేశమే ఫలితము. పొట్టుదంచితే బియ్యము రాదుకదా. అసలు బ్రహ్మయే కృష్ణుడు.
అద్వైతోపాసన ఆదిశంకరులు:-
ఆవు శరీరములో పాలు ఉన్నాయి. ఆపాలలో నెయ్యి ఉన్నది.ఆయినా ఆ నెయ్యిలో ఆవుకు బలము రాదు. ఆ పాలను పితికి,కాచి, తోడు పెట్టి, చిలికి, వెన్నతీసి, కాచి, ఆ నెయ్యిని మళ్ళీ ఆవుకు తినిపించిన బలము కలుగుతుంది. అలాగే సర్వేశ్వరుడు సర్వాంతర్యామి అయినా, సాధనోపచారములు లేకుండా, మానవులలో హితం చేయజాలడు. నువ్వులలో నూనె, పెరుగులో వెన్న, భూమిలో నీరు, కట్టెలో నిప్పు కలసి వుండునటుల సర్వాంతర్యామి మానవుల శరీరములలోను, మనసులోను కలసివున్నాడు. వాటిని వేరు చేయాలంటే ప్రయత్నం, సాధన చేయాలి. అప్పుడు ఆ రెంటి అభదత్వం, అద్వైతం తెలుస్తుంది. అదే మోక్షం..
విశిష్టాద్వైతం: -
రామానుజుడు; ఉపాసించదగిన పరమాత్మను తనకు వేరుగా వున్నట్లు భావించాలా? లేక తనలో కలిసివుండినట్లు భావించాలా? సాధకునిది ప్రశ్న. ఇక జవాబు: - జీవుడు శరీరానికి ఆత్మ, అలాగే దేవుడు జీవునకు ఆత్మ. అలా భావించి ఉపాసించుటే రామానుజాచార్యుల విశిష్టాద్వైతోపాసన. ఈ సమస్త భూతజాలము ఎవనిలో ఉన్నాయో యెవరు ఈ సమస్తానికి అంతర్యామిగా వ్యాపించి యున్నారో ఆ పరమపురుష పరమాత్మ అనన్యభక్తి (ప్రపత్తి) తోనే లభ్యమవుతారు. అని పరజ్ఞాన ప్రపత్తిపూర్వకంగా పరమ పురుషోపాసన చేయటమే విశిష్టాద్వైతం. “త్యమేవ సర్యం మమ దేవ దేవ", నీవే నాగతి, పతి అనే అనన్యభావంతో ఉపాసించుటే.
ద్వైతోపాసన-మధ్వాచార్యులు –
పతిపత్ని సంబంధమే జీవాత్మ పరమాత్మ సంబంధం కూడా. అవ్యయుడైన విష్ణుభగవానుని భర్తగా ద్వైతభావముతో ఉపాసించుట. చైతన్యోపాసనః - శ్రీకృష్ణ చరణాసక్తి, భక్తిలేనిదే జీవన్ముక్తి మాట అటుంచి కనీసం బుద్ది శుద్ధం కావటం కూడా అసంభవము అని అంటాడు చైతన్యుడు, మునులూ, ఆత్మారాములు అయిన వారికి లౌకిక గ్రంథాలు లేక పోయినా సూదంటురాయిలాంటి శ్రీహరి కల్యాణ గుణగణ విశేషంవల్ల నిష్కామంవల్లా భక్తి పారవశ్యం వారికి కలుగుతూ వుంటుందట. ఆ పారవశ్యముతో సిగ్గూ, బిడియాలు వదలి బిగ్గరగా శ్రీహరి నామ సంకీర్తనం, చేస్తూ గగుర్పాటుతో, కంటిధారలతో నృత్యం చేస్తూ అసలైన ఆనందాన్ని అనుభవిస్తూ వుంటారు. శ్రీచరణులు ఈ విశ్వాన్ని పావనం చేస్తూ వుంటారు. ఈ విధంగా పరానురక్తితో నామసంకీర్తనలలో,ప్రధానంగా కలిగింది.చైతన్యుల ఉపాపన,నామసంకీర్తనలలో, తన్మయత్వంతో నృత్యం చేస్తూ తదాత్మ్యభావముతో నిలిచి వుండుట ప్రధాన లక్ష్యము.
గౌడీయోపాసనః –
అవ్యక్త పురుషోత్తమ రూపములో కృష్ణపరమాత్మను, వ్యక్త పరాశక్తి ప్రకృతి రూపములో రాధను దర్శనము చేస్తూ ఈ కలిలో రాధామాధవ నామసంకీర్తన చేస్తూవుంటే పొందే ఆనందమే కేవలము మోక్షము అంటారు గౌడపాదాచార్యులు. ఆయన సనాతన గోస్వామి. ఆపరమాత్మ ఆనందరస స్వరూపుడు. ఆ రసాన్ని పొందితేనే ప్రాణికి నిజమైన ఆనందం కలుగుతుంది. అనే శ్రుతి వచనానుసారం – ఆ రసానంద విధిని అనుభవించాలంటే శ్రీ రాధామాధవ నామమే శరణ్యం అంటారు.
నింబార్కాచార్యులు-
ద్వైతోపాసవలో పురుష ప్రకృతి సంబంధం వలెనే, జీవాత్మ పరమాత్మ సంబంధంగా భావించి ఉపాసించా లంటారు. వల్లభాచార్యులు, శుద్ధాద్వైతోపాసనలో "కృష్ణస్తు భగవాన్ స్వయం" - కృష్ణభగవానుడు స్వయంగా పరమాత్మ. ఆ సర్వాత్మను పొందటమే శుద్దాద్వైతమోక్షము.
శైవోపాసన –
"లింగం సర్వకాలం" పృధివ్యాధి తత్త్వాల స్థితి గతులకు మూలకారణమైన లింగము. అదే పరమశివస్వరూపం. ఆ యిష్ట లింగ ప్రాప్తినే మోక్షము అని అంటారు.
శివాద్వైతోపాసన –
జీవాత్మ తనను కర్తగాను, భోక్తగాను భావించుకొని ప్రకృతి బద్ధుడు అవుతున్నాడు. శివప్రాప్తి కలిగితేనే జీవునకు మోక్షము కలుగుతుంది. అంటే, శివైక్యత కలుగుతుంది అంటారు. వీరశైవోపాసన - (జంగములు) ఒక ఈశ్వరుడు తప్ప వేరు యేమీ లేదంటారు. ఈశ్వర విభూతిని (శక్తి) పొందటమే ముక్తి అంటారు.
పాశుపతోపాసన –
జీవుడు ప్రకృతి గుణాలనే పాశాలతో కట్టివేయబడిన పశువు. ఆ పశువుకూ, ఆ పాశాలకూ, ఆ ప్రకృతికీ నియంత పరమేశ్వరుడు. అందుకే పశుపతిని పొందటమే ముక్తి అంటారు.
శాక్తోపాసన -
"సర్వదేవమయీ దేవీ" ఆదిపరాశక్తి సర్వదేవమయి. ఈ వివిధ విచిత్ర రూపములకు నామములకు కారణమైన ప్రకృతియే మాయాశక్తి. ఈ శక్తి కలిగినవాడే మహేశ్వరుడు. ఈ జంట అవయవాలతో ఈ నింగి, నేల నిండిఉన్నై. అవ్యక్తంగా పురుషరూపంలో వున్న పరమేశ్వరతత్త్వమే వ్యక్తంగా శ్రీ రూపములో మాయగావున్న పరాశక్తి. ఆమే జగన్మాత. అమ్మలగన్న యమ్మ. ఆ పరాశక్తి మనలో స్వాభావికమై తెలిపినా బలముగా, క్రియగా అనుభవమౌతుంది.
జైనోపాసన –
జైనులు (మార్వాడీలు) వైష్ణవ ప్రాధాన్యంగా వుంటుంది. శంఖచక్రధారుడైన విష్ణుభగవానుని ప్రతిమలు దేవాలయములలో పూజిస్తారు.
ణమో అయిరి హరితాణమ్ ణమో సిద్ధాణమ్:
ణమో అయిరియాణమ్ ణమో ఉనఝ్ఘూయాణమ్:
ణమో లోప సబ్య పాహూణమ్
ఇవే జైనుల మంత్రాలు.
కామాది వైరులను జయించే మహావీరులకు,సిద్ధులకు,ఆచార్యులకు,ఉపాధ్యాయులకులోకములోవున్న సర్వసాధువులకు నమస్కారములు. ఈ పంచనమస్కారములు పాపపరిహారం చేస్తాయి. ఈ మంత్రధారిణి సర్వశుభం. ఈ మంత్ర భావంలోనే ముక్తి పొందాలంటారు జైనులు.
సిక్కులు: -
సాంప్రదాయోపాసన ఆత్మతత్యోపదేశాన్ని చేసే గరునూ, ఆయన ఉపదేశాల సమ్మేళనమయిన *గ్రంథసాహెబు" నూ పూజిస్తూ, కీర్తిస్తూ ఉండటమే పరమధర్మం. భారతీయ సంప్రదాయంలో సిక్కు సంప్రదాయము అంతర్భావం.
క్రెస్తవోపాసన –
ఏసు ప్రభువే రక్షకుడు. తెలిసియో, తెలియకనో పాపాలు చేయటం మనిషికి పరిపాటి. మానవుల పాపాలను తొలగించి పరిశుద్ధులను చేయడానికి ఏసుప్రభువు శిలువపై రక్తాన్ని చిందించాడు. ఆ ప్రభువునూ, ఆయన ఉపదేశాలనూ, "బైబులు" అనే మత గ్రంథములోని సూత్రాలను ఆచరిస్తూ ఉపాసిస్తూ ఉండటమే మనిషికి మంచి దారి. క్రైస్తవోపాసనలో స్తోత్రము చేయటమే ముఖ్యంగా ఉపాసనా నియమం.
మహమ్మదీయోపాసన –
ఈమాన్దారీ ఖైదామే తో - స్తెగంబర్ మే భరోసా. ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం దైవము పై సర్వభారము పెట్టి యుండటం, దైవశక్తి అడుగడుగునా గుర్తించుచూ ఉండటం - ఇవి లోకములో ప్రధాన నియమాలు. దేహత్యాగం చేసిన తరువాత పరలోకంలో దేవుని దర్బారులో తన వాస్తవికతను నిరూపించుకొనటం అంటే - అందుకు తగిన రుజువర్తన జీవితాంతం వరకూ కలిగియుండటం. దైవవాణియైన ఖురాను గ్రంథబోధనలను అక్షరాల ఆచరించటం. ఇవి మహమ్మదీయోపాసనలో పారలౌకిక నియమావళి..
"అల్లా హో అక్బర్ లా యిలాహ్" "ఇల్లల్లాహ్" - ఇవి మహమ్మదీయుల ప్రధాన మంత్రాలు. (భగవంతుడు సర్వోత్తముడు. అంతకంటే మించిన విశ్వనియంత లేడు. అతడే ఆరాధించ తగినవాడు అని ఈ మంత్రము యొక్క ఆర్థము)
నాకంటే మించినది లేదు. “నాపర మస్తి కించిత్ " అనే భగవద్గీతార్థము, మహమ్మదీయ మంత్రార్థానికి సామ్యాలే. అందువలన మహమ్మదీయ సంప్రదాయము కూడా భారతీయ హైందవ సంప్రదాయములో అంతర్ భాగమే. ఈ విధంగా మానవుడు ఆత్మపరిశోధనకు ప్రారంభించి ఎప్పటినుండీ తరతరాల నరజాతికి తారకమైన అనంత విజ్ఞాన విధిగా ఎరింగిన భారతీయుల సంస్కృతి అనంతగంభీరం కావటంవల్ల, భిన్న భిన్న సంప్రదాయల రూపాలలో నదులెన్ని వచ్చిననూ, చేరిననూ పోంగక, కృంగక ధర్మసీమలో నిలచియున్నది.
అంతేకాక విశ్వాత్మకమై సార్వభౌతికమై సర్వకాలికమై, పెంజీకటి కవ్వల నేకాకృతియై వెలిగే విజ్ఞాన విజయ జ్యోతియై వెలుగుచున్నది. ఇట్టి పవిత్రమహా సాంస్కృతిక క్షేత్రమైన భారత ధాత్రిమీద మనిషిగా పుట్టుటకంటె సుకృతము లేదని తెలిసికోగలిగిన, మనిషికి కలిగే ఆనందం అపారం.
(స. వా. పు.171/178)
(చూ|| త్రికాండస్వరూపము)